- సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి
ప్రజాశక్తి-కాకినాడ : మధ్యాహ్న భోజన మెనూ చార్జిని రూ.20 పెంచాలని కోరుతూ 31న కలక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి అన్నపూర్ణకు వినతి పత్రం అందజేశార. అంతకు ముందు లక్ష్మీ దాస్ భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెరిగాయని, ప్రభుత్వం నిర్ణయించిన 3వేలు వేతనం అందరికీ అందడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులపై అధికారపార్టీ నాయకుల వేధింపులు అధికమయ్యాయన్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 5.88 పైసలు, హై స్కూల్ విద్యార్థులకు 8.57 పైసలతో నాణ్యమైన పౌష్టికాహారం వండి పెట్టడం ఎలా సాధ్యమో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి 20 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వంటపని కట్టెలపొయ్యి పై చేయకూడదని నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేయకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వం పదేళ్ల క్రితం సరఫరా చేసిన వంట పాత్రలు నేడు ఎందుకు పనికి రాకుండా పోయాయని, తక్షణమే వంత పాత్రలు గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద 31 వ తారీఖున జరిగే మధ్యాహ్న భోజన పథక కార్మికులు ధర్నాకు హాజరై డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రమళ్ల పద్మ, కే.సుబ్బలక్ష్మి, ఏ.అనంతలక్ష్మి, పి.వరలక్ష్మి, వెళ్ల లక్ష్మీ, పి.వెంకటలక్ష్మీ, పి.లోవలక్ష్మీ, కె.లక్ష్మీ తదితర జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










