Nov 14,2023 10:48

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వివిధ సమస్యలపై 12 అంశాలతో మినీ మ్యానిఫెస్టోను రూపొందించాలని టిడిపి, జనసేన నిర్ణయించాయి. టిడిపి కార్యాలయంలో సోమవారం టిడిపి, జనసేన మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆమోదించిన మినీ మ్యానిఫెస్టోను అనుమతి కోసం పైకమిటీకి పంపుతామన్నారు. ఆర్ధిక వ్యవస్ధ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తి వంతులు కావాలని తాము భావిస్తున్నామన్నారు. మహాశక్తి పథకం ద్వారా 'తల్లికి వందనం' పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు, 'ఆడబిడ్డ నిధి' నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకీ నెలకు రూ.1500, 'దీపం' పేరుతో ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువగళం పేరుతో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వడం, సౌభాగ్య పథకం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 'అంకుర' సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం గరిష్టంగా రూ.10 లక్షల వరకూ సబ్సిడీ ఇచ్చే విషయాన్ని జనసేన ప్రతిపాదించగా ఆమోదించామని యనమల తెలిపారు. వీటితో పాటు అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకూ, కౌలు రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆక్వా రైతులకు ప్రోత్సాహం, పాడిరైతులకు నేరుగా ప్రోత్సాహకాలు కల్పించడం, 'ఇంటింటికీ మంచినీరు' పథకం కింద ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్‌, బిసిలకు రక్షణ చట్టం, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పన్నులు, ధరల భారం, విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తూ మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, పూర్‌ టు రిచ్‌ పథకం ద్వారా పేదలను సంపన్నులు చేసే పి4(పబ్లిక్‌, ప్రైవేటు పీపుల్‌ పార్టనర్‌ షిప్‌) ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం, అమరావతే రాజధానిగా ప్రకటిస్తూ అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి లాంటి నిర్ణయాలను మ్యానిఫెస్టోలో పెట్టామని యనమల వివరించారు.
జనసేన మేనిఫెస్టో కమిటీ నాయకులు ముత్తా శశిధర్‌ మాట్లాడుతూ మంచి వాతావరణంలో టిడిపి, జనసేన మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందన్నారు. మహానాడులో టిడిపి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు నాలుగు సంవత్సరాలుగా జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌కు ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు కొన్ని అంశాలు చేర్చామని తెలిపారు. 'సంపన్న ఆంధ్రప్రదేశ్‌-అమరావతే రాజధాని' ఉచిత ఇసుక ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం, జనసేన సౌభాగ్య పథకం ద్వారా నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగాలు కల్పించడం ప్రధాన అంశాలుగా పేర్కొన్నామని తెలిపారు. వ్యవసాయాన్ని భాగ్యపదంగా తీసుకెళ్లడం ద్వారా రైతులు, కౌలు రైతుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం, 'మన ఆంధ్రప్రదేశ్‌- మనఉద్యోగాలు' అనే ఆరు ప్రతిపాదనలను ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీలో ప్రతిపాదించామని తెలిపారు. టిడిపితో సమన్వయం చేసుకునేందుకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ, సంప్రదింపులకు బాధ్యుల నియామకం చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో టిడిపి నుంచి పరుచూరి అశోక్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, జనసేన నుంచి డి.వరప్రసాద్‌, ప్రొఫెసరు కె.శరత్‌కుమార్‌ పాల్గొన్నారు.