పిల్లలు.. పువ్వులు.. లేలేత మొక్కలు.. అన్నీ ఒకేలా స్పందిస్తాయి.. అంతకన్నా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటాయి.. మరి అలాంటి పిల్లలే తమ చిట్టి చిట్టి చేతులతో వాళ్ల బడిలో ఉన్న కాసింత స్థలాన్ని నందనవనం చేస్తే.. బుల్లి చేతులతో మట్టిలో విత్తనాలు నాటి.. వాటికి రోజూ నీళ్లు పెడుతూ అవి పెరిగి పెద్దయ్యి, ఫలాలు ఇస్తుంటే వారి మోముల్లో ఆశ్చర్యం.. ఆనందం.. ఎంతలా ఉందో.. వాళ్ల మనోజ టీచర్ సంబరం ఎలా అంబరాన్ని తాకిందో తెలుసుకుందాం.. వారి మాటల్లోనే.
వ్యవసాయం చదువుతా!
మా టీచర్ గారు ఉదయం ఎనిమిదిన్నరకే వచ్చేస్తారు. దాంతో మేం కూడా అరగంట ముందుగానే బడికి వచ్చేసి, తోట పని చూసుకుంటాం. మేం పండించిన ఆకు కూరలూ, వంకాయలు, బీరకాయలు మా మధ్యాహ్నం భోజనంలోకి వాడుకుంటాం. తోట పనులు మాకెంతో ఇష్టం. నేను పెద్దయ్యాక వ్యవసాయం గురించిన పెద్ద చదువు చదువుతాను.
కొండేటి మహింధర్
మేమే విత్తనాలు నాటాం!
స్కూల్ కిచెన్ గార్డెన్‌లో మా టీచర్ పర్యవేక్షణలో తరగతి వారీగా తోట పని చేస్తాం. మా ఇళ్ళల్లో ఉన్న విత్తనాలు కొన్ని తెస్తాం.. కొన్ని మేడమ్ కొంటారు.. గోంగూర, బచ్చలి, వంకాయ, బీర విత్తనాలు వేసాం. మందు వేయని కూరగాయలు మా భోజనంలోకి వాడుకుంటాం. ఊరి వారు కూడా వచ్చి, బీరకాయలు అడుగుతున్నారు. మాకిది ఎంతో సంతోషంగా ఉంది.
మరీదు జశ్వంత్
పనిముట్లతో చేయడం పండుగే!
తోటపని కోసం మా టీచర్ చిన్న, చిన్న పనిముట్లు కొని తెచ్చారు. తోటపని మాతో కలిసి చేస్తారు. పనిముట్లతో మాకేం ప్రమాదం రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఒక్కోమొక్క కాయలు కాస్తుంటే మాకందరికీ పండగలా ఉంటుంది. నిన్ననే మళ్ళీ బెండ, కాకర విత్తనాలు విత్తాం. ఇది మంచినేల.మా టీచర్ పనసగింజలు కూడా నాటారు. అవి మొలకెత్తి, ఇపుడు చక్కగా ఎదుగుతున్నాయి. మా బడి తోటలో చాలా అరటి చెట్లున్నాయి. ప్రస్తుతం అయిదు గెలలున్నాయి. టీచర్ మాకు అరటిపువ్వు కూర, గోంగూర పచ్చడి చేసి తెస్తుంటారు.
తన్మయిశ్రీ.
బియ్యం ఎలా వస్తాయో తెలిసింది!
మేం ఓ రైతునడిగి సరదాగా కొన్ని వరినాట్లు కూడా వేసాం. అవి గింజలు కూడా కాసాయి. ఇపుడు మాకు భోజనంలోకి బియ్యం ఎలా వస్తాయో తెలిసిపోయింది. మా తోటలో బంతి, వాము, సబ్జాగింజల మొక్కలు, కొన్ని గడ్డిపూల మొక్కలు కూడా ఉన్నాయి. సెలవు రోజుల్లో వంతులు వారీగా మేం వచ్చి, తోటకు నీళ్ళు పోసి వెళ్తాం.
అంకిత్ కుమార్
మొక్కలకు టానిక్ ఇస్తాం!
మా వంటశాలలో వాడిన బియ్యం కడిగిన నీళ్ళు, కోడి గుడ్డు పెంకులూ, కూరగాయల వేస్ట్‌తో మేం మొక్కల టానిక్ కూడా తయారుచేసుకుంటాం. దాంతో అవి ఎంత బలంగా ఎదుగుతున్నాయో.
దేవిప్రియ
విత్తనాలు తయారుచేసుకుంటున్నాం!
మేము వేసిన వాటి నుండే విత్తనాలను తయారుచేసుకుంటున్నాం. గోంగూర కాయలు కోసి ఎండబెట్టి, విత్తనాలు తీశాం. వంకాయలు కూడా ఒకటి రెండు విత్తనాలకు ఉంచాం. ఇలా అన్నింటి నుంచీ విత్తనాలను మేము తయారుచేసుకుంటున్నాం. ఈసారి ఇంక గోంగూర విత్తనాలు కొనే పనేలేదు.
రాజశేఖర్