అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు కొంతకాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపథాలు గొల్లుమంటున్నాయి. తెగించి ఎదురునిలిచినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. చిత్తూరు జిల్లాల్లో ఏనుగు దాడిలో ముగ్గురు మరణించినా, తిరుమల కొండల్లో అభం శుభం తెలియని పసిపాప చిరుతకు బలైనా, వందలాది ఎకరాల్లో పంటపొలాలు ధ్వంసమైనా.. ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నా కారణం ఒక్కటే.. అది మృగాలకి, మనుషులకి మధ్య పెరుగుతున్న ఘర్షణ. అనివార్యంగా మారుతున్న మనుగడ పోరాటం. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా తమ మానాన తాము బతికే పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు నుండి వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనకు సమస్యగా ఎందుకు మారుతున్నాయి? ఈ సంఘర్షణకు పరిష్కారం లేదా? అసలీ దుస్థితికి కారణం ఏమిటి? దీనిపై ఈ వారం ప్రత్యేక కథనం..
వన్య మృగాలు జనావాసాల్లోకి రావడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీకాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారసపడటం అనేది సహజమే. అయితే, అది మృగాలకు మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం అరుదు. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా, మనిషి తారసపడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావాసాలను దాటాల్సి వచ్చినా.. సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలను కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. ఆ మేరకు మనుషులకు మృగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలూ పెరుగుతున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మనుషుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలూ పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2017 నుండి 2021 సంవత్సరాల మధ్య కాలంలో వన్యమృగాల బారిన పడి రాష్ట్రంలో 139 మంది మరణించారు. మృతులలో పురుషులే ఎక్కువ. ఏ జంతువుల బారిన పడి ఈ మరణాలు చోటుచేసుకున్నాయి అన్నది ఎన్‌సిఆర్‌బి అధికారికంగా ప్రకటించలేదు. అయితే, అటవీ, పోలీస్ అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఏనుగులు, ఎలుగుబంట్ల దాడుల కారణంగానే ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన చిరుతలు, పులుల దాడుల్లో మనుషులు మృతి చెందిన సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇటీవల తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన దీనికి మినహాయింపు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలు ఏనుగుల గుంపుల బారిన తరచూ పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సంవత్సరానికి సుమారుగా 30 మంది వన్యమృగాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 సంవత్సరంలో 31 మంది, 2019లో 25 మంది, 2020లో 32 మంది మరణించారు. అనధికారికంగా మరికొన్ని సంఘటనలూ చోటుచేసుకుని ఉండవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్ల దాడులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నాలుగు ఏనుగుల మంద ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మన్యం పార్వతీపురం జిల్లాలో కొద్దిరోజుల క్రితం ఆరు ఏనుగులు కనిపించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏనుగుల దాడిలో ఆరుగురు రైతులు మరణించారు. వీటిని బంధించడానికి వచ్చిన ఒక ట్రాకర్ కూడా మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదు సంవత్సరాల కాలంలో పదిమంది రైతులు మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో గత ఏడాది పెద్ద పులుల సంచారం కలకలం రేపగా, ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్దపులి కనిపించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి. కౌండిన్య వైల్డ్‌లైఫ్ శాంచురీ నుండి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి ఏనుగుల రాకపోకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక నుండి కూడా ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ ఒంటరి ఏనుగు బారిన పడి, చిత్తూరు జిల్లాలో కొద్దిరోజుల క్రితం ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.
మృగాల సంగతేంటి ...
మనిషికి మృగాలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో నష్టపోతున్నది మనిషేనా..? 'కాదు.. మృగాలు కూడా' అన్నది ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికే కొన్ని జంతువుల ఊసు కూడా లేకుండా నిర్మూలన జరిగింది. ఇది మనం చేసిన పనే. చీతా దీనికి ఉదాహరణ. మన దేశంలో చీతాల జాతి పూర్తిగా అంతరించిపోవడంతో విదేశాల నుండి దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం 2018-19 నుండి 2020-21 వరకు దేశవ్యాప్తంగా 222 ఏనుగులు విద్యుద్ఘాతంతో చనిపోయాయి. రైళ్లు ఢ కొనడం వల్ల 45, వేటగాళ్ల కారణంగా 29, విషాహారం తినడం వల్ల 11 ఏనుగులు మరణించాయి. విద్యుద్ఘాతం వల్ల చోటుచేసుకున్న ఏనుగుల మరణాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 41 ఏనుగులు కరెంటు షాక్ కారణంగా మరణించాయి. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు (34) అస్సోం (33) ఉన్నాయి. ఈ కాలంలోనే ఏనుగుల దాడుల వల్ల దేశవ్యాప్తంగా 1579 మంది మరణించారు. ఈ తరహా మరణాల్లో ఒడిశా మొదటిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఏనుగుల దాడి కారణంగా మూడు సంవత్సరాల్లో 322 మంది చనిపోయారు. 291 మరణాలతో జార్ఖండ్, 240 మరణాలతో పశ్చిమబెంగాల్, 229 మరణాలలో అస్సోం ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో పాత అనంతపురం జిల్లాలోని మడకశిర సమీపంలో ఆగస్టు నెలలో విషాహారం తిని, మృతి చెందిన రెండు చిరుతల మృతదేహాలు దొరికాయి. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం సమీపంలో ఒక చిరుత అస్తిపంజరం లభించింది.
