
జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) చేసే అన్ని రకాల సర్వేలనూ సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీని నియమించింది. ఇంతకు ముందు 2019లో ఆర్థిక గణాంకాల సమీక్షకు స్టాండింగ్ కమిటీని వేయగా, దాని స్థానంలో కొత్త కమిటీ వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి ముఖ్య గణాంక శాస్త్రవేత్త, జాతీయ గణాంక కమిషన్ (ఎన్‌ఎస్‌సి) మాజీ ఛైర్‌పర్సన్ ప్రణబ్ సేన్ నూతన కమిటీకి అధ్యక్షులుగా ఎంపికకాగా, కమిటీలో 10 మంది అధికారిక సభ్యులు, నలుగురు విద్యారంగానికి చెందిన ప్రభుత్వేతర సభ్యులు ఉంటారు. కమిటీలో గరిష్టంగా 16 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఉన్న స్టాండింగ్ కమిటీకి ఎన్‌ఎస్‌ఒ చేసే ఆర్థిక సర్వేలను మాత్రమే సమీక్షించే అధికారం ఉంది. నూతన కమిటీ ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలనూ పరిశీలించేలా అధికారాల పరిధిని విస్తృతం కావించారు. గతంలో వేసిన స్టాండింగ్ కమిటీపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్‌పర్సన్ వివేక్ దేవ్‌రారుతో సహా పలువురు నిపుణులు బహిరంగంగానే విమర్శలు చేశారు. మన దేశ స్టాటిస్టికల్ సర్వీస్‌కు సర్వేల నిర్వహణపై తక్కువ నైపుణ్యం ఉందని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలున్నాయనగా ప్రభుత్వం ఏదో చేస్తోందని ప్రజలను భ్రమింపజేయడానికే కొత్త కమిటీ తంతు అన్న భావన ప్రజలందరిలో ఉంది.
పారిశ్రామిక, సేవారంగాలు, కార్మికశక్తి గణాంకాలను కమిటీ పరిశీలించినా, తుది ఫలితాల ఖరారు జాతీయ గణాంక కమిషన్‌దేనైనా, తిరకాసంతా హౌస్‌హోల్డ్ సర్వేలకు నిర్ణయించే కొలబద్దల్లోనే ఉంటుంది. ఫ్రేమ్‌వర్క్, నమూనా, విశ్లేషణ, ఫలితాల వద్ద గిమ్మిక్కులకు పాల్పడే అవకాశం లేకపోలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక దేశం అన్ని రంగాల్లో సుభిక్షంగా శోభిల్లుతోందంటూ ప్రజలకు 'ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్'ను ఎక్కించడమే పనిగా పెట్టుకుంది. అవసరమైతే కొలబద్దలను మార్చేస్తోంది. అందుకు ఉదాహరణ జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి) లెక్కింపునకు ప్రామాణిక సంవత్సర మార్పు. హౌస్‌హోల్డ్ సర్వేకి 2011-12 ఏడాది బేస్ ఇయర్‌గా ఉంది. మోడీ ప్రభుత్వం 2017-18ని ప్రామాణికంగా తీసుకుంటామంటోంది. ఇప్పటి ఆదాయాలను ప్రామాణికంగా చూపితే జిడిపి సైజ్ పెద్దగానే కనిపిస్తుంది. అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు పోలిక పెడితే ఎన్నోరెట్ల పెరుగుదల కనిపిస్తుంది. ఈ వాస్తవాన్ని కావాలనే మోడీ ప్రభుత్వం కప్పెడుతోంది. అదానీ ఆదాయాన్నీ, వీధుల్లో చెప్పులు కుట్టుకునే నిరుపేద ఆదాయాన్ని కలిపి జిడిపి, తలసరి ఆదాయాలను లెక్కిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎగబాకుతుంది. కానీ జనబాహుళ్యం బతుకుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
ఆర్థిక మాంద్యం, కరోనా విలయం, ప్రభుత్వం తలకెత్తుకున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాల వలన ప్రజల బతుకులు అంతకంతకూ ఛిద్రమవుతున్నాయి. నిరుద్యోగం రికార్డులు బద్దలు కొడుతోంది. ఉపాధి అవకాశాలు పడిపోతున్నాయి. ప్రభుత్వరంగాన్ని అమ్మకానికి పెట్టడంతో ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. పారిశ్రామికవృద్ధి మందగమనంలో ఉంది. సర్వీస్ రంగం ఊగిసలాటలో ఉంది. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటోంది. పేదరికం పెరుగుతోంది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఈ లెక్కల్లో చాలా భాగం ప్రభుత్వానివే. అందుకే సర్వేలంటే మోడీ సర్కారుకు కడుపుమంట. అందుకే ఎన్‌ఎస్‌ఎస్ ఫలితాలను ప్రకటించకుండా తొక్కిపెడుతోంది. మానవ అభివృద్ధి సూచీలు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్టులను తూలనాడుతోంది. చివరికి ప్రభుత్వం నిర్వహించే ఎన్‌సిఆర్‌బి గణాంకాలను సైతం రహస్యంగా ఉంచుతోంది. నిజాలు బయట పడితే ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనన్న భయమే అందుక్కారణం. ఎన్ని కమిటీలు వేసినా, ఎంతగా అవాస్తవాలతో మభ్యపెట్టాలని ప్రయత్నించినా ప్రజలకు అనునిత్యం ఎదురవుతున్న వారి దైనందిన అనుభవాలే అద్దాలు. వాటిలో వాస్తవాలే కనిపిస్తాయి. ఆపడం మోడీ ప్రభుత్వతరం కాదు.