May 28,2023 06:40

పుట్టినప్పుడు మొట్టమొదటిగా మన గొంతు తడిపేవి తల్లిపాలు మాత్రమే. ఎదుగుతున్న కొద్దీ ఆవుపాలు, గేదెపాలు తాగుతాం. పిల్లల ఎదుగుదలకే కాదు, రోగులు త్వరగా కోలుకోవడాఁకీ, వయోవద్ధులు సత్తువ కోల్పోకుండా ఉండటానికీ పాలను మించిన పోషక పానీయమేదీ లేదు. శారీరక శక్తికి అవసరమైన అత్యంత కీలకమైన పోషక పదార్థాల్లో చాలా వరకు పాలలోనే ఉంటాయి. పోషకాహార పదార్థాల జాబితా నుంచి పాలను మినహాయించడం సాధ్యం కాదు. మనది వ్యవసాయ దేశం కావడంతో పాడి పంట ఒకదానికొకటి విడదీయలేని అనుబంధం. చాలా వరకూ చిన్న, కౌలు రైతు కుటుంబాలు పాడి మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో మహిళలదే ప్రధాన శ్రమగా ఉంటుంది. గేదె పాలతో పాల పొడిని తయారు చేయడం కురియన్‌ సాధించిన మొదటి విజయం. ఆవు పాల ఉత్పత్తుల తయారీలో పట్టున్న న్యూజిలాండ్‌ ఇంజినీర్లు.. గేదె పాలతో పొడిని తయారుచేయడం అసాధ్యమన్నారు. కానీ, మన రైతుల దగ్గర గేదెలే ఎక్కువగా ఉన్నాయి. స్వతహాగా మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన కురియన్‌ దేశీయంగానే సాంకేతికతను సహకార రంగంలో అభివద్ధి చేయడం ద్వారా గేదె పాలతో పొడిని, ఇతర ఉత్పత్తులను తొట్టతొలిగా తయారు చేసి శభాష్‌ అనిపించుకున్నారు. గుజరాత్‌లోని 'అమూల్‌' డెయిరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరింపజేసి, కార్పొరేట్ల పాలు చేయడానికి పాలకుల పన్నాగం పన్నుతున్న నేపథ్యంలో.. జూన్‌ 1 ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రపంచ పాల దినోత్సవం 2023 'పాడిని ఆస్వాదించండి' అనే కొత్త థీమ్‌ను ప్రకటించింది సంబంధిత సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం ముమ్మరం చేసి, ప్రజలకు అవగాహన కలిగించాలన్నది సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో ప్రజలలో అవగాహన కల్పించి వారి భాగస్వామ్యం అత్యవసరమని భావించింది.

2
  • నిర్ణయం..

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఐక్యరాజ్యసమితిలోని ప్రత్యేక విభాగం. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహారాన్ని అందించి, ఆహార భద్రతను మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. పాలు సంపూర్ణ ఆహారంగా గుర్తించి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఐక్యరాజ్యసమితి 2001లో నిర్ణయించింది. అలా ప్రతి సంవత్సరం జూన్‌ 1న ప్రపంచ పాల దినోత్సవం నిర్ణయం జరిగింది. పాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది సంస్థ.

3
  • పాడి - పంట..

