అన్నీ రంగుల పొంగులే
కళ్ళకు కానొచ్చే హరివిల్లులు
చేతలకు అంటని హంగులు
చేతికిరాని రంగవల్లులు
ఆచరణకాని అలవోకపు
మాటల విన్యాసాల మిరుమిట్లు
ఎటు చూసినా
కలగలుపు గారడీలే
మేల్కొలుపు లేని ఉరుకులే
వ్యవస్థను చుట్టుముట్టిన
ఆదమరిచే మనసు కలలు
గొబ్బెమ్మల దగ్గర
గోముగా కూర్చునే బతుకులు
ఆశల పల్లకీలపై
నిరాశల్ని మోసే పథకావిష్కరణలు
ఎటు వెళ్తే అటు
అణగారిన స్వేచ్ఛా వాయువులు
ప్రశ్నించే గొంతుకల పూడికలో
కనుమరుగవుతున్న
అభివృద్ధి వీచికలు!
అంతటా రంగు రంగుల
ఎజెండాలే
సమాజమంతటా
ఆ జెండాల రెపరెపలే
పండుగ కానుకుల సర్దుబాట్లతో
మెండును తగ్గించే తెలివితేటలు
కొండంత బరువుకు
చిటికెడంత చేయూతలతో
ఉపసంహరించే ప్రదర్శనలు
ఎక్కడ చూసినా
రంగులద్దిన పైపూతల హామీలే
కంటిని ఏమార్చి
మనిషి మస్తిష్కానికి ఎర వేసే
జంతర మంతర ఏలికలే
మెళకువ లేని చిమ్మచీకటిలో
పురివిప్పిన వాగ్దానాలే
ఎక్కడివక్కడే తొంగున్న..
ఎదురుచూపుల సగటు కళ్ళలో
పూసేవన్నీ రంగులే..
మరి మనకు చూపేవన్నీ
మరీచికలే.. మకర సంక్రాంతులే..!!
నరెద్దుల రాజారెడ్డి
96660 16636