Nov 19,2022 09:18
  • వీరి కోసం 27 సీజనల్‌ హాస్టళ్ల ఏర్పాటు

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌ : ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి ఉపాధి కూలీలు వలస బాటపట్టారు. వారితో పాటు పిల్లలు కూడా వలస వెళ్తారు. దాదాపుగా ఏడువేల మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. వలస వెళ్లే విద్యార్థులు బడికి దూరంగా ఉండకుండా వారి కోసం ప్రత్యేకంగా సీజనల్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేశారు. ఆదోని డివిజన్‌ పరిధిలోని 17 మండలాల నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, చెన్నై బెంగళూరు నగరాలకు పనుల కోసం కూలీలు వలస వెళ్తారు. వారితో పాటు పిల్లలను కూడా తీసుకెళ్తారు. విద్యార్థుల హాజరు నమోదు ఆధారంగా ఇటీవల విద్యాశాఖ అధికారులు సర్వే చేపట్టారు. నవంబర్‌లో 7,577 మంది విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని గుర్తించారు. ఇందులో ఆరు నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన బాలబాలికలు ఉన్నారు. వీరందరూ విద్యకు దూరం కాకుండా ప్రత్యేకంగా సమగ్ర శిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో సీజనల్‌ హాస్టల్స్‌ను జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఆదోని డివిజన్‌లో దాదాపు 27 హాస్టల్స్‌ను ప్రారంభించారు. ఇందులో ఉదయం, రాత్రి రెండు పూటలా భోజనంతోపాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. మధ్యాహ్నం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం కింద ఆహారాన్ని అందిస్తారు. సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ నిమిత్తం ఒక కేర్‌ టేకర్‌, ఒక విద్యా వలంటీర్‌, ఒక వంట మనిషి, ఒక వాచ్‌మెన్‌ ఉంటారు. ఈ హాస్టల్స్‌ నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూపులకు అప్పగించారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు సీజనల్‌ హాస్టల్స్‌ను నడిపేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ చర్యలు చేపట్టింది.
 

                                                                      మరో 41సీజనల్‌ హాస్టల్స్‌

కె. వేణుగోపాల్‌ అడిషనల్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ సమగ్ర శిక్ష అభి యాన్‌ కర్నూలు జిల్లాలో వలస వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సీజనల్‌ హాస్టల్స్‌ ప్రారంభించాం. మొదట విడత కింద 27 హాస్టల్స్‌ మంజూరు చేయగా.. మరో విడతలో 41 హాస్టల్స్‌ ఏర్పాటు చేయనున్నాం. ఏ ఒక్క విద్యార్థీ బడికి దూరం కాకుడదనే ప్రభుత్వ లక్ష్యం. ఈ విద్యా సంవత్సరం వరకు సీజనల్‌ హాస్టల్స్‌ను నిర్వహిస్తాం.