Jul 17,2022 17:09

రాత్రి కురిసిన గాలివానతో
కూలిపోయిన పూరిళ్లు
గూడు చెదిరిన గువ్వల్లా తలోదిక్కుకు
విసిరివేయబడ్డ బతుకులతో
ఒక్కసారిగా కుదేలైన పేదోడి జీవితం
సూరీడు కన్నా ముందే తెల్లారిపోయింది
దాచి పెట్టుకున్న నాలుగు రూకలు
ఏ మట్టిలో కూరుకున్నాయో?

రాత్రి కురిసిన గాలివానతో
గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న చంటాడికి
కడుపు నింపలేక స్తన్యం బిక్కచిక్కింది
పిడుగు పడి కల్లుపాక కూలిపోవడంతో
తాగుబోతుల ఇల్లాళ్లు
నాలుగు రోజుల దాకా తమ బిడ్డల
ఆకలికి ఢోకా లేదని ఊపిరి పీల్చుకున్నారు

రాత్రి కురిసిన గాలివానతో
ఆకాశాన్ని తాకే ఏడంతస్తుల మేడ
పేకముక్కల్లా కూలిందన్న
మరో పిడుగులాంటి వార్త చెవిన పడటంతో
దిగ్గున స్పహలోకి వచ్చిన గొప్పోడికి
ఎదురుగా రిక్షావాడి చేతిలో నీళ్లు

రాత్రి కురిసిన గాలివానలో
నిండు చూలాలైన తన ఆలికి
వైద్యం కోసం తన మేడ ముందు నిలబడి
అర్ధించిన చేతులు అవే అని
జ్ఞప్తికి రావడంతో జ్ఞానోదయం కలిగి
పేదోణ్ణి, గొప్పోణ్ణి కలిపిన
తుపాన్‌ దెబ్బకు మేలుకున్నాడు!

- ములుగు లక్ష్మీ మైథిలి
94400 88482