
కాలం నేర్పిన పాఠం
కరోనా కథలు
రచయిత : శిరంశెట్టి కాంతారావు
పేజీలు : 120
వెల : రూ. 100
ఫోన్ నెం : 9849890322,
63000 25783
ప్రతులకు : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుస్తకాల షాపుల్లో లభ్యం.
కరోనా కాలం ఇప్పటికీ మన ఒంటిలోంచి వెళ్లని భయం.. కొన్ని బంధాలను కలిపింది. కొన్ని బంధాలను శాశ్వతంగా దూరం చేసింది. దీనిపై పన్నెండు నెలల పాటు మన జీవితాల్లో వచ్చిన మార్పులను, ఒడిదుడుకులను పన్నెండు కథలుగా శిరంశెట్టి కాంతారావు గారు తీర్చిదిద్దిన పుస్తకం 'కాలం నేర్పిన పాఠం'. ఈ పుస్తకంలోని ప్రతి పాత్రను ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఒక్కరూ చవిచూసిన జ్ఞాపకాలే అని చెప్పవచ్చు. అందుకే ఈ పుస్తకం చదువుతున్నంత సేపు కరోనా ఉధృతి ఎక్కువ ఉన్న రోజుల్లో జరిగిన సంఘటనలు కంటికి కట్టినట్లు కనిపిస్తాయి.
అప్పటి వరకూ ఎంతో స్నేహంగా కలిసిమెలిసి మసిలే ఇరుగుపొరుగువారు ఎదిరింటి గుణమ్మకు పక్షవాతం వచ్చేసరికి ఎవరి చేతి వాటం వారు చూపించిన విధానం 'గంప గుత్తం' కథను ఎంతో చక్కగా రాశారు. తమకు దక్కాల్సింది దక్కలేదనే కోపంతో దాయాదులు, ఎక్కడ ఏమవుతోందనని ఊరివారు ఎవరికి వారూ దూరంగా ఉండిపోయారు. గుణమ్మ కూతురు రాలేకపోతున్నాను మీరే చూసుకోండి బాబాయి అన్నందుకు ఊరి సర్పంచ్, అతని బామర్ది, సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో మరింత డబ్బు గుంజుకున్న డాక్టర్, ఇలా ఎవరికి తోచినంత వారు దోచుకున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి వేరేచోట్ల పనులు చేస్తున్న వారు తమ ఊరికి వెళ్లడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో, పద్నాలుగు రోజుల క్వారెంటైన్ ఉండి పడ్డ బాధలు, ఆఖరికి తమ ఊరికి వెళ్లకుండానే తిరిగి ఎక్కడ నుంచి వచ్చారో అక్కడకే చేరుకోవడం 'ఆ నలుగురు' కథతో బాగా తెలిపారు.
పదవులకు ఆరాటపడి ఒకరి మీద ఒకరు పోటీ పడి దేవాలయంలో కమిటీలు ఏర్పాటు చేసి, ఎన్నికైన తరువాత గుడిలో పూజలు పంతులను నిర్లక్ష్యం చేయడం.. ఆ పంతులు పడిన కష్టాలతో గుడిలో పౌరహిత్యమే కాదు జీవనానికి ఏదైనా పని చేయొచ్చని కొత్త ఉపాధిని సంపాదించి పెట్టిన కథే 'కాలం నేర్పిన కరోనా'. టీచర్లు, వేరే వృత్తుల్లో పని చేసేవారు కూరగాయాలు అమ్మడం, బజ్జీ బండ్లు నడపడం మనకు గుర్తుకు రాక తప్పదు. ఆస్తి కోసం ఆశించారుగానీ నారాయణమ్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన బంధువులు, మిమిక్రీ వారితో ఆమె ఆస్తిని దక్కించుకోవడం కోసం వేసిన ఎత్తులు, గొంతు మార్చి నారాయణమ్మ ఆస్తి వివరాలు తెలుసుకొని ఆమె చనిపోయిన బెడ్ మీదకే కరోనాతో బాధపడుతూ చేరిన కోనయ్య 'రోగం దానవ రూపేణ' కథలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆపదొస్తుందో అన్నదానిపై విశ్లేషణ బాగుంది. అష్టకష్టాలు పడి మూడు నాలుగు రోజులు నడిచి వచ్చిన వలస వెళ్లి తిరిగి తమ ఊరికి చేరిన బిడ్డలను జరిమాన కట్టి మరీ ఇళ్లకు తెచ్చుకున్న వైనం, అదే సందర్భం సర్పంచి ఇంట్లో వచ్చేసరికి ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకున్న ఇరు వర్గాల గ్రామనాయకులు కథే లొల్లి. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన రైల్లో వేరుశెనక్కాయలు అమ్ముకునే వారి ఆదాయం కోల్పోయి, ఆన్‌లైన్‌ను ద్వారా 'అల్లం మురబ్బా' తయారు చేసి, అవసరాన్ని బట్టి చాకచక్యంగా నడిచిన సావిత్రమ్మ తెలివి చాలా మందికి ఆదర్శంగా అని చెప్పవచ్చు. ఎంతో కష్టపడి మంచి స్థితికి చేరుకొని, వారి కింద పనిచేసేవారికి అవసరాలకు ఆదుకోవచ్చుగానీ వారి దురలవాట్లకు సాయం చేయకూడదని సంజీవరావుకు వరలక్ష్మి కనువిప్పు చూపిన కథే 'అసలు-నకిలి'. విదేశాల్లో పిల్లలు స్థిరపడిన ఇరుగు పొరుగు వారితో కలిసి మెలిసి ఉంటూ ఒక్కసారిగా పలకరింపులు బంద్ కావడంతో.. ఎటూ తోచక మంచాన పట్టిన భార్యను దెయ్యం పట్టిందని నమ్మిన చదువకున్న అజ్ఞాని జానయ్య లేని రోగాన్ని మంత్రాలతో మాయం చేస్తానన్న పాలవాడు అబ్బయ్యను నమ్మి, తన సొమ్మును పోగొట్టుకోవడమే కాకుండా తన భాగస్వామిని కోల్పోయిన కథే 'రెక్కలుడిగిన పక్షులు'.
అమాయకపు బిసి కృష్ణయ్య వద్ద ఉన్న కాస్తో కూస్తో సొమ్మును ఖర్చుపెట్టించి, కరోనాలో ఆదుకోమని మరింత మందిని కృష్ణయ్య ఇంటిమీదకు పంపి, నాకొద్దు బాబోరు ఈ పదవులు అనిపించిన కథే 'ఉచ్చు'. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వచ్చాక అదిగో పులి అంటే ఇదిగో మేక అంటూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టు మనం 'అపోహ'లకు లోనవుతూ పసిబిడ్డను తల్లితో వేరు వేరు చేసిన కథే 'అపోహ'.
అక్క చెల్లెళ్ల మధ్యన కూడా ఈ కరోనా మహమ్మారి చిచ్చు పెట్టిన కథే 'చిక్కు'. ముగ్గురు అక్క చెల్లెళ్లలో పెద్ద అక్క సమయస్ఫూర్తితో సదుమణిగే చక్కటి ఉపాయంతో గట్టెక్కిన తీరు బాగుంది. ఎంతో కలిసి మెలిసి ఉన్న అపార్టుమెంటు వారు ఒక్కసారిగా మహమ్మారికి భయపడి ఎవరికి వారే ఉండిపోవడం.. కరోనా వచ్చిన వారికి తక్కువ వ్యయంతో, దానికి భయపడి లేని రోగాన్ని తెచ్చుకున్న వారికి మరింత డబ్బు ఖర్చు అయిన కథే 'అపార్టుమెంటు'. ఎవరికి వారు కొందరు నష్టపోతే, మరికొందరు లాభపడ్డారు. ఇంకొందరు తాము తీసిన గుంటలో వారే పడ్డారు. ఎవరికి వారికి ఈ కాలం మాత్రం ఎన్నో పాఠాలను నేర్పింది. రచయిత ఈ కథలను అలా కరోనా కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు.
- సిహెచ్ సాయిలక్ష్మి
75697 44709