వాస్తవానికి మానవ పరిణామంలో పశుపోషణ.. తద్వారా పాడి మొదలైంది. ఆ తరువాతనే వ్యవసాయం ఉనికిలోకి వచ్చింది. వేటపై ఆధారపడి జీవించే ఆదిమానవుడు ఆహార భద్రత కోసం జంతువుల్ని మచ్చిక చేసుకోవడం.. ఆహారం అందించడానికి పచ్చిక బయళ్లను వెతుకుతూ సమూహాలుగా సంచారజీవనం గడపటం.. మచ్చిక చేసుకుని ఆహారంగా తీసుకుంటున్న జంతువులను పెంచుకోవడం.. వాటిలో కొన్ని జంతువుల నుంచి పాలు సేకరించడం.. అది నిత్య ఆహార వనరుగా మారటం.. ఇలా అనేక పరిశీలనలు.. పరిణామాల తర్వాత పాడి మనిషికి జీవన వనరుగా.. జీవనోపాధిగా మారింది.
మచ్చిక చేసుకున్న వాటిలో కొన్ని జంతువుల పాలు ఆహారంగా పనికి వస్తాయని కొన్నాళ్ల పరిశీలన తరువాత ఆదిమానవుడికి అర్థమైంది. పైగా పాలు అత్యంత సులువుగా దొరికే ఆహారం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండుకుని తాగే అవకాశం ఉండటంతో రోజూ దొరుకుతాయనే భరోసా.. ఆహార భద్రతకు మరింత అనుకూలంగా తోచింది. దాంతో పశుపోషణ మానవ జీవితంలో ప్రధాన వ్యాపకంగా మారింది. వీటికి ఆహారం పుష్కలంగా లభించే పచ్చిక బయళ్లను వెదుకుతూ మానవ సమూహాలు సంచారజీవనాన్ని అలవర్చుకున్నాయి. సంవత్సరం పొడవునా లేదా ఎక్కువ కాలం పచ్చ గడ్డితో కళకళలాడే నదీ పరివాహక ప్రాంతాలు పశువులను మేపుకుంటూ జీవనం సాగించేందుకు అనువుగా తోచాయి. ఇక్కడే వ్యవసాయానికి అంకురార్పణ జరిగింది. భూమిపై పడిన గింజ సానుకూల వాతావరణ పరిస్థితుల్లో మొలకెత్తడం, పెరిగి పెద్దదై ఆహారంగా పనికొచ్చే ధాన్యాన్ని, ఫలాల్ని ఇవ్వడం అర్థం చేసుకోవడంతో ఆహారం వరకే కాకుండా, మిగులు ఉత్పత్తికి వ్యవసాయం ద్వారా మార్గం సుగమమైంది.'

4
  • జీవనోపాధి..

వ్యవసాయం ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో 60 శాతానికి పైగా ప్రజలు పాడి-పంటపైనే ఆధారపడ్డారు. రైతు పశువులను రెండు విధాలుగా ఉపయోగించుకునేవాడు. పాలిచ్చేవాటిని పాడికి, పాలివ్వని వాటిని వ్యవసాయంలో అరక దున్నడానికి, బండి లాగడానికి వినియోగించేవాడు. ప్రధాన ఆదాయ వనరు పంటలదే అయినా దానికి అనుబంధంగా పాడి కూడా కుటుంబ ఉపాధిగా ఇటీవల కాలంవరకూ కొనసాగుతూ వచ్చింది. వ్యవసాయంలో కలిగే ఒడిదుడుకులను తట్టుకునేందుకు పాడి ఒక ఆదరువుగా ఉండేది. పాడి ద్వారా ఆదాయం సమకూర్చడంలో మహిళలు పాలుపంచుకునేవారు. ఆదాయం సమకూర్చడంలో పాడి పంటలు సమన్వయంగా ఉండటంతో పాడి-పంట అనేమాట రివాజుగా వచ్చింది.

3
  • మనమే నంబర్‌ వన్‌..

ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మంది రైతులు పాలను ఉత్పత్తి చేస్తున్నారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా 84.32 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తయ్యాయి. ఇందులో మన దేశం వాటా అత్యధికంగా 19%. మన తర్వాత స్థానాల్లో ఐరోపా దేశాల కూటమి (ఈయూ), అమెరికా, చైనా, పాకిస్తాన్‌, బ్రెజిల్‌, రష్యా, న్యూజిలాండ్‌ ఉన్నాయి. అయితే, పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈయూ, న్యూజిలాండ్‌, అమెరికా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనా పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. న్యూజిలాండ్‌ ఉత్పత్తి చేసే 2.2 కోట్ల టన్నుల పాలలో 1.9 కోట్ల టన్నులను ఎగుమతి చేస్తుంటుంది. పాల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించిన మన దేశంలో 15 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. వీళ్లంతా ఐదెకరాల లోపు భూములున్న చిన్న, సన్నకారు రైతులే. విదేశాల్లో ఒక్కో రైతుకే వేలాది ఎకరాల భూములుంటాయి. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తుంటారు. అందుకే అక్కడ రైతుల సంఖ్య తక్కువే అయినా దేశ అవసరాలకు పోను మిగులు పాల ఉత్పత్తులు పెద్ద పరిమాణంలో ఉంటాయి. అందువల్ల న్యూజిలాండ్‌లో 12,000 మంది, ఆస్ట్రేలియాలో 6,300 మంది రైతులు మాత్రమే పాల ఉత్పత్తులు తయారుచేస్తున్నప్పటికీ విదేశాలకు పాల ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. కొన్ని చిన్న దేశాలకు మనమూ పాల ఉత్పత్తులను కొంతమేరకు ఎగుమతి చేస్తున్నాం.