ఏనుగు.. మనిషి..
ఏనుగుల దాడిలో మరణించిన మనుషులు 2019-2020లో 585 అయితే, 2020-2021లో 461, 2021-22లో 533 మంది. రైలు ప్రమాదాల్లో ఏనుగులు 2019-2020లో 19, అయితే, 2020-2021లో 14, 2021-22లో 12 మరణించాయి. విద్యాద్ఘాతం వల్ల ఏనుగులు 2019-2020లో 81 అయితే, 2020-2021లో 76, 2021-22లో 65 మృతి చెందాయి. వేటగాళ్ల వల్ల ఏనుగులు 2019-2020లో 6, అయితే, 2020-2021లో 9, 2021-22లో 14 మరణించాయి. విషాహారం వల్ల ఏనుగులు 2019-2020లో 6, అయితే, 2020-2021లో 9, 2021-22లో 14 మృత్యువాత పడ్డాయి.
పెద్ద పులుల సంగతి కూడా ఇంతే. 2019-21 మధ్య 29 పులులు వేటగాళ్ల బారిన పడి మృతి చెందాయి. మరో 197 మరణాలకు కారణాలు నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో 125 మంది దేశ వ్యాప్తంగా పులుల బారిన పడి మరణించారు. వీటిలో సగానికి పైగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న సంఘటనలే. ఆ మూడేళ్ల కాలంలో మన రాష్ట్రంలో పులులు, చిరుతల కారణంగా ఒక్క మరణం కూడా రికార్డు కాలేదు.
పులుల కారణంగా 2019-20లో 50 మంది చనిపోతే, 2020-21లో 44 మంది మృత్యువాత పడ్డారు. 2021-22లో 31 మంది చనిపోవడం జరిగింది. సహజంగా మరణించిన పులులు 19-20లో 44 అయితే, 20-21లో 20, 21-22లో కేవలం నాలుగు మాత్రమే. వల వేయడం వల్ల, బోన్లు పెట్టిన కారణంగా 19-20లో 6, 20-21లో 9 అయితే, 21-22లో 14 పులులు మరణించాయి. అసహజంగా చూసినప్పుడు ఈ క్రమంలో 3, 0, 2 చనిపోయాయి. పరిశీలనలో ఉన్న పులల మరణాల సంఖ్యను పరిశీలిస్తే 19-20లో 22, 20-21లో 71, 21-22లో 104 నమోదయ్యాయి. వేటగాళ్లకు చిక్కి మరణించిన పులుల సంఖ్య ఈ వరుసలోనే 10, 7, 13గా ఉంది.
ఎందుకీ స్థితి..
ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ పోగ్రాం (యుఎన్‌ఇపి), వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యుడబ్య్లుఎఫ్) సంయుక్తంగా 2021 జులైలో విడుదల చేసిన 'ఏ ఫ్యూచర్ ఫర్ ఆల్' నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులుల జాతుల్లో 75 శాతానికి ప్రమాదకర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాయి. అలాగే ధృవపు ఎలుగుబంట్లు, ఏనుగులు, సీల్స్ వంటి ఉభయచరాలు, పెద్ద సంఖ్యలో సరీసృపాలు మనుగడ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, వన్యమృగాల వ్యాపారం, మౌలిక వసతుల పేరిట అడవుల విధ్వంసాన్ని ఈ పరిస్థితికి కారణంగా ఆ నివేదికలో పేర్కొన్నారు. వాతావరణ మార్పుల సంగతి అలా ఉంచితే, మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఇతర అంశాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలో పెద్ద ఎత్తున అడవుల నిర్మూలన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదైన అడవులు (రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా) 77.53 మిలియన్ హెక్టార్లలో వ్యాపించి ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు (ఐఎస్‌ఎఫ్‌ఆర్) - 2021 ప్రకారం మొత్తం నమోదైన అటవీభూమిలో ప్రస్తుతం 51.66 మిలియన్ హెక్టార్లలో మాత్రమే అడవులు ఉన్నాయి. మరి మిగిలిన 25.87 మిలియన్ హెక్టార్ల (ఆరు కోట్ల 39 లక్షల ఎకరాలు) అటవీ భూమి ఏమైనట్టు? తగ్గినట్టే కదా..! ఈ భూమి ఏమైంది? ఎవరైనా ఆక్రమించారా? అభివృద్ధి పేరుతో కంపెనీలకు కేటాయించారా? అన్న ప్రశ్నలకు ఆ నివేదిక జవాబు ఇవ్వలేదు. ఈ పరిణామం మన రాష్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోనూ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో 13,01,900 హెక్టార్ల (సుమారుగా 31 లక్షల ఎకరాలు) లోని అడవులు మాయమయ్యాయి. ఇది మొత్తం రికార్డెడ్ అటవీభూమిలో సుమారుగా 35 శాతం. తెలంగాణలో 8,99,200 హెక్టార్లు (33 శాతం) రికార్డెడ్ భూమిలోని అడవులు తగ్గాయి. తమిళనాడులో 5,65,7000 హెక్టార్లు (25 శాతం) కర్నాటకలో 15,73,600 హెక్టార్లు (41 శాతం), ఒడిశాలో 28,51,000 హెక్టార్లు (46.59 శాతం) రికార్డైన అటవీభూమిలో ప్రస్తుతం అడవులు కనిపించడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో అడవులు మాయమవుతున్నాయి కాబట్టే వన్య మృగాలకు జనావాసాల్లోకి రాక తప్పని స్థితి ఏర్పడుతోంది. మన పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటకలో 40 శాతానికి పైగా రికార్డెడ్ ఫారెస్ట్ భూమి తగ్గడం ఈ సందర్భంగా గమనార్హం. కరోనా సమయంలో అనేక ప్రాంతాల్లో వన్యమృగాల సంచారం పెరిగిందని, తరువాత కాలంలో దానినే అలవాటుగా చేసుకున్నాయన్న వాదన కూడా ఉంది. అప్పట్లో లాక్‌డౌన్ కారణంగా వాహనాలతో పాటు మనుషుల రాకపోకలను నియంత్రించిన సంగతి తెలిసిందే. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరిగాయి. వివిధ దేశాల్లో ఉన్న నిపుణులు కలిసి సంయుక్తంగా అకడమిక్ జర్నల్ 'సైన్స్'లో ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం సాధారణంగా తిరిగే దానికన్నా రెట్టింపు విస్తీర్ణంలో కరోనా సమయంలో వన్యమృగాల కదలికలు నమోదయ్యాయి. ఏనుగులు, ఒంటెలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి 43 విభిన్న జాతులకు చెందిన 2,300 జంతువులును ట్రాక్ చేసి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ సమయంలోనే మానవ నివాస ప్రాంతాల్లో సులభంగా ఆహారం దొరకడాన్ని గమనించిన వన్యమృగాలు ఆ తరువాత కూడా దానికే ప్రయత్నిస్తున్నాయని, అందువల్లే జనావాసాలకు సమీపంగా వస్తున్నాయని అంటున్నారు.
తిరుమలలో పరిష్కారం ఏమిటి?
శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత పెద్దఎత్తున కొనసాగుతోంది. నరికివేత సమయంలో స్మగ్లర్లు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో వన్యమృగాలు చెల్లాచెదురవుతన్నాయని, వీటిలో కొన్ని తిరుమల మెట్ల మార్గంవైపు వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. కరోనా సమయంలో అలవాటు కావడం ఒక కారణంగా చెప్తున్నారు. దానితో పాటు ఆ తరువాత యాత్రికుల నుండి సులభంగా ఆహారం అందుతుండటంతో కొన్ని రకాల వన్యమృగాలు మెట్ల మార్గం వైపు వస్తున్నాయనేది మరొక కారణం. వాటిని వెంబడించి చిరుతల వంటి జంతువులు కూడా వస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. టిటిడి అధికారిక లెక్కల ప్రకారం రోజుకు 2 నుండి 3 టన్నుల వృథా అయిన ఆహారపదార్థాలను మెట్లదారి మీద వదిలివేస్తున్నారు. దీనిలో అధికభాగాన్ని సేకరిస్తున్నా, ఇంకా పెద్దఎత్తున మిగిలిపోతోంది. వీటికోసం జింకలు, అడవికుక్కలు వస్తున్నాయి. యాత్రికులు పారేసే పండ్లు, వాటి తొక్కల కోసం ఎలుగుబంట్లు కూడా మెట్ల దారి వద్దకు వస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే ఉన్న జింకల పార్కును టిటిడి ఇటీవలే మూసివేసింది. అయినప్పటికీ యాత్రికుల నుండి సులభంగా లభించే ఆహారానికి అలవాటుపడ్డ జింకలు ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాయి. వీటికోసం వస్తున్న చిరుతలు యాత్రికులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఫెన్సింగ్ వేయాలన్న డిమాండ్ భక్తుల నుండి పెద్దఎత్తున వస్తోంది. ఈ ప్రతిపాదనను అటవీశాఖతో పాటు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఫెన్సింగ్ వన్యమృగాలు స్వేచ్ఛగా తిరగడానికి ఆటంకంగా మారనుండటమే దీనికి కారణం. అదే జరిగితే భవిష్యత్‌లో మరింత తీవ్ర పరిణామాల చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వన్యమృగాల స్వేచ్ఛకు ఆటంకం కలిగించకుండా ఉండే అండర్‌పాస్, ఓవర్‌పాస్ నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ దేశాల్లో ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయి. మనదేశంలోనూ ముంబయి-నాగపూర్ ఎక్స్‌ప్రెస్‌వే (బాలసాహెబ్ థాక్రే సమృద్ధి మహామార్గ్) లో వన్యమృగాల కోసం ప్రత్యేకంగా ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో తొమ్మిది గ్రీన్‌బ్రిడ్జిలు (ఓవర్‌పాస్), 17 అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. మనదేశంలో ఈ తరహా నిర్మాణం ఇదే మొదటిది. దీనికి కొంత ఖర్చు ఎక్కువ అయినప్పటికీ, టిటిడికి నిధుల కొరత లేని విషయం తెలిసిందే. తిరుమలలోనే కాదు. నల్లమలతో పాటు రాష్ట్రంలో అటవీ ప్రాంతాల మీదుగా రహదారులు వేయాల్సిన ప్రతిచోటా ఈ విధానాన్ని అమలు చేయవచ్చు.
పరిష్కారం ఏమిటి..
మనుషులకు, వన్యప్రాణులకు మధ్య తలెత్తుతున్న ఈ ఘర్షణను సాధ్యమైనంత మేరకు తగ్గించవచ్చు. అయితే, ఈ దిశలో చొరవ చేయాల్సింది మనుషులే. స్థానిక ప్రజలను ఈ కృషిలో భాగస్వాముల్ని చేయడం ద్వారా అనేక దేశాలు ఈ సమస్యను సాధ్యమైనంత మేర తగ్గించాయి. స్థానిక ప్రజలకు వన్యమృగాలు, వాటి కదలికలు, ఆహారపు అలవాట్ల మీద అవగాహన కల్పించడం ద్వారా భయాన్ని పొగొట్టి, అవసరమైన జాగ్రత్తలు నేర్పడమన్నది దీనిలో మొదటిదశ. ఆ తరువాత పరిరక్షణకు సంబంధించిన పనుల్లో వారిని భాగస్వాముల్ని చేయాలి. ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (యుఎన్‌ఇపి) కూడా దీనినే ధృవీకరించింది. స్థానిక సమాజాలను ఈ కృషిలో భాగస్వాముల్ని చేయడం ద్వారా పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని, సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొంది. రాష్ట్ర అటవీశాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ దిశలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో గ్రామస్తులు తమ నివాస ప్రాంతాల పరిసరాల్లో వన్యమృగాల కదలికలను దాచిపెట్టే పొదలు లేకుండా చూసుకోవాలని, పెంపుడు జంతువులను నివాసాలకు దగ్గరగా ఉంచుకోవాలని చెప్పారు. ఆహారవ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయడం కూడా వన్యమృగాలను ఆకర్షిస్తోందని, ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో 73 పెద్దపులులు ఉన్నాయని ఒక అంచనా. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి, పోయే వాటిని మినహాయిస్తే 50-53 మధ్యే వీటి సంఖ్య ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2018 గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 1492 చిరుతలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన శేషాచలం అడవుల్లో 40 నుండి 50 చిరుతలు మాత్రమే తిరుగుతున్నాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం తాజాగా (2023) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏనుగుల సంఖ్య రాష్ట్రంలో 70 నుండి 80 లోపే. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టే.. వీటి పరిరక్షణ కీలకంగా మారింది. ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడాలంటే జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించడం తప్పనిసరి.
పొగడ దొరువు
7382168168