ప్రజాశక్తి-అమరావతి : కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కెజిబివి) పనిచేసే కాంట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సవరించిన పేస్కేల్‌ను ఆరు వారాల్లోగా బకాయిలతో చెల్లించాలని జస్టిస్ కె మన్మథరావు ఉత్తర్వులు జారీ చేశారు. 'ఒకే తరహా విధులు నిర్వహించేవారికి వేర్వేరు జీతాలు చెల్లింపు చెల్లదు. ఇలా చేయడం దోపిడీ కిందకే వస్తుంది. బానిసత్వమే అవుతుంది. ద్వంద్వ పేస్కేల్స్ వివక్ష అవుతుంది. పలువురిని బదిలీ చేసినందున వాళ్లను కదల్చడం సరికాదు. అయితే, బదిలీల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన వారికి స్టే ఉత్తర్వులు కొనసాగుతాయి' అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కనీస వేతన స్కేల్ ఇవ్వకుండానే ఉన్నతాధికారులు తమను బదిలీ చేయాలని నిర్ణయించడం అన్యాయమంటూ కెజిబివిల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లు హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. రెగ్యులర్ టీచర్లకు, తమకు జీతాల మధ్య చాలా తేడా ఉందని, కనీస పేస్కేల్ ఇవ్వకుండా బదిలీ చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషనర్లు వాదించారు.
వేలం ద్వారా ఖనిజ లీజు
గ్రానైట్, ఇతర ఖనిజాల క్వారీ లీజులను వేలం ద్వారా మంజూరు చేయవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త వేలం నిబంధనలు కేంద్ర ప్రభుత్వ గ్రానైట్ నిబంధనలకు విరుద్ధం కాదని ప్రకటించింది. వేలం ద్వారా లీజుల మంజూరు చేస్తే ప్రభుత్వానికి అధిక రాబడి ఉంటుందని జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పు వెలువరించారు. లీజుల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, దీనిపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసిందని తెలిపారు. టెక్కలి మండలంలోని అడ్డుకౌడలో 3 హెక్టార్లలో గ్రానైట్ లీజు కోసం ఎఫ్ఇఎంఎంఐ, సాయి దుర్గా మినరల్స్ దరఖాస్తు చేసుకున్నాయి. వేలం ద్వారా మైనింగ్ లీజులు కేటాయింపు నిబంధనలను హైకోర్టులో సవాల్ చేశాయి. ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది.
గనుల శాఖకు పెనాల్టీ విధించే అధికారం లేదు
మైన్స్ అండ్ మినరల్ యాక్ట్, ఎపి మైనర్ మినరల్స్ కన్సెషన్ నిబంధనల ప్రకారం ఉల్లంఘనల కంపెనీలకు పెనాల్టీ విధించే అధికారం గనులశాఖకు లేదా ఇతర ప్రభుత్వాధికారులకు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. పెనాల్టీ విధింపు ద్వారా శిక్షార్హులని తేల్చడం సంబంధిత న్యాయస్థానాల పరిధిలోకి వస్తుందని జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పు చెప్పారు. ఎంఎండిఆర్ యాక్ట్‌లోని సెక్షన్ 4 ప్రకారం ఖనిజ తవ్వకం, రవాణా ఉల్లంఘనలు జరిగితే అందుకు కారణమైన వారిపై సెక్షన్ 21(1), (2) ప్రకారం పెనాల్టీలు, జైలుశిక్ష, జరిమానా, జప్తు చేసే అంశాలు న్యాయ పరిధిలోకి వస్తాయని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. పెనాల్టీ చెల్లించాలని గనులశాఖ ఇచ్చిన నోటీసులను పలు స్టోన్ క్రషర్స్ కంపెనీలు దాఖలు చేసిన కేసులో తీర్పు చెప్పారు.










