Feb 23,2023 06:48
  • బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు
  •  బతుకుపోరులో పిల్లలు కూడా
  1.  కర్నూలు జిల్లా కోసిగి కోసిగి జడ్‌పి బాలుర ఉన్నత పాఠశాలలో 1321 మంది చదువుకుంటున్నారు. వీరిలో ప్రస్తుతం 280 మంది మాత్రమే తరగతులకు హాజరవుతున్నారు.
  2.  ఇక్కడే బాలికల మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో 463 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 183 మంది ప్రస్తుతం బడికి రావడం లేదు.
  3.  ఇప్పుడు బడికి వస్తున్నవారు కూడా ఎప్పుడు మానివేస్తారో తెలియని స్థితి రెండు చోట్లా నెలకోంది. దీంతో వీరిని బడికి వచ్చేలా చూడటానికి ఉపాధ్యాయులు నానాతిప్పలు పడుతున్నారు.
  4.  ఈ పరిస్థితి ఇక్కడే కాదు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో నెలకొంది. బాగా చదువుతున్న పిల్లలు కూడా అకస్మాత్తుగా బడి మానేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : బతకడానికి వలస వెళ్లడమే తప్ప మరో మార్గం లేని కర్నూలు జిల్లాలోని సామాన్యుల బతుకుచిత్రమిది! భవిష్యత్తుపై గంపెడు ఆశలతో పిల్లలను బడుల్లో చేర్చినప్పటికీ ఆ కలలను నెరవేర్చుకోలేని దుస్థితి వారిది! అర్థంతరంగా బడి మాన్పించడం కష్టమైనా, ఇష్టంలేకపోయినా ఆ పనిచేస్తున్నారు. బతుకుపోరులో తమతో పాటు తమ పిల్లలనూ భాగస్వాములను చేస్తున్నారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో బడులు విద్యార్థులు లేక వెలవెల పోతున్నాయి. ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నా 'తప్పదు కదా సార్‌.. మళ్లొస్తాం.. వచ్చినప్పుడు పంపుతాంలే' అని సమాధానం వస్తోంది! వర్షాలు పడినా... వలసలు తప్పని స్థితి ఈ ఏడాది నెలకొంది. కరువు కోరల్లో చిక్కుకోవడం, పొట్టచేతపట్టుకుని బతకడానికి వెళ్లడం ఇక్కడ కొత్తేమి కాదు! కానీ కుండపోతు వర్షాలు కురిసినా, కష్టాలు.. కన్నీళ్లు తప్పకపోవడంతో చిన్నరైతులు, వ్యవసాయ కూలీలు విలవిలలాడుతున్నారు. అధిక వర్షాలు, పత్తి పంటను గులాబీ పురుగు ఆశించడం వల్ల వ్యవసాయ పనులు లేకుండా పోయాయి. దీంతో, జిల్లాలోని ఆదోని డివిజన్‌ పరిధిలో వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, పేద రైతులు పెద్ద సంఖ్యలో వలసలు వెళ్లారు.

  • బడి మానింది ఎందరు?

వలసల కారణంగా జిల్లాలో బడిమానిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు అధికార యంత్రాంగం వద్ద స్పష్టమైన సమాధానం లేదు. కొందరు పిల్లలు బడికి రావడం తగ్గిందని చెబుతున్నారు కానీ, దానికి కారణం మాత్రం చెప్పడం లేదు. ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కోసిగి, ఎమ్మిగనూరు, నందవరం, హోళగుంద, పెద్దకడబూరు మండలాల్లో పెద్ద సంఖ్యలో వలసలు వెళ్లారు. ఈ మండలాల నుండి సుమారుగా 15 వేల మంది ప్రజానీకం వలస వెళ్లినట్లు చెబుతున్నారు. బడి మానేసిన పిల్లల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ ఉంది. కొంచెం ఎదిగిన పిల్లలకు కూడా వలసకు వెళ్లిన చోట ఏదో ఒక పని దొరుకుతుండటంతో, ఎంతో కొంత చేతికివస్తుందని ఎక్కువ మంది తల్లితండ్రులు పిల్లలను తమ వెంట తీసుకువెడుతున్నట్లు సమాచారం.

  • సీజనల్‌ హాస్టళ్లపై కొరవడిన ప్రచారం

సీజనల్‌ హాస్టళ్లపై ప్రచారం కొరవడింది. వలస వెళ్లే కుటుంబంలోని విద్యార్థుల కోసం కర్నూలు జిల్లాలో 71 సీజనల్‌ హాస్టళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 66 ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రావన్న అనుమానంతో నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఐదు హాస్టళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. సీజనల్‌ హాస్టళ్ల ఏర్పాటు విషయం పక్క కాలనీలోని వారికి తెలియడం లేదు.

  • తక్షణమే ఉపాధి పనులు చేపట్టాలి : డి.గౌస్‌ దేశాయ్, సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి

వలసల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలి. కేంద్రం ఉపాధి నిధులు తగ్గించి ద్రోహం చేసింది. తక్షణమే ఉపాధి పనులు చేపట్టాలి. విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలి.

TABLE