Oct 20,2023 12:25

తెలంగాణ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఎ) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌పై ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. అజారుద్దీన్‌పై మూడు కేసులు, మాజీ కార్యదర్శి విజయానంద్‌, మాజీ కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌ పై రెండు చొప్పున కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ అవకతవకలతో సంబంధం ఉన్న ఫైర్‌ విన్‌ సేఫ్టీ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సారా స్పోర్ట్స్‌, బాడీ డ్రెంచ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎక్సలెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర నాలుగు సంస్థల పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అగ్నిమాపక సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, అప్పట్లో న్యాయస్థానం నియమించిన జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ పర్యవేక్షక కమిటీ దఅష్టికి రాకుండానే కాంట్రాక్టు ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బంతుల కొనుగోళ్లకు సంబంధించి హెచ్‌సిఎ కు రూ.57.07 లక్షల నష్టం వాటిల్లినట్లు, జిమ్‌కు సంబంధించి ట్రెడ్‌మిల్‌, ఇతర సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు పొందుపరిచారు. బకెట్‌ కుర్చీల కొనుగోళ్లలో ధరల పెంపుతో రూ.43.11 లక్షల నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. జిమ్‌కు సంబంధించి ట్రెడ్‌మిల్‌, ఇతర సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు వెల్లడించారు.