Oct 09,2022 11:33

పచ్చివైతేనేం పరమౌషధ గుణాల ఖని, పాకశాస్త్రంలో పెద్దగా ప్రవేశంలేని పోషకాల గని ఈ కీరాదోస. దీని శాస్త్రీయ నామం కుంకుముస్‌ సాటివుస్‌. పొడవుగా స్థూపాకారంగా ఉండే ఈ జాతి దక్షిణాసియా ప్రాంతానికి చెందింది. ఒకప్పుడు తోటలలో ఈ పంట పండించేవారు. కొద్దిపాటి స్థలంలో, చిన్న చిన్న కుండీల్లో సైతం పెంచుకునే సౌలభ్యం ఉన్న పాదు మొక్క ఇది. వీటిలో హైబ్రీడ్‌ రకాలు అందుబాటులోకి వచ్చిన తరువాత మేడపైనా పెంచుకుంటున్నారు.

keera

 

కీరదోసలో విటమిన్స్‌, వాటర్‌ కంటెంట్‌, మినరల్స్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ఫాస్పరస్‌, ఐరన్‌, క్యాల్షియం, ఫైబర్‌ అధికంగా ఉన్నాయి. దాహార్తిని తీర్చడానికి, ఊబకాయాన్ని తగ్గించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి, కంటి చూపుని మెరుగుపరచడానికి, రక్త ప్రసరణ బాగా జరగడానికి కీరదోస ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కీరదోసను జ్యూస్‌, సలాడ్స్‌గా తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పచ్చడి చేసుకుంటారు. అంతేకాక సౌందర్య సాధనంగా కీరాదోసకు ప్రత్యేక స్థానమే ఉంది. సబ్బులు, ఫేస్‌ క్రీములు, ఫేస్‌ మాస్క్‌లు, సౌందర్య లేపనాల తయారీలో విరివిగా వినియోగిస్తున్నారు. విత్తనం నాటిన 75 రోజుల్లో పంట పూర్తయ్యే స్వల్పకాలిక పాదు మొక్క కీరదోస. విత్తనాలను నాటి, రోజుకోసారి పైన నీళ్లు చిలకరిస్తే వారం రోజుల్లో మొలకెత్తుతాయి. తీగలు పాకటానికి ఆధారంగా పందిరి కానీ, కర్రల ఊతం కానీ ఉంటే.. రెండు నెలలకు పూత ప్రారంభమవుతుంది. కాయ పడిన 15 రోజుల వరకు కాపు కాసి, మొక్క చనిపోతుంది. ఒక్కో పాదు 25 నుంచి 50 కాయల వరకు కాస్తుంది. ఎక్కువ నీళ్లు తగిలినా, వర్షం తాకిడికి గురైనా పాదు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. సరిపోను నీరుండి, ఎండ తగిలితేనే మొక్క బాగుంటుంది. పురుగు పట్టే సూచనలు కనిపించిన వెంటనే మోనోక్రోటోపాస్‌ తగిన నీటిలో కలిపి, మొక్క మీద స్ప్రే చేయాలి. పూల తోటలు, పచ్చిమిర్చి, కూరగాయల తోటల్లో అంతర పంటగా వేస్తుంటారు. ఆ మొక్కల పంట పూర్తయిన తర్వాత, వాటిపై అల్లుకుని కాయలు కాస్తాయి. వీటికి రుచి కంటే పోషకాలు ఎక్కువ. సీజన్‌తో ప్రమేయం లేకుండా సంవత్సరం పొడవునా కాపు కాస్తుంది. జనవరిలో విత్త్తనాలు నాటితే, వేసవికాలం ఆరంభానికి అందుబాటులోకి వస్తాయి. దీనిలోనూ రకాలున్నాయి. దేశవాళీ..

 

desawali


 

                                                           దేశవాళీ

కీరదోస కాయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి కాయలు ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటాయి.

జర్కిన్‌

                                                          జర్కిన్‌..

కాయలు పొట్టిగాను, వాటి మీద మచ్చలుండి కాస్త నూగుతో ఉంటాయి. వీటి ధర కాస్త ప్రియం. కాయలన్నీ ఒకే ఆకారం, ఒకే పరిమాణంలో ఉండటం వీటి ప్రత్యేకత.

 టేబుల్‌ వైన్‌..



                                                         టేబుల్‌ వైన్‌..

కుండీల్లో పెంచుకునే కీరదోస ఈ టేబుల్‌వైన్‌ కుకుంబర్‌. వీటిపై చారలు ఉంటాయి. సరైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే 20 నుంచి 30 కాయల వరకూ కాస్తాయి.

                                                       ఆర్మేనియన్‌..

ఆర్మేనియన్‌ దోసకాయలు సన్నగా చాలా పొడవుగా ఉంటాయి. వీటిని పాము దోసకాయలు అనీ పిలుస్తారు. శీతల ప్రాంతాలైన అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఆర్మేనియన్‌ కీర సాగు చేస్తుంటారు.

  లెమన్‌..

 

                                                           లెమన్‌..

కీరదోసలో కాస్త వైవిధ్యమున్న రకం ఇది. కాయలు పొడవుగా కాకుండా గుండ్రంగా ఉండి, పసుపు రంగులో ఉంటాయి. రుచి కూడా కాస్త పుల్లగా ఉంటుంది. అందుకే వీటిని లెమన్‌ కుకుంబర్‌ అంటారు.

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506