
'నాకు ప్రతి రోజూ కొత్త జీవితమే. ఈ రోజును ఉత్సాహంగా, ఉన్నతంగా మలచుకుంటా. ఆరోగ్యంగా ఉంటా, నా కలలను నెరవేర్చుకుంటా. ఈ విధంగా ప్రతిరోజూ ఉదయాన్నే ఒక సంకల్పం తీసుకోవాలి. మనలోని ఆందోళనకు మూలమేదో కనుక్కోవాలి. పరిష్కారం ఆలోచించి అమల్లో పెట్టాలి. సమస్య ఏమిటో తెలిస్తే సగం రోగం నయమైనట్టే' అంటారు ప్రముఖ రచయిత డేల్ కార్నెగీ. నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక శారీరక రుగ్మతలకు మానసిక స్థితే కారణం. శరీరం, మనసు-ఒకదాని ప్రేరేపణకు అనుగుణంగా మరొకటి ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే...మన ఆలోచనలు, ఆచరణలు అన్నీ మెదడుతోనే ముడిపడి వుంటాయి. మన కర్తవ్యాలను, లక్ష్యాలను నెరవేర్చుకుంటూ...ఆనందంగా జీవించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. 'నేను బాగున్నాను' అనే భావన మనిషిని శక్తివంతం చేస్తుంది. 'చింతలు, చికాకులు లేకుండా చిన్నారులు ఎంత చలాకీగా, ఉత్సాహంగా, ఉంటారో అంతే చలాకీగా, ఉత్సాహంగా ఉండగలగడమే నిజమైన ఆరోగ్యం' అంటారు 'ది సీక్రెట్' పుస్తక రచయిత్రి రోండాబర్న్.
ఆరోగ్యం అంటే శరీరానికే అనుకోవడం సర్వసాధారణం. కానీ మానసిక ఆరోగ్యం కూడా కావాలి. మనకు వచ్చే చాలా శారీరక రుగ్మతలకు మన మానసిక స్థితే కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేటి స్పీడ్ యుగంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, క్రమబద్ధతలేని జీవనశైలి, యాంత్రిక జీవనం-శారీరక, మానసిక అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. కోవిడ్‌కి ముందు ప్రపంచవ్యాప్తంగా 8 మందిలో ఒకరు మానసిక రుగ్మతతో జీవిస్తున్నారని అంచనా. కోవిడ్ అనంతర పరిస్థితి దీర్ఘకాలిక ఒత్తిళ్లకు ఆజ్యం పోసింది. కోట్లాది మంది ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిగతులను బలహీనపర్చింది. దీంతో మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి రుగ్మతలు 25 శాతం పెరిగినట్లు అంచనా. అదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలకు, చికిత్సకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మానసిక అనారోగ్యం గురించి చర్చించేందుకు, చికిత్స తీసుకునేందుకు కూడా చాలా మంది సుముఖత చూపట్లేదు. దీనికి సిగ్గు, భయంతో పాటు అవమానంగా భావించడం మరో కారణం. కానీ, ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే.. భారతీయుల్లో నిరాశ, నిస్పృహలతో 56 మిలియన్ల మంది, ఆందోళన, ఒత్తిళ్ల వంటి రుగ్మతలతో 38 మిలియన్ల మంది బాధ పడుతుండగా, ఇవే రుగ్మతలతో ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. అయితే, ఈ సంఖ్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా వుంది. ఈ సంఖ్యతో పోల్చి చూసినప్పుడు దేశంలో మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కొరత తీవ్రంగా ఉంది. పది లక్షల జనాభాకు ముగ్గురు మనోరోగ వైద్యులు, 12 మంది నర్సులు, ఏడుగురు మనస్తత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. ఇది అవసరానికంటే చాలా తక్కువ.
ప్రతి మనిషికీ పుట్టుకతోనే సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది. అందరిలాగే సమాన గౌరవం, గుర్తింపు పొందే హక్కు మానసిక వైకల్యం ఉన్నవారికీ ఉంది. తమ జీవితాన్ని తాము స్వతంత్రంగా గడిపే హక్కు వారికి వుంది. అయితే, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఈ హక్కులేవీ అందడం లేదన్నది జగమెరిగిన సత్యం. 'ఆరోగ్య రంగంలో అసమానతలకు తావివ్వకూడదు. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యసేవలు సమానంగా అందించేలా చర్యలు చేపట్టాలి' అని డబ్ల్యుహెచ్‌ఒ చెబుతోంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మానసిక వైకల్యం కారణంగా ఎవరినీ వివక్షకు గురిచేయరాదని ఐరాస స్పష్టంగా చెబుతోంది. అయినా షరా మామూలే! ఎవరో వస్తారు, ఏదో చేస్తారని...ఎదురు చూడకుండా, ఎవరికివారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. 'భయం స్థానంలో ధైర్యాన్ని, నిరాశ స్థానంలో ఆశావహ దృక్పథాన్ని నింపుకోవాలి. 'నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా'ననే భావన మంచి ఆరోగ్యాన్నిస్తుంది' అంటారు రచయిత జోసెఫ్ మర్ఫీ. ఒత్తిడి, కుంగుబాటు, భయం మరేదైనా మానసిక సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. మానసిక ఆరోగ్యం లేని ఆరోగ్యం...సంపూర్ణ ఆరోగ్యం కాదు. ఈ ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 10న 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఆ లక్ష్యాన్ని విజయవంతం చేయాలి. కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి.