May 02,2023 07:45

         ప్రధాని మోడీ నిర్వహిస్తున్న 'మన్‌ కీ బాత్‌' మొన్నటితో వంద ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. 2014 అక్టోబర్‌ 3 దసరా నాడు మొదలైంది. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు. మన్‌ కీ బాత్‌ అంటే మనసులో మాట. ఎనిమిదిన్నరేళ్లల్లో ఏనాడూ మోడీ మాటలో మనసు కనిపించలేదు. అదొక ప్రచార విన్యాసం. స్వీయ కీర్తి కండూతిలు. వాగాడంబరం. నాటకీయ ఫక్కీ. బిజెపి, దాని రాజ గురువు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో చర్చనీయాంశం చేయాలనుకున్న విషయాలు మన్‌ కీ బాత్‌లో ప్రధాని నోట ఊడిపడతాయి. అంతే తప్ప ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభిప్రాయాలు కాగడా వేసి చూసినా కనిపించవు. వాస్తవం ఇది కాగా తన నూరవ ఎపిసోడ్‌లో మోడీ, ప్రజలతో మమేకం కావడానికి మన్‌ కీ బాత్‌ దోహదపడిందని తన సహజ శైలిలో వంచించారు. ఆధ్యాత్మిక ప్రయాణంగా, ప్రజా దేవుళ్ల పాదాల చెంత ప్రసాదంగా, విశ్వాసం, ఆరాధనా వ్రతంగా అభివర్ణించి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. స్ఫూర్తి గాధలు వెలుగులోకి తెచ్చేందుకు వేదిక అయిందని ఊదరగొట్టారు.
        ప్రజాధనంతో నిర్వహించిన 'మనసులో మాట' జన బాహుళ్యానికి ఎంత మేరకు ఉపయోగపడిందన్నది సందేహాస్పదం. ప్రధాని ఉన్నపళంగా రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. దాని వలన ఉపాధి కోల్పోయి వీధినపడ్డ కార్మికుల ఈతిబాధలపై, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటనలపై మన్‌ కీ బాత్‌లో మోడీ నోరు పెగల్లేదు. జిఎస్‌టి విధింపుపైనా అంతే. బిజెపి దేశ ప్రజలకు ఇచ్చిన హామీ విదేశాల్లో నల్లధనం వెలికితీత. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమ. దానిపై మోడీ సమాధానం చెప్పరు. యువతకు ఇచ్చిన వాగ్దానం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారో తెలపరు. రైతులకు రెట్టింపు ఆదాయం బాసపైనా మౌనమే. భావ వ్యక్తీకరణకు మన్‌ కీ బాత్‌ వేదిక అయిందంటున్నారు మోడీ. రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కాలరాయడంలో కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలది అందె వేసిన చెయ్యి. విపక్షాలు, హక్కుల కార్యకర్తలు, మేధావులపై పెగాసెస్‌ స్పైవేర్‌, తదితరాలతో నిఘా పెట్టడమే కాకుండా అక్రమ నిర్భందాలు, హత్యలు నితయకృత్యమయ్యాయి. తమ విధానాలను వ్యతిరేకించే, నిరసించే గొంతులను నిరంకుశ చర్యలతో నొక్కుతూ భావ వ్యక్తీకరణ వంటి మాటలు మాట్లాడటం బిజెపికి, మోడీకే చెల్లింది. మన్‌ కీ బాత్‌లో ఇవేవీ చర్చకు రావు.
          ఆర్థిక నేరగాడు అదానీ అక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఆ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్ర సర్కారు నుంచి స్పందన లేదు. జెపిసి దర్యాప్తునకు ససేమిరా అంది. ఎక్కడో ఏదో చిన్న సంఘటపై మన్‌ కీ బాత్‌లో లెక్చర్లిచ్చే మోడీ, అదానీపై మూగనోము ఎందుకు పట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల స్కామ్‌పై తాడూ బొంగరం లేని వాదనలు తప్ప విచారణకు నో అన్నారు. ఎన్నికల ముందు పుల్వామా దాడిలో వీర జవాన్ల మరణాలను ప్రచారాస్త్రంగా చేసుకొని మన్‌ కీ బాత్‌లో భావోద్వేగానికి పోయిన ప్రధాని, ఆ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా బద్దలైనప్పుడు నోరు మెదపకున్నారు. మత ఘర్షలు, యు.పి.లో సి.ఎం యోగి విచక్షణారహిత ఎన్‌కౌంటర్లు, ఫెడరలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, కడకు రాజ్యాంగంపై దాడుల విషయంలో ప్రధాని ఏం చెబుతారోనని జనం ఎదురు చూస్తున్నారు. ధరాభారం, ప్రభుత్వ రంగ అమ్మకం, మహిళలు, దళితులు, మైనార్టీలపై హిందూ మతోన్మాదుల కిరాతకాలపై మోడీ సమాధానం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. మేడే నేపథ్యంలో ప్రసంగించిన ఈ నూరవ ఎపిసోడ్‌లో కనీసం కార్మికులకు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధానికి నోరు రాలేదు. శ్రమ జీవుల పట్ల వారి దృక్పథమది. కరోనా లాక్‌డౌన్లు, వలస కూలీల అవస్థలు, కరోనా వైఫల్యంతో లక్షల మరణాలకు మన్‌ కీ బాత్‌లో చోటు లేదు. కార్పొరేట్‌-హిందూ మతతత్వ ఎజెండా, ప్రచారార్భాటం ఆ ఎపిసోడ్స్‌ ఆంతర్యం అన్నది స్పష్టం. ప్రజల ప్రస్తావన లేని వారి ప్రశ్నలకు జవాబులు దొరకని కార్యక్రమం ఏదైనా ప్రజల మన్నన పొందజాలదు.