Oct 14,2023 11:10
  • ప్రశ్నాపత్రాలు సైతం ఇవ్వని విద్యాశాఖ
  • బోర్డుపై ప్రశ్నలు చూసి పరీక్ష రాయాల్సిన దుస్థితి
  • 45 నిమిషాల్లో రాయాల్సిన పరీక్ష గంటన్నరపైనే

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : 'నాడు-నేడు' అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన చదువు, పరీక్షల విషయంలో మాత్రం ఏమాత్రం పట్టించుకోని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కూనరిల్లుతుండగా పరీక్షల నిర్వహణ విధానం సైతం అస్తవ్యస్తంగా తయారైంది.

ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రతియేటా ఎఫ్‌ఎ-1, ఎఫ్‌ఎ-2, ఎఫ్‌ఎ-3, ఎఫ్‌ఎ-4 పరీక్షలతోపాటు, ఎస్‌ఎ-1, ఎస్‌ఎ-2 పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది. పరీక్ష అంటే ప్రశ్నాపత్రాలు ఇస్తే విద్యార్థులు వాటికి సమాధానాలు రాయాలి. అయితే ఎఫ్‌ఎ-1, ఎఫ్‌ఎ-3కి ప్రశ్నాపత్రాలు ఇస్తున్న విద్యాశాఖ, ఎఫ్‌ఎ-2, ఎఫ్‌ఎ-4 పరీక్షలకు మాత్రం ప్రశ్నాపత్రాలు ఇవ్వడం లేదు. పరీక్షకు గంటన్నర ముందు వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం స్కూళ్లకు పంపుతున్నారు. ఈ పేపర్‌లో ప్రశ్నలను ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తే, ఆ ప్రశ్నలను విద్యార్థులు రాసుకుని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకూ మూడు రోజులపాటు ఎఫ్‌ఎ-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు నానావస్థలు పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లావ్యాప్తంగా లెక్కలు తీస్తే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మూడు వేలకుపైగా ఉన్నాయి. వీటిలో మూడు లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎఫ్‌ఎ పరీక్షలకు సమయం 45 నిమిషాలు మాత్రమే. 20 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు బోర్డుపై ఉపాధ్యాయులు రాస్తే వాటిని రాసుకుని పరీక్ష రాయడానికి విద్యార్థులకు గంటన్నరకుపైగా పడుతోంది. ఈ విధానంలో కాపీయింగ్‌ పెద్దఎత్తున సాగుతోంది. బోర్డుపై రాసేందుకు ఉపాధ్యాయులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట అన్ని ప్రశ్నాపత్రాలు బోర్డుపై రాయడం కష్టతరంగా మారడంతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ప్రశ్నాపత్రాలు ఇవ్వకుండా నిర్వహిస్తున్న పరీక్షల విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్‌ఎ-1, ఎస్‌ఎ-2 పరీక్షలకు ప్రశ్నాపత్రం ఇస్తున్నప్పటికీ జవాబులు రాసేందుకు ఇచ్చే తెల్లకాగితాలు విద్యాశాఖ ఇవ్వడం లేదు. పరీక్షలకు సంబంధించి విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులూ వసూలు చేయరాదని నిబంధనలు చెబుతున్నాయి. ఎక్కడైనా వసూలు చేసేందుకు ప్రయత్నించినా ప్రధానోపాధ్యాయులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్లలో విలీనం చేయడంతో ప్రభుత్వ విద్య పూర్తిగా గాడితప్పింది. ఇప్పుడు పరీక్షల విధానంలో విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు కూడా ఇవ్వకపోతే విద్యార్ధులు ఏవిధంగా పరీక్షలు రాయాలో ప్రభుత్వమే చెప్పాలి. పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారే. ఈవిధంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఏవిధంగా చదువులో రాణిస్తారో ప్రభుత్వమే చెప్పాలి. ప్రశ్నాపత్రాలు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం పలు గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.