కంటి కింద బాధ
నలుగుతూ ఉంటుంది
పాతవేవో కూడా
పదునుగా తగులుతూ ఉంటాయి
గడ్డకట్టే చలికి
దేహం గజగజా వణుకుతుంది
నీకు కూడా అంతేనేమో మరి
నువ్వు మాత్రం చందమామలా
చల్లగా నవ్వుతుంటావు
నేను అమావాస్యలా నల్లముఖమేస్తాను
ఎప్పటి మోడులనో దులిపి
ఎండుటాకులను ఏరుకోవడం
నాకు అలవాటు
పగిలిన ముక్కలను అలమరలో సర్దేసి
రికామీగా తిరగడం నీకే చెల్లింది
నడిచేదారిలో తారసపడిన
పూలతోటలను మాత్రమే లెక్కపెట్టుకోమని
ఎంత చెప్పినా నాకు చెవికెక్కదు
ఆశల నాట్లేసుకుంటూ నడిస్తేనే కదా
తీరాన్ని అలసట లేకుండా చేరగలమని
నచ్చచెప్పుతుంటావు
దారంతా ఎన్నో దుఃఖపుచెట్లు
గిలగిలలాడుతూ
కన్నీటిబొట్లై రాలిపడుతుంటాయి
అంతలోనే చిగురుతొడిగి
ఉత్సాహాన్ని అద్దుకుంటాయి
అన్నీ గమనించినా
ఎప్పటిలాగే శకలాలుగా విడిపోతుంటాను
నువ్వు ప్రతిసారీ మృదువుగా
పాఠాన్ని బోధిస్తూనే ఉంటావు
మిత్రమా.. ఇప్పుడిప్పుడే
తడిలేని విత్తులోంచి సైతం తలెత్తే
కొత్తమొలకను శ్రద్ధగా చూస్తున్నాను
నేను నాలాగే.. ఇలాగే
ఉండాలేమో.. అనుకున్నాను
నీలాగా కూడా ఉండొచ్చని
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
- పద్మావతి రాంభక్త
99663 07777