
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలపై హిందూత్వమూకలు వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ముస్లింలపై పగతో రగిలిపోతున్న హిందూత్వమూకలు ఏ దారుణానికి ఒడిగడుతున్నాయి. అన్యాయంగా వారిని జైలుకి పంపించేందుకు కుట్ర పన్నుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో గోహత్య పేరుతో హిందూ మహాసభ సభ్యులు నలుగురు ముస్లింలను జైలుకి పంపించాలని కుట్రపన్నారు. అయితే హిందూత్వమూకలు చేసిన కుట్ర బెడిసికొట్టింది. చివరికి అసలు నిజాలు బయటపడి హిందూమహాసభ సభ్యులనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని గోహత్య నిరోధక చట్టం ప్రకారం... గోహత్యకు పాల్పడిన నిందితులకు గరిష్టంగా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని అక్కడి హిందూత్వమూకలు పేట్రేగిపోతున్నాయి. మార్చి 29న శ్రీరామనవమి రోజు గౌతమ్ నగర్ సమీపంలోని గుహల్లో గొడ్డు మాంసం దొరికిందని ఆరోపిస్తూ... అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు ఆగ్రాలోని ఇతిమాద్ ఉద్ దౌలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ మహాసభ సభ్యుల్లో ఒకరైన జితేంద్ర కుష్వాహా స్థానికులైన మహ్మద్ రిజ్వాన్, మహ్మాద్ నకీమ్, మహ్మాద్ షాను, ఇమ్రాన్ ఖురేషిలను గోహత్య నిందితులుగా ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్‌స్టేషన్‌ని ముట్టడించారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు ముస్లింలను అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో గోహత్యకు ముస్లింలకు సంబంధం లేదని తేలింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి సంజరు జాట్ అని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. షాను, ఇమ్రాన్, రిజ్వాన్‌లు ముగ్గురు అన్నదమ్ములు కాగా, నకీమ్ మున్సిపల్ కార్నొరేషన్‌లో ఉద్యోగి. అయితే షాను, ఇమ్రాన్‌లు నకీమ్‌పై పగతో తనకి సహకరించినట్లు జితేంద్ర కుష్వా పోలీసులకు తెలిపాడు. అయితే జితేంద్ర పోలీసులకు అబద్ధం చెప్పినట్లు విచారణలో తేలింది. గోహత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో సంజరుతోపాటు మరికొందరు ఉన్నారని, అతని కాల్ రికార్డులు సూచిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితులుగా పేర్కొన్న ఆ నలుగురు ముస్లింలు నెలరోజులుగా గోహత్య జరిగిన ప్రదేశంవైపే వెళ్లలేదని, కాల్ రికార్డులు కూడా చూపిస్తున్నాయని పోలీసు అధికారి ఒకరు టెలిగ్రాఫ్‌కి తెలిపారు.