Jun 15,2022 06:54

కేంద్రంలోని నిరంకుశ మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు నిర్లజ్జగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి)ను దుర్వినియోగపరుస్తున్నది. అధికార పార్టీకి చెందిన వారు ఎన్ని ఆర్థిక నేరాలకు పాల్పడినా, వారిపై ఎలాంటి కేసులు ఉండవు. వారి ఛాయలకు కూడా వెళ్లే సాహసం ఈ దర్యాప్తు సంస్థలు చేయవు. బిజెపి-ఆరెస్సెస్‌ విధానాలను, వాటి దుర్మార్గాలను విమర్శించే వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి, వెంటాడి వేధించడం మోడీ మార్కు రాజకీయం. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఈ విధానాన్ని అనుసరించారు. 2014లో ప్రధాని అయ్యాక దీనిని దేశమంతటికీ విస్తరింపజేశారు. రాజకీయ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోవడానికి బదులు ఇడి, సిబిఐ, ఎన్‌ఐఎ, ఐటి, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) వంటి దర్యాప్తు సంస్థలను వారిపైకి ఉసిగొల్పడం, వేధించడం, బెదిరించడం, లొంగదీసుకోవడం వంటివి చేయడంలో మోడీ-అమిత్‌షా ద్వయం బాగా ఆరితేరింది. 'నేషనల్‌ హెరాల్డ్‌' కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఎనిమిదేళ్ల క్రితం జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను ఆధారం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీపై దర్యాప్తు పేరుతో ఇడి హడావుడి చేస్తున్నది. మోడీ సర్కార్‌ ఆడమన్నట్టల్లా ఆడుతున్నందునే ఇడి డైరక్టర్‌ సంజరు కుమార్‌ మిశ్రా పదవీ కాలం ముగిసిన తరువాత కూడా రెెండు సార్లు అతని సర్వీస్‌ను పొడిగించింది. ఒకసారికి మించి పొడిగింపు ఇవ్వరాదని సుప్రీం కోర్టు 2021లో స్పష్టంగా చెప్పిన తరువాత మరో ఏడాది కాలంపాటు అతని సర్వీస్‌ను పొడిగిస్తూ మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆ తరువాత ఇడి ప్రతిపక్షాల నాయకులను తప్పుడు కేసుల్లో వేధిస్తున్న ఉదంతాలు బాగా పెరిగిపోయాయి. అయిదేళ్ల క్రితం నాటి కేసులో ఢిల్లీ రాష్ట్ర మంత్రి, ఆమాద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్‌ను ఇడి జైలుకు పంపింది. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాల్జేయాలన్న బిజెపి కుట్రలో భాగంగా ఎన్‌సిపికి చెందిన ఇద్దరు మంత్రులు అనిల్‌ దేశ్‌ ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌లను కటకటాల పాల్జేసింది. శివసేన నాయకులు అనిల్‌ పరబ్‌, ప్రతాప్‌ సర్నాయక్‌లపైనా కేసులు నమోదు చేసింది. తిరుగుబాటుకు కుట్ర చేశారని ఆరోపిస్తూ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌పై కేసు పెట్టేందుకు ప్రయత్నించింది. కేరళలో బంగారం స్మగ్లింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న స్వప్న సురేష్‌ చేసిన ఆరోపణల వెనక ఇడి హస్తం ఉందని వార్తలొస్తున్నాయి. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రెండేళ్ల క్రితం నాటి బంగారం స్మగ్లింగ్‌ కేసులో దర్యాప్తును అది పక్కదారి పట్టిస్తున్నది. యుఎఇ కాన్సులేట్‌ లగేజి ద్వారా బంగారం పంపిందెవరు? తీసుకున్నదెవరు? వారితో కుమ్మక్కయిందెవరు? అన్న విషయాలను పక్కన పెట్టి, ఇందులో ముఖ్యమంత్రిని ఎలా ఇరికించాలన్న దానిపైనే ఇడి కేంద్రీకరించినట్టుగా ఉంది. నిందితులు చేసిన ప్రకటనలను ఆధారంగా చేసుకుని బిజెపికి చెందిన కేంద్ర మంత్రులిద్దరూ పత్రికాగోష్టి పెట్టి ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేయడం, మరో వైపు విమానంలో ముఖ్యమంత్రి విజయన్‌పై యూత్‌ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు దుండగులు దాడికి యత్నించడం ఇవన్నీ బిజెపి కుట్రలో భాగమే. కాంగ్రెస్‌ కూడా ఈ కుట్రలో భాగమని స్పష్టమవుతున్నది. బంగారం స్మగ్లింగ్‌ కేసు విదేశీ కాన్సులేట్‌కు సంబంధించినది కనుక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి విజయన్‌ కేందాన్ని కోరారు. ఇప్పుడు ఆయననే ఇందులో ఇరికించాలని ఇడి చూడడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. దీనిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌, బిజెపి కేరళ అంతటా ఆందోళనలకు దిగాయి. దీనికి పరాకాష్టే ఇండిగో విమానంలో చోటుచేసుకున్న ఘటన. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కార్యాలయం ఎదుట హాజరయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ వెళ్లినప్పుడు ఆ పార్టీ ఎంపీలు, సీనియర్‌ నాయకులు ఢిల్లీ వీధుల్లో పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ను దుర్వినియోగం చేస్తోందంటూ నినదించారు. దేశంలో మిగతా చోట్ల కూడా కాంగ్రెస్‌ నిరసనలు తెలిపింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఇడిని గెటవుట్‌ అంటే, కేరళలో కాంగ్రెస్‌ మాత్రం ఇడిని ఆహ్వానించింది. ఆ పార్టీ దివాళాకోరుతనానికి ఇదొక నిదర్శనం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు బిజెపికి కొమ్ములు తెస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలను ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా తిప్పికొట్టాలి.