Jul 30,2023 07:59

ఎన్నో కోల్పోతున్నాం
కనిపించని వాస్తవమేదో
మనసును తట్టి లేపుతుంటే
నిజానికి అబద్ధానికి మధ్య గోడపై పిల్లిలా

గడిచిన జ్ఞాపకాలలో
మానని గాయాలు తిష్ట వేయగా
సంకోచిత స్థితిలో మది ఆలోచనలు
మొద్దు బారిపోతుంటే!

ప్లాస్టిక్‌ మొక్కల తోటలో
అత్తరు పూల వాసనల మోజులో
స్వచ్ఛమైన పరిమళాలను వదిలేస్తూ
తూర్పు సింధూరపు అందాలను కాంచలేక
వెలవెలబోయే జిలుగు వెలుగుల కోసం
అర్రులు చాచుతూ..

మనలో శక్తియుక్తులను మరుగున పడేసి
రాని విద్యకు మెరుగులు అద్దుతూ
కోహినూరు వజ్రమే కాళ్ళకు తగిలిన
రంగురాళ్ల మెరుపులకు ఆకర్షితులై
అస్థిత్వాన్ని కోల్పోతున్నాం !

ఎన్నో కోల్పోతున్నాం
అవగాహన రాహిత్యమో
అనుభవం లోపమో
అవకాశాలను అందుకోలేక
మేలిమిని గుర్తించలేక..
పురోగతిలో చతికలపడుతున్నాం!!

జ్యోతి మువ్వల
బెంగళూరు