  • రైతుదే నిర్ణయాధికారం..

ఈ సహకార సంఘాల్లోని పాడి రైతులకే కాకుండా.. పాలను రైతుల నుంచి వినియోగదారులకు చేర్చే క్రమంలో పనిచేసే వారు లేదా పాలతో వివిధ ఉత్పత్తులు తయారు చేసి అమ్మే లక్షలాది చిన్న వ్యాపారులకు కూడా ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతోంది.
- చిన్నతరహా పాల వ్యాపార సంస్థల్లో ప్రతి వంద లీటర్ల పాలు సేకరించి, శుద్ధి చేసి, వివిధ ఉత్పత్తులు తయారు చేసి విక్రయించే క్రమంలో పరిస్థితులను బట్టి 4 నుంచి 17 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించవచ్చని అంచనా. పాలను ప్రాసెస్‌ చేసి ఆ ప్రాంత వినియోగదారుల అవసరాల మేరకు వివిధ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఏ స్థాయి డెయిరీ సంస్థల్లో ప్రాసెసింగ్‌ జరుగుతుందన్న దాన్ని బట్టి ఎంత మందికి ఉపాధి కల్పించగలమన్నది ఆధారపడి ఉంటుంది.
- 1950-51లో కోటి 70 లక్షల టన్నుల పాలు మన దేశంలో ఉత్పత్తయ్యేవి. అయితే, ప్రజల అవసరాలు తీర్చడానికి అవి సరిపోక అప్పట్లో 55 వేల టన్నుల పాల పొడిని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్లం. కురియన్‌ సారథ్యంలోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (1965) చేపట్టిన 'ఆపరేషన్‌ ఫ్లడ్‌' పథకం ద్వారా సహకార డెయిరీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఫలితంగా పాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. 1998 నాటికి ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి దేశంగా, అత్యధిక సంఖ్యలో పాడి పశువులున్న దేశంగా భారత్‌ ప్రసిద్ధికెక్కింది.

4
  • మొదలైంది ఇలా..

ఐరోపా పారిశ్రామిక విప్లవం (1830) తర్వాత గ్రామాల నుంచి పాలను పట్టణ ప్రాంతాలకు తరలించడానికి రవాణా సదుపాయం ఏర్పడింది. ఆ క్రమంలోనే డెయిరీ పరిశ్రమకు అవసరమైన సాంకేతికతలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 1860లో నెదర్లాండ్స్‌లో మెకానికల్‌ కూలర్‌ను కనుగొనడంతో సాంద్ర డెయిరీ పరిశ్రమకు పునాదులు పడ్డాయి. 1864లో ఫ్రెంచ్‌ మైక్రోబయాలజిస్ట్‌ లూయిస్‌ పాశ్చర్‌ పాల శీతలీకరణ ప్రక్రియను కనుగొన్నాడు. 1880లలోనే అటస్టె గాలిన్‌ హోమోజెనైజేషన్‌ను కనుగొన్నాడు. దీంతో స్కిమ్‌ మిల్క్‌, లో ఫాట్‌ మిల్క్‌ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల తయారీ ప్రారంభమైంది. ఈ ఆవిష్కరణల మూలంగా పాల నాణ్యత దెబ్బతినకుండా నిల్వచేయడం, దూర ప్రాంతాలకు తరలించడం సులభమైంది. ఈ విధంగా పాల ఉత్పత్తుల తయారీ ఒక పరిశ్రమగా రూపు దాల్చింది.

  • గ్రామాల్లో పాల సంఘాలు

మన దేశంలో ఇప్పుడు లక్షకు పైగా గ్రామాల్లో పాల సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో 32 వేలకు పైగా సంఘాలకు మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. పాల ఉత్పత్తి శ్రమలో 70% వరకూ గ్రామీణ మహిళలదే. మన దేశంలో 210 సహకార పాల డెయిరీలు, 9 పెద్ద పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఉన్నాయి. 2017-18 నాటికి మన దేశంలో పాల ఉత్పత్తి 17.64 కోట్ల టన్నులకు పెరిగింది. 2021-22 నాటికి 25.45 కోట్ల టన్నులకు పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. గ్రామాల్లో రైతులు పాల సంఘాలకు పోసే పాలల్లో 47% పాలను ఆయా గ్రామాల్లోని ప్రజలే వినియోగించుకుంటున్నారు. మిగతా 53% పాలు పాల సహకార డెయిరీలు, ప్క్రెవేటు డెయిరీల ద్వారా దగ్గర్లోని పట్టణాలు, నగరాలకు సరఫరా అవుతున్నాయి. వినియోగదారులు చెల్లించే ధరలో 70% మొత్తాన్ని పాడి రైతులు పొందుతున్నారు. సహకార డెయిరీల్లో సభ్యులైన పాడి రైతులకు మరో పది శాతం ఎక్కువ లబ్ధి కలుగుతోంది.
- 1950లో ప్రతి మనిషి రోజుకు 130 గ్రాముల పాలు అందుబాటులో ఉంటే.. సహకార పాడి పరిశ్రమ పుణ్యమా అని 2018 నాటికి రోజుకు 374 గ్రాముల పాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ సగటు తలసరి పాల లభ్యత రోజుకు 294 గ్రాములకన్నా ఇది 80 గ్రాములు ఎక్కువ కావడం విశేషం.

  • కార్పొరేట్ల గుప్పెట్లోకి..

సహకార సమాఖ్య వాదం బలవంతపు సమాఖ్య వాదంగా మారిపోయింది. 2019 నుంచి జరిగిన సంఘటనలను పరిశీలిస్తే గుజరాత్‌కు చెందిన కోఆపరేటివ్‌ అమూల్‌ డెయిరీ ఇతర రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడి ప్రవేశిస్తున్న క్రమం బిజెపి సహకార ఫెడరలిజం అసలు రంగు బయటపడింది. కొత్తగా కేంద్రంలో సష్టించిన సహకార మంత్రిత్వశాఖకు ఇన్‌ఛార్జిగా ఉన్న హోం మంత్రి అమిత్‌షా, కర్ణాటకలోని మాండ్యాలో పర్యటిస్తూ గుజరాత్‌కు చెందిన కోఆపరేటివ్‌ డెయిరీ అమూల్‌లో కర్ణాటక రాష్ట్ర సహకార డెయిరీ నందినిని విలీనం చేయాలన్న ఉద్దేశాన్ని వెల్లడించారు. ఈ ప్రకటనపై కర్ణాటకలో రైతులే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో దేశంలోనే అతిపెద్ద సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలైన అమూల్‌, నందిని మధ్య సహకారం కోసం మాత్రమే, విలీనం ప్రతిపాదన లేదని బొమ్మై నాడు సమర్థించారు. ఏప్రిల్‌ 5న అమూల్‌ తన ట్విటర్‌లో బెంగళూరు నగరంలో అమూల్‌ పాలు, పెరుగును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించి, మళ్లీ విలీనంపై చర్చను లేవదీసింది. అమూల్‌లో నందినిని విలీనం చేయడం, లేదంటే కర్ణాటకలో నందినికి సమాంతరంగా అమూల్‌ నెట్‌వర్క్‌ను చొప్పించడం ద్వారా స్థానికంగా నందినిని ధ్వంసం చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ నమూనాను తతిమ్మా రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి కేంద్రం అడుగులేస్తోంది.

