Mar 03,2023 08:25
  • త్రిపుర, నాగాలాండ్‌ల్లో బిజెపి
  • మేఘాలయలో హంగ్‌ ?

న్యూఢిల్లీ : మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. త్రిపుర, నాగాలాండ్‌ల్లో బిజెపి కూటమి ఆధిక్యత సాధించగా, మేఘాలయలో హంగ్‌ ఏర్పడింది. కార్పొరేట్లు సమకూర్చిన డబ్బును అసాధారణమైన రీతిలో ఖర్చు చేసిన బిజెపి త్రిపురలో బొటాబొటీ మెజార్టీతో బయటపడింది. నాగాలాండ్‌లో అతి కష్టమ్మీద అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో ఏ పార్టీకి సాధారణ మెజార్టీ లభించలేదు. దీంతో అక్కడ హంగ్‌ ఏర్పడింది. మొత్తం 60 స్థానాలు ఉన్న త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటుకు 31సీట్లు అవసరం కాగా, బిజెపి స్వల్ప మెజార్టీతో బయటపడింది. గత సారి 44 సీట్లు సాధించిన బిజెపి- ఐపిటిఎఫ్‌ కూటమి ఈసారి 33 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చితే త్రిపురలో బిజెపికి సీట్లు తగ్గడంతోబాటు ఓట్ల శాతం కూడా తగ్గింది. 2018లో ఆ పార్టీ 42.3 శాతం ఓట్లు సాధించగా ఈ సారి 39 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సిపిఎం 11 సీట్లు, 24.5 శాతం ఓట్లు సాధించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 28 స్థానాల్లో పోటీ చేసినా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మొదటిసారిగా త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసిన తిప్రా మోతా పార్టీ (టిఎంపి) 13 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ 3స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి ప్రభుత్వం గత అయిదేళ్లలో తీవ్ర నిర్బంధం ప్రయోగించడం, తిప్రా పార్టీ కొత్తగా రంగ ప్రవేశం చేసి గిరిజన ఓట్లను చీల్చడం వల్ల వామపక్షాలు ఆశించిన రీతిలో ఫలితాలు సాధించలేకపోయాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. మరోవైపు నాగాలాండ్‌లోనూ ఎన్‌డిపిపితో కలిసిన బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌డిపిపి-బిజెపి కూటమి 38 సీట్లు గెలుచుకోగా, ఎన్‌పిపి 4, ఎన్‌పిఎఫ్‌ 2, ఇతరులు 16 స్థానాల్లో గెలుపొందారు. మేఘాలయలో మాత్రం హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎన్‌పిపి ఏకైక అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ పూర్తిగా రాలేదు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌పిపికి 27స్థానాలు రాగా, బిజెపికి 2, టిఎంసికి 5, కాంగ్రెస్‌కు 5, ఇతరులు 10స్థానాల్లో విజయం సాధించారు. ప్రాంతీయ పార్టీ అయిన యుడిపికి 11సీట్లు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటనేది రసవత్తరంగా మారింది.

భారీగా డబ్బు కుమ్మరించి బొటాబొటీగా బయటపడ్డారు ! : త్రిపుర ఎన్నికలపై సిపిఎం పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : త్రిపురలో తుది ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ మొత్తం 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి కూటమి స్వల్ప మెజారిటీ దిశగా పయనిస్తోందని సిపిఎం పేర్కొంది. త్రిపుర ఫలితాలపై పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం వ్యాఖ్యానిస్తూ, 2018ఎన్నికల్లో 44 సీట్లు పొందిన బిజెపి కూటమి ఈసారి బొటాబొటీ మెజారిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో బిజెపి అసాధారణ రీతిలో డబ్బు కుమ్మరించి, స్వల్ప మెజార్టీతో బయటపడింది. బిజెపిని తిరస్కరించి, వామపక్ష సంఘటన, ప్రతిపక్ష అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలను సిపిఎం అభినందించింది. గత ఐదేళ్లుగా ఎదురవుతున్న తీవ్రమైన అణచివేతను కూడా ఎదుర్కొని ధైర్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన వేలాదిమంది సిపిఎం, వామపక్ష సంఘటన కార్యకర్తలకు పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియజేసింది. బిజెపి ప్రభుత్వం అనుసరించిన క్రూర నిర్బంధం వల్ల కార్యకర్తలెవరూ దీర్ఘకాలంగా ప్రజలను కలుసుకోలేకపోయారని పేర్కొంది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మరింత నిబద్ధత, శక్తి సామర్ధ్యాలతో సిపిఎం, వామపక్ష సంఘటన కృషి చేస్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

tripura

 

nagaland

 

meghalaya