Jun 21,2023 06:55

వావ్‌! ఈ డ్రస్‌లో మీరు సూపర్‌. అదిరిపోతున్నారు సార్‌...
ఆ విషయం నాకు తెలుస్తుందిలే సెక్రటరీ. నీవు మరీ అంతగా ఇదైపోనక్కర్లా...డ్రస్సింగ్‌ టేబుల్‌ దగ్గరున్న నిలువుటద్దంలో చూసుకుంటున్నాగా... డ్రస్‌ లోపల నా ఛాతీ యాభై ఆరు ఇంచ్‌లు పెరుగుతుందా...లేదా...అది తేల్చుకోవాలి.
ఎందుకు పెరగదు సార్‌. మీరిప్పుడు విశ్వగురూ... విశ్వనేత... జగ్గజ్జేతగా అగ్రరాజ్యం అమెరికా వెళ్ళబోతున్నారు. యోగా డే నాడు ఆ దేశం నుండే ప్రపంచానికి పాఠాలు చెప్పబోతున్నారు సార్‌!
విసిత్రం ఏంటంటే సెక్రటరీ... ఒకనాడు నేను గుజరాత్‌ నేతగా ఉన్నప్పుడు వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా, మరిప్పుడు రెడ్‌ కార్పెట్‌ పరిచి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడం చూస్తుంటే... ఛాతీ నిజంగానే ఉప్పొంగుతుందయ్యా! అక్కడ మనం ఇమానం దిగిన దగ్గర నుండీ... ఏదీ, తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు అన్నీ రాచమర్యాదలే అనుకో.
రాచమర్యాదలు అని చిన్నగా అంటారేంటి సార్‌. రాజభోగం. కాకపోతే మీడియా పత్రికల వాళ్ళకే కన్ను కుడుతున్నది. ఏదిబడితే అది రాస్తున్నారు సార్‌.
ఏమని? ఓసారి చదువు...
ప్రస్తుతం అమెరికాలో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారని, వారిలో చాలామంది అక్కడ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ...వారి ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నారని, గనుకనే గత ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారని రాశారు. గత ఎన్నికల్లో 74 శాతం మంది ఇండియన్‌ అమెరికన్లు ఇప్పటి అధ్యక్షుడు జోబైడిన్‌ గెలుపునకు ఆ విధంగా మద్దతు ఇచ్చారని పేర్కొంటూనే... ఈసారి ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి వంటి వారు పోటీ పడుతున్నారని తెలిపారు. తత్‌ కారణంగానే తమరికి ఘనమైన ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అమెరికన్‌ డెమోక్రాట్లు భారత్‌కు మరింత సన్నిహితం అన్న సంకేతాలు పంపడానికే ఇంత హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇందులో విమర్శేముంది సెక్రటరీ? అదంతా నిజమేగా...
నిజమా..? ఇందులో మీ గొప్ప ఏమీ లేదనీ, ఇదంతా అమెరికా వారి స్వప్రయోజనం కోసమే వారు చేస్తున్నారని ఇన్‌డైరెక్టుగా రాశారు సార్‌. ఒక విధంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు సార్‌...
ఆ...రాసేవాడు రాసుకోనీ, వాగేవాడు వాగుకోనీ... ఎవరేమనుకుంటే మనకెందుగ్గానీ, మనకు దక్కాల్సిన మర్యాదలు, భోగభాగ్యాలు మనకు దక్కుతున్నాయిగా ...అయినా నీవంతగా మరీ ఇదైపోనక్కర్లా సెక్రటరీ. గతంలో 2014లో దేశాధినేతగా అమెరికా వెళ్ళానా...అప్పుడు న్యూయార్క్‌ లోని మాడిన్‌ స్క్వేర్‌లో ఇరవై వేలమంది మన భారతీయులు జమయ్యారు. తెలుసా. మరల 2019లో అదేంటీ హౌడీ ...డీ ప్రోగ్రామ్‌కి ఏభై వేల మంది జమయ్యారు. ఈసారి టైమ్‌ స్క్వేర్‌ నుండి నయాగరా జలపాతం వరకు కనీసం లక్ష మంది జమవుతారు కచ్చితంగా... మరి నా ఛాతీ పెరగకుండా ఎలా ఉంటుంది?
అందుకే ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీ మోత అని మన మీడియా ఘోషిస్తున్నది.
అబ్బా సెక్రటరీ...శుభం పలకరా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడుందీ అన్నట్టు ఆ అపశకునపు మాటలేమిటి?
మణిపూర్‌లో మారణహోమం చెలరేగి వంద మందికి పైగా ప్రాణాలు పోయాయి. నెల రోజులైనా మంటలు ఆరడం లేదు. పచ్చటి అడవులు నెత్తురోడుతున్నాయి. ప్రజల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. అయినా దేశాధినేత కానరావడం లేదు. పెదవి విప్పడం లేదు? ఏమయ్యాడు? అంటూ పోస్టర్లు వేసి గగ్గోలు పెడుతున్నారు సార్‌...
ఏనుగు దారెంట పోతుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. వాటిని లెక్కచేస్తామా ఏమిటి? తాపీగా ఈ చెవితో విని ఈ చెవితో వదిలెయ్యాలి. ఈ రాజకీయ రహస్యం తెలియకపోతే ఎలా సెక్రటరీ...
రహస్యం కాదు సార్‌. అంతా బహిరంగమే. ఈ పత్రిక చూడండి... ఏమని రాసిందో. 22వ తేదీన తమరు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే, మీ రాకకు నిరసన తెలియజేస్తూ అమెరికా అధ్యక్ష భవనం సమీపంలోనే హక్కుల సంఘాలవాళ్ళు పెద్దఎత్తున ప్రదర్శన చేస్తారట. అంతే కాదు సారూ...వాషింగ్టన్‌లో, గుజరాత్‌ నరమేథం-2002పై ప్రత్యేకంగా రూపొందించిన బి.బి.సి. డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శిస్తాయట. ఆ ప్రదర్శనలను తిలకించేందుకు అక్కడి ప్రజా ప్రతినిధులను, మేధావులను, పాత్రికేయులను ఆహ్వానిస్తాయట.
ఊ... సెక్రటరీ... దీని తస్సాదియ్యా! ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని వేరే చెప్పాలా... ఈ కుట్రలో స్వదేశీయులేగాక విదేశీయులు కూడా ఉంటారు. నీవంతగా ఆశ్చర్యపడక్కర్లేదు. మీడియావాళ్ళే ఆ కుట్రదారుల్ని ఉద్యమకారులు, ఆందోళనకారులు, హక్కుల కార్యకర్తలు అని నానా పేర్లు పెడతారు (అద్దంలో చూసుకుంటూ). ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే...ఇప్పుడేసుకున్న డ్రస్‌ కన్నా గొప్ప డ్రస్‌లు మరో డజను సెలక్ట్‌ చేసిపెట్టు. అమెరికాలో వేసుకోవాలి. ఛాతీ కూడా పెరుగుద్దీ, గుర్తుంచుకో. వస్తా.
చిత్తం సార్‌ (బుర్ర గోక్కుంటూ పత్రికలో వ్యాఖ్యను చదువుకున్నాడు).
'అద్దంలో కనపడే ప్రతిబింబాన్ని చూసి కుక్క...తనే అనుకుంటుందా లేక వేరే కుక్క అని మొరుగుతూ భ్రాంతి పడుతుందా...?!'
 

- కె. శాంతారావు,
సెల్‌: 9959745723