2
  • స్వేచ్ఛగా కార్పొరేట్ల ప్రవేశం

కర్ణాటక.. గుజరాత్‌కి ఆనుకొని లేదు. గుజరాత్‌, బెంగళూరు మధ్య పాల రైళ్లు కూడా లేవు. కర్ణాటక మార్కెట్‌లో చాలా కాలంగా ఉన్న ప్యాకేజి, ప్రాసెస్‌ చేసిన పాల ఉత్పత్తులు ఉండగా, బెంగళూరు మార్కెట్‌లో తాజా అమూల్‌ పాలు, పెరుగు అమ్మకాలపై స్థానిక సహకార డెయిరీలలో భయాలు కలుగుతున్నాయి. ఇది అమిత్‌షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖ నిజమైన ఉద్దేశాల గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక సహకార సంస్థను మరొక సహకార సంస్థ కబళించడం సహకార స్ఫూర్తికి విరుద్ధం. అమూల్‌, నందిని విషయంలో బిజెపి బహిరంగంగా చెప్పేవాటి కంటే దాచిపెట్టేవే ఎక్కువ. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కెఎంఎఫ్‌) బ్రాండ్‌ పేరు నందిని. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో అత్యంత శక్తిమంతమైన యూనియన్లతో ఏర్పడ్డ ఫెడరేషన్‌. దాదాపు 25 లక్షల మంది రైతులు ఉపాధి పొందుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. దేశంలో అమూల్‌ తర్వాత నందిని మాత్రమే పెద్ద టర్నోటర్‌ కలిగి ఉంది. ఆ ఏడాది అమూల్‌ టర్నోవర్‌ రూ.65 వేల కోట్లు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం దేశంలో రూ.15 లక్షల కోట్ల పాల వ్యాపారం జరుగుతోంది. దీనిలో 10 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉంది. పాల రంగంలో ప్రైవేటు పెట్టుబడి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండే సరికొత్త మోడల్‌ రావాలని ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. 2019లో కేంద్రంలో రెండవ తడవ అధికారంలోకొచ్చిన బిజెపి సర్కారు పాల సహకార వ్యవస్థలో స్వేచ్ఛగా కార్పొరేట్ల ప్రవేశం కోసం, సహకార డెయిరీల విచ్ఛిన్నానికి సరికొత్త నమూనా అమలుకు సిద్ధమైంది.

  • మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్స్‌

భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ ప్రకారం సహకార సంస్థలు రాష్ట్రాల జాబితాలోకొస్తాయి కాబట్టి సహకార కార్యకలాపాలు రాష్ట్ర, ప్రైవేటు రెండింటిలోనూ, మూడవ రంగ స్వయంప్రతిపత్తిగా నిర్వహించబడతాయి. అవి ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తాయి. సంస్థలో పెట్టుబడితో నిమిత్తం లేకుండా ఒక వ్యక్తికి ఒక ఓటు ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో నడుస్తున్న పెద్ద పెద్ద కోఆపరేటివ్స్‌లోకి భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలంటే కేంద్ర ప్రభుత్వ పాలనా పర్యవేక్షణ అసరమని తొలుత యుపిఎ సర్కారు భావించి, రాజ్యాంగానికి 97వ సవరణ చేయగా సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ కేంద్రం ఆధ్వర్యంలో బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఏర్పాటుకు అనుమతించింది. సహకార వ్యవస్థలో కార్పొరేట్ల ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడి మోడీ రెండోసారి అధికారంలోకొచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. కార్పొరేట్‌ మధ్యవర్తిత్వ, నియంత్రిత రైతు ఉత్పత్తిదారు సంస్థల ఏర్పాటుకు మూడు నల్ల వ్యవసాయ చట్టాలతో కఠోర ప్రయత్నం జరిగింది. రైతుల చారిత్రాత్మక పోరాటం కారణంగా మూడు వ్యవసాయ చట్టాలూ రద్దయినప్పటికీ రాష్ట్ర వ్యవసాయ చట్టాలలో ఇటువంటి నిబంధనలున్నాయి. పాల సహకార సంస్థలతో సహా ఇతర సంస్థల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న రైతుల ప్రతిఘటనను అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం అనేక ఃవినూత్నః మార్గాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొంటే అమూల్‌ ఇతర రాష్ట్రాలకు విస్తరించడం, దాని ద్వారా ప్రైవేటు కేపిటల్‌ ప్రవేశం అసలు కథ బోధ పడుతుంది. 2019లో బహుళ దేశ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) చర్చల్లో ఈ ప్రక్రియను గుర్తించవచ్చు. ఆర్‌సిఇపి చర్చల్లో ముఖ్యమైన వివాదాల్లో ఒకటి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ పాడి దిగ్గజాలు ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తులపై జీరో సెస్‌ ప్రతిపాదన. భారతీయ పెద్ద వ్యాపారులు అటువంటి వెసులుబాటు కోసం ఎదురు చూస్తుండగా, రైతులు దేశ వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు చేశారు. పలు కారణాల వలన చివరికి ఆర్‌సిఇపి నుంచి భారత్‌ ఉపసంహరణ జరిగింది. ఆర్‌సిఇపి ఎదురుదెబ్బ ఉన్నప్పటికీ, దోపిడీ చేయడం కోసం పాడి రంగంపై కార్పొరేట్లు ఆసక్తి పెంచుకున్నారు. ఫిక్కీ 2020లో ఃభారతదేశంలో పాల రంగం అభివృద్ధిః పేరిట స్ట్రేటజీ పేపర్‌ వెల్లడించింది. ప్రైవేటు పెట్టుబడిని తప్పక అనుమతించాలని, మధ్యవర్తిత్వం, నియంత్రిత వ్యవస్థలతో సులభతరం చేయాలని సూచించింది. ఎగుమతి సామర్ధ్యాన్ని పెంచుకోవాలని పేర్కొంది. మరో సంస్థ సిఐఐ 2022లో పాల వ్యాపారానికి అదనపు ప్రేరణ ఇవ్వడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని తెలిపింది. రైతులకు సబ్సిడీలు, సంస్థాగత పరపతి కోసం కార్పొరేట్‌ రంగం ఎక్కువగా పాల్గొనాలని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, రైతులతో టై-అప్‌ పెరగాలని పేర్కొంది. 

