Oct 08,2023 12:02

పక్షుల కిలకిల రావాలు.. కుహూకుహూ రాగాలతో.. తెల్లవారు జామున మేల్కొలుపు.. సాయం సమయానికి పనిచేసి అలసిన శరీరాలకు ఆనందాన్నిచ్చే గానలహరి.. ఇలా ఎన్నో ఆనందాలు.. తనివి తీరని అనుభూతులు. పక్షి కూత.. పక్షి రాక మనిషి జీవన గమనంలో ఒక విడదీయరాని బంధమని చెప్పవచ్చు. అలా మనతో బంధాన్ని పెనవేసుకుని.. మనతో గడిపిన పక్షులు శీతాకాలం వచ్చేసరికి కనిపించకపోతే..! మరికొన్ని సమయాల్లో కనుమరుగైతే..! ఏమయ్యాయి? ఎటుపోయాయి? అనే ప్రశ్నలు వెంటాడతాయి కదా! అదే జరిగింది.. ప్రపంచ ప్రజల్లో కొన్ని శతాబ్దాల పాటు. ఆ ప్రశ్నలే అనేక విశేషాలు, విషయాలను మన ముందుంచాయి. ఈ నెల 14న 'ప్రపంచ వలస పక్షుల దినోత్సవం' సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలతో ప్రత్యేక కథనం.
అది శీతాకాలమా.. వసంతకాలమా.. శరదృతువా.. అనే విషయాన్ని అలా ఉంచితే.. పక్షుల వలస సంగతులు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. పక్షుల వలస గురించి శాస్త్రవేత్తల్లో ఆసక్తికరమైన మీమాంస బయలుదేరింది. ఆయా పరిశోధనల్లో ప్రపంచంలో దాదాపు 4,000 పక్షి జాతులు వలస పోతాయని తేలింది. మరో విశేషమేమంటే అసలు వలస వెళ్లని పక్షుల కంటే, చిన్న వయసులోనే వలస వెళ్ళే పక్షులు ఎక్కువకాలం జీవిస్తాయని పరిశోధనల్లో రుజువైంది.

2
  • ఎందుకు పోతాయి..

చిన్న ప్రాణి.. చిరు ప్రాయం.. వలసపోయేంత అవసరం ఏముంది అనుకుంటున్నారా.. అదేనండి కూడు, గూడు.. మరికొన్ని అవసరాలు.. అంటున్నారు పరిశోధకులు. అవి నివసించే ప్రదేశంలో ఆహార వనరులు తగ్గినప్పుడు మెరుగైన ప్రదేశానికి వలస వెళతాయి. గూడు కట్టుకోడానికి అనుకూలమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వలస వెళతాయి. వాతావరణ మార్పులు తీవ్రంగా ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగే ముందు, సంతానోత్పత్తిని పదిలపరచుకోవడానికి వలస మార్గం పడతాయని పరిశోధకులు అంటున్నారు.

  • ఎలా వెళ్ళగలవు..

భూమి, సూర్యుడు, నక్షత్రాలే వీటి ప్రయాణానికి దిశా నిర్దేశాలు. సూర్యోదయం, సూర్యాస్తమయం, వలస మార్గంలో పగటిపూట కనిపించే ల్యాండ్‌మార్క్‌లు వాటికి సమాచార సూచికలు. వాటిలో ఉండే జీవగడియారం ద్వారా భూ అయస్కాంత క్షేత్రాన్ని గ్రహిస్తాయి. ధ్రువాలవైపు మార్గాలను అయస్కాంత క్షేత్ర సహాయంతోనే తెలుసుకుంటాయి.

  • ఒకే మార్గంలో ఎలా ?

హంసలు, బాతులు లాంటి పక్షులు తమ బృందంలోని పెద్ద పక్షులను అనుసరిస్తుంటాయి. కానీ, కొన్ని చిన్న పక్షులు ఎలాంటి మార్గనిర్దేశం లేకుండా స్వయంగానే వలస మొదలుపెడతాయి. సబ్‌-సహారన్‌ లాంటి పక్షులు మొదటిసారి వలస వెళ్ళేటప్పుడే వాటంతట అవే వెళ్ళి, స్వప్రదేశాలకు క్షేమంగా తిరిగి వస్తాయి.
చాలా చిన్నదిగా కనిపించే సాంగ్‌బర్డ్‌.. అలస్కా నుంచి ఆఫ్రికా వరకు (15 వేల కి.మీ) వలస వెళ్లి, అదే ఏడాది తమ స్వస్థలానికి తిరిగి వస్తాయి. కచ్చితంగా అదే ప్రాంతానికి పక్షులు వెళ్లటంగానీ, తిరిగి రావటంగానీ ఎలా చేయగలుగుతున్నాయి..? అనే ప్రశ్న తలెత్తినప్పుడు జీవ గడియారం సహాయంతో అని అధ్యయనాల్లో తేలింది.

  • జీవ గడియారం అంటే..!

పక్షుల శరీరంలో జీవగడియారం ఉంటుంది. ఇది సూర్యోదయం.. సూర్యాస్తమయ సమయాలను ముందుగానే గుర్తిస్తుంది. శరీరంలోని కణాలతో ప్రోటీన్‌ అణువులు సంఘర్షణ చెంది, శక్తిని విడుదల చేయడంలో ఉపకరిస్తుంది. రోజు మొత్తంలో అంటే ఇరవై నాలుగు గంటల్లో శారీరకంగా, మానసికంగా జరిగే మార్పులపై జీవ గడియారం ప్రభావం ఉంటుంది. ఇది సహజ సమయ పరికరమని చెప్పవచ్చు.

3


జీవ గడియారం గురుత్వాకర్షణ శక్తి ప్రభావాలను గుర్తిస్తుంది. గ్రావిటేషన్‌ మార్పులకు అనుగుణంగా యాంత్రిక గడియారాలను ప్రేరేపిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి పెరిగినప్పుడు అవి నెమ్మదించేలా.. బలహీనమైనప్పుడు వేగవంతం చేసేలా క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు.. మేల్కొనడం దగ్గర నుంచి ప్రతి ప్రక్రియనూ నియంత్రణలో ఉంచుతుంది. అలాగే సంతానోత్పత్తి, వలసలను కాలానుగుణంగా నిర్ణయించి, పక్షులు వలస వెళ్లడానికి సంకేతాన్నిస్తుంది ఈ జీవ గడియారం.
ఆహా ఇలాంటిదేదో మనకీ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదూ.. ప్రతి జీవిలోనూ.. అంటే మనలో కూడా జీవ గడియారం ఉంటుందటండోరు. అయితే మనమే దానిని గుర్తించక, జీవన సరళిని మన అవసరాలకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాం. ప్చ్‌.. ఆధునికం..!

  • శారీరకంగా సన్నద్ధం..

వలసకు వెళ్లడానికి ముందే పక్షులు శారీరకంగా సిద్ధమవుతాయి. ప్రయాణానికి ముందు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. దీంతో కాలేయం, ప్రత్యుత్పత్తి అవయవాల పరిమాణం తగ్గుతుంది. ఆక్సిజన్‌, కొవ్వులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా శరీరంలో మార్పులు జరుగుతాయి. కొన్ని పక్షుల్లో వలసకు ముందు కొత్త ఈకలు వస్తాయి. ఇలా దాదాపు నెలరోజుల్లో వలసకు శరీరం కూడా సిద్ధపడుతుంది. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అత్యంత సహజంగా పక్షుల్లో జరిగే పరిణామక్రమం.

  • వీటిల్లో రకాలెన్నో..

అవును.. రెండు రకాలుగా చెబుతున్నారు. ఏటా ఒకే సమయంలో వలసకు వెళ్లేవి కొన్ని.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వెళ్ళేవి మరికొన్ని. ఆసియాలోని బోర్నియోలో బ్రౌన్‌ష్రైక్‌ కాలమాన వలస పక్షికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పక్షుల రాక సమయాన్ని ఆధారం చేసుకుని రైతులు పంటలు వేస్తారంటే నమ్మశక్యమేనా..?! కానీ ఇది నిజం. ష్రైక్‌ రాకనుబట్టే అక్కడి రైతులు పంట సమయాన్ని నిర్ణయించుకుంటారు. అంటే ఆ పక్షి రాక అంత కచ్చితంగా ఉంటుందన్న మాట.

2
  • ఒకే జాతి.. దారులు వేరు..

ఒకే జాతి పక్షులు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తాయి కొన్నిసార్లు. కెనడాలోని నార్తెర్న్‌ వీటర్స్‌.. ఇలా వేరే మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఇవి ఎక్కువగా సముద్రంపై నుంచే ప్రయాణిస్తాయి.

  • ప్రయాణంలో ప్రమాదాలా.. !

ఎక్కువ దూరం వలస వెళ్లడం ప్రమాదకరమే. కొత్త వాతావరణానికి అలవాటు పడటం, వ్యాధుల బారిన పడటం, వేటకు గురికావడం.. ఇలా చాలా ముప్పులు పక్షులను వెంటాడుతుంటాయి. చిన్న వయసు పక్షులకు మరింత ప్రమాదకరం. వలస మరణాల్లో 80 శాతం చిన్న పక్షులే ఉంటాయని తేలింది.
అంతేకాదు పక్షులు వలస ప్రయాణంలో వాసన చూసే శక్తిని కోల్పోతే.. వలస మార్గాన్ని కనిపెట్టలేవు. హోమింగ్‌ పీజియన్స్‌, మరికొన్ని పక్షులలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుందని అధ్యయనాల్లో రుజువైంది.

5
  • మన దేశంలో..

ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు, కోరింగ, పులికాట్‌ సరస్సులు.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, ఒడిశాలోని చిలికా సరస్సులు వీటికి కేంద్రాలు. అలాగే కేరళలోని కుమరకోమ్‌, గుజరాత్‌లోని లిటిల్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈగల్నెస్ట్‌ కూడా. ఇంకా గుజరాత్‌లోని నల్సరోవర్‌, కర్ణాటకలోని రంగనాతిత్తు పక్షి అభయారణ్యాలు మన దేశంలో సందర్శన ప్రదేశాలు.

  • బంధించిన పక్షుల్లో వింత ప్రవర్తన..

స్వేచ్ఛగా విహరించే పక్షులను పంజరాల్లో బంధించి మనం ఆనందం పొందుతూంటాం. కానీ శీతాకాలం వలస సమయం ఆసన్నమయ్యేసరికి పంజరంలో బంధించిన (పెంపుడు) పక్షులు వింతగా ప్రవర్తిస్తాయని శాస్త్రవేత్తలు గమనించారు. బరువు పెరగడం, విశ్రాంతి లేనట్లు చికాకుగా కనిపిస్తాయి. అలాగే రాత్రిపూట అధికంగా చురుగ్గా వ్యవహరిస్తాయి. బోనును పదేపదే గోర్లతో గీకడం.. లాంటి సంకేతాలు ఈ పక్షుల్లో కనిపించాయని వారంటున్నారు.

టి. టాన్యా
7095858888