
వందలాది మామిడి పండ్ల మధ్యనున్న చిలుకను గుర్తించగలరా? ఈ తైలవర్ణ చిత్రంలో ఎన్ని ముఖాలు కనిపిస్తున్నాయో చెప్పగలరా? ఈ కొండరాళ్ల మధ్యన చిరుత వుంది. అది ఎక్కడుందో చెప్పగలరా? అంటూ... రకరకాల బొమ్మలు, ఫొటోలు నిత్యం చూస్తూనే వుంటాం. కొందరైతే...ఆదివారం వచ్చిందంటే చాలు... పేపర్‌తో పాటు వచ్చే పుస్తకం తీసుకొని చివరి పేజీలోని పదాలతో కుస్తీ పడుతుంటారు. పజిల్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి. పిల్లలు విజ్ఞానం కోసం, పెద్దలు కాలక్షేపం కోసం, వృద్ధులు తమ జ్ఞాపకశక్తికి పదును పెట్టేందుకు ఈ పజిల్స్ ఆడుతుంటారు. ఏకాగ్రతగా వాటిని గమనిస్తూ... వాటిలోని చిక్కుముడి విప్పడానికి ప్రయత్నిస్తారు. చురుకైన చూపు, పదునైన మెదడు వున్నవారిని సైతం ఇలాంటి చిత్రాలు, పజిల్స్ అయోమయానికి గురిచేస్తుంటాయి కూడా. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తూనే వుంటారు. ఆ చిక్కుముడి వీడగానే వారి పెదవులపై ఒక చిరునవ్వు... వారి మోముపై పున్నమినాటి చంద్రుడు వెలుగొందుతాడు. ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం వారి కళ్లలో తొణికిస లాడుతుంది. 'అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు/ తినగ తినగ వేము తీయగనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన' అంటాడు వేమన. నిజానికి ఇలాంటి అనుభూతి చాలామందికి సుపరిచితమే. వయసుతో సంబంధం లేకుండా వీటిని ఇష్టపడుతుంటారు.
అసలు ఈ పజిల్స్ మన జీవితంలోకి ఇప్పుడే కొత్తగా వచ్చినవని కావు. భాష, సాహిత్యంతో పాటు పజిల్స్ కూడా పలు దశల్లో అభివృద్ధి చెందుతూ వచ్చినవే. సమస్యాపూరణం, అవధానంతో పండితులు తమ భాషా కౌశలాన్ని ప్రదర్శిస్తే...సాధారణ ప్రజల్లో పొడుపు కథలు ఆదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి పజిల్స్‌గా చరిత్రకెక్కినవి పొడుపు కథలేనంటారు పెద్దలు. నేడు పద క్రీడగా పేరొందిన పదవినోదం, పదకేళి, పదబంధం, నుడిక్రీడ, గడి-నుడి, పదపూరణం వంటివి పద సంపదను, తద్వారా భాషను మెరుగుపర్చుకోడానికి, సైన్స్ పజిల్స్, సుడొకు, క్రాస్‌వర్డ్ పజిల్, రూబిక్స్ క్యూబ్, జిగ్‌సా, స్లైడింగ్ పజిల్ వంటివి మెదడుకు మేతగా ఉపయోగపడతాయి. పిల్లలకు బొమ్మల రూపంలో కూడా అనేక పజిల్స్ అందుబాటులో వున్నాయి. ఈ పజిల్స్‌లోని చిక్కు ముడిని విప్పగలిగే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసిక దృఢత్వానికి, వికాసానికి తోడ్పడతాయి. అంతేకాదు, వీరిలో ఏదైనా సమస్యకు సంబంధించిన మెలకువల సాధనకు అవసరమయ్యే లాజికల్ థింకింగ్ అలవడుతుంది. ఈ క్రమంలో ఏదైనా అంశాన్ని చూసే దృష్టి కూడా మారుతుంది. ఒక అంశాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించగల నేర్పు అలవడుతుంది. ఐక్యూ లెవెల్స్, రీజనింగ్ స్కిల్స్ మెరుగవుతాయి. ముఖ్యంగా నిత్యం పజిల్స్ ఆడేవారిలో అల్జీమర్స్ వ్యాధి దరిచేరదంటారు. మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఈ తరహా గేమ్స్ ఎంతో ఉత్తమం.
'ఖాళీగా వుండే మెదడు దెయ్యాల కార్ఖానా' అంటారు. చిన్నలైనా పెద్దలైనా ఎప్పుడూ చురుకుగా వుండాలంటే... ఎప్పుడూ వారి మెదడుకు పని చెప్పాలి. పజిల్స్ ఛేదించే అలవాటున్నవారికి మతిమరుపు త్వరగా రాదనీ, మెదడు చురుగ్గా మారుతుందని, మానసిక సమస్యలు తగ్గుతాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మెదడుకు పనిచెప్పడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నైపుణ్యం పెరుగుతుంది. బీపీ కూడా తగ్గుతుందంటున్నారు వైద్యులు. గజిబిజి జీవన విధానంలో ఒత్తిడికి గురవడం సర్వసాధారణం. దానినుంచి బయటపడేందుకు పజిల్స్ బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడి తగ్గడంతో, మెదడు ఉత్తేజం పొందుతుంది. ప్రతిరోజూ 20 నుంచి 25 నిమిషాల పాటు పజిల్స్ ఆడితే ఒత్తిడి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ల నుంచి కాస్తయినా బయటపడి, ఇలాంటి పజిల్స్ ఆడేందుకు సమయం కేటాయించడం వల్ల నూతనోత్సాహం పొందుతారు. ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఏదైనా ఒక అంశంపై సృజనాత్మకంగా ఆలోచించగల శక్తి లభిస్తుంది. ఈ కారణంతోనే ప్రతి ఏడాది జనవరి 29న 'అంతర్జాతీయ పజిల్స్ దినోత్సవం' జరుపుతున్నారు. ఈ సందర్భంగానైనా మెదడుకు సరైన వ్యాయామాన్ని అందిద్దాం.