  • కల్తీ.. కల్తీ..

కల్తీలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. లాభాల మోహంలో ప్రజారోగ్యం అస్సలు కనబడదు. పసిపిల్లలు తాగే పాలు.. యూరియా, షాంపూల్లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో తయారుచేస్తున్నారు. పాలను నిలవ చేయడం, పాల పంపిణీ, పాల ఉత్పత్తుల తయారీ తదితర విషయాల్లోనూ ప్రజారోగ్యం పక్కన పెట్టి ప్రైవేటు డెయిరీలు లాభాలే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి.

  • కేంద్ర నియంత్రణలోకి

సహకార విభాగం 2021 వరకు వ్యవసాయ మంత్రిత్వశాఖలో ఒక చిన్న విభాగం. అకస్మాత్తుగా మోడీ ప్రభుత్వం సహకార విభాగాన్ని కేబినెట్‌ మంత్రి బాధ్యతలతో స్వతంత్ర మంత్రిత్వశాఖ స్థాయికి పెంచింది. కేబినెట్‌లో రెండో స్థాయిలో ఉన్న అమిత్‌షా ఆ విభాగానికి మంత్రి కావడం గమనార్హం. ఈ శాఖ ఏర్పడిన రెండు వారాల వ్యవధిలో భారత పాల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఒక ప్రైవేటు ఇన్వెస్టుమెంట్‌ యాక్సిలరేటర్‌ను నెలకొల్పుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది పెట్టుబడిదారులతో పని చేయడానికి ఏర్పాటు చేసిన నిర్వహణ బృందమని పేర్కొంది. కేంద్రం నియంత్రణ కిందికి సహకార వ్యవస్థను తీసుకొచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది. పెట్టుబడిదారులకు వ్యాపార సౌలభ్యం కలిగించేందుకు, సరఫరా గొలుసులో కార్పొరేట్ల ప్రవేశానికి ఇది పనికొస్తుంది. కొత్త మంత్రి అమిత్‌షా, బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సిఎస్‌) బిల్లును ప్రవేశపెట్టారు. సొసైటీలో ముగ్గురు పాలనాధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణ, ఆడిటింగ్‌కు కేంద్రానికి అధికారం ఇస్తుంది. ఎంఎస్‌సిఎస్‌ రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి కొద్ది నెలల ముందు, సిక్కింలో అమిత్‌షా మాట్లాడుతూ మల్టీ స్టేట్‌ మిల్క్‌ కోఆపరేటివ్‌ అన్నారు. ఇది ఐదు పాల సహకార సంస్థలతో ఏర్పడింది. అందువల్ల నందిని, అమూల్‌ విలీనం, షా చెప్పినట్లు దేశంలో రెండు పెద్ద కోఆపరేటివ్స్‌ మధ్య పరస్పర సహకారం కోసం కాదు. ప్రైవేటు పెట్టుబడి ప్రవేశంతో కేంద్ర పాలనలో మల్టీ స్టేట్‌ సొసైటీగా మార్చడం.. పాల సహకార రంగాన్ని ప్రపంచ పాల మార్కెట్‌లో చేరేందుకు మూడు ఎగుమతి ఆధారిత మల్టీ స్టేట్‌ మిల్క్‌ సొసైటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎగుమతులను ప్రోత్సహించేందుకు పని చేస్తాయని ఈ ఏడాది జనవరి 11న ప్రధాని ప్రకటించారు. అమూల్‌ను పాల ఎగుమతికి ప్రమోటర్‌గా జనవరి 23న నియమించారు. ప్రపంచ పాల ఎగుమతుల్లో 33 శాతం వాటా సాధించడం, ప్రాసెసింగ్‌, ఎగుమతి వాణిజ్యంలో పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యమని చెప్పారు.

2
  • రెండు లక్షల సంఘాల నిర్మాణం

ఈ ఏడాది మార్చి 10న గుజరాత్‌లోని ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రెండు లక్షల పంచాయతీల్లో స్వతంత్ర పాల సొసైటీలను ఏర్పాటు చేస్తామని, ఇవి అమూల్‌ నేతృత్వంలోని ఎగుమతి ఆధారిత సొసైటీతో ముడిపడి ఉంటాయన్నారు. ప్రస్తుత సహకార వ్యవస్థ ఎగుమతి మార్కెటింగ్‌కు వడ్డించే అమూల్‌ సామ్రాజ్యంలో భాగమని స్పష్టం చేశారు. ఈ వ్యూహాన్ని కొనసాగిస్తూ అమూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మెహతా ఏప్రిల్‌ 5న అమూల్‌ తాజా పాలు, పెరుగు అమ్మకాలు బెంగళూరులో ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఏప్రిల్‌ 9న ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరు మాసాల్లోనే బెంగళూరులో ఆధునిక వాణిజ్యంతో అమూల్‌ ప్రవేశం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వతంత్ర పాల సంఘాల ఏర్పాటు ద్వారా అమూల్‌ పాలను సేకరించి నందినికి సమాంతరంగా వ్యాపారం చేస్తుందన్నమాట. ఇది కచ్చితంగా నందిని మనుగడకు హానికరం. పాల సహకార సంస్థలను కార్పొరేట్లు స్వాధీనం చేసుకునే కేంద్రీకరణ. మొదట్లో పాల ఉత్పత్తిదారులకు ఎక్కువ ఆదాయం లభించినా భవిష్యత్తులో మొత్తం పాల ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రక్షణ ఉండదు. స్వేచ్ఛా మార్కెట్‌లో ప్రపంచ పాల ఆర్థిక వ్యవస్థకు లోబడి ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ భారతాన్ని మరింత అతలాకుతలం చేస్తుంది. అంతేకాదు కర్ణాటకలోని 25 లక్షల మంది రైతులనే కాకుండా గుజరాత్‌లో పాల ఉత్పత్తిదారులతో సహా దేశంలో గల పది కోట్ల మంది రైతులను దెబ్బతీస్తుంది.

4
  • సంపూర్ణ ఆహారం

పాలు సంపూర్ణ పౌష్టికాహారం. విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార నిపుణులు కల్తీ లేని పాలను సమతుల ఆహారంగా అభివర్ణించారు. పాలు, పాల ఉత్పత్తులను ప్రతిరోజు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. 100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, టీనేజి పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డెయిరీలు వెలిశాయి. అయితే డెయిరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం.

స్నేహ డెస్క్‌
9490099006