మేడే
మేడే.. మేడే.. మేడే..
నవనాడుల సంకెళ్ళను సడలించి
విజయభేరి మోగించిందీ నేడే..
ఆ చైతన్యపు పునాదులన్నీ ..
ఊపిరి సలపని శ్రమతో..
దిన రాత్రులతో పోటీపడిన
కార్మికలోకం చెమట చుక్కల సంద్రాలై..
ప్రవహించిందీ నేడే..
మేడే.. మేడే.. మేడే..
దిక్కులన్నీ ఏకమై
సంధ్యకాలపు సూర్యుని
ఆవహించిన రుధిర ధారల
రవికిరణాలై ప్రవహించిందీ నేడే..
మేడే.. మేడే.. మేడే..
నిన్నటి కాలం
పోరాటం.. రక్త తర్పణం
సమిధలైన సమరయోధుల
ఊపిరులే ఉప్పెనలై ఎగసిందీ నేడే..
మేడే.. మేడే.. మేడే..
కాలచక్రాన్ని నిలిపి
గుణించి.. గణించి
దినపు గంటలను దివ్యంగా
ముప్పొద్దులు చేసిందీ..
ప్రపంచ మణిహారమై
కాంతులు చిమ్మిందీ నేడే..
మేడే.. మేడే.. మేడే..
తొలిపొద్దు విజ్ఞతతో పని
మరోపొద్దు విరామం
మలిపొద్దు వినోదమంటూ
ప్రగతిని కోరే ప్రజల పండగై
శ్రమజీవుల మోములలో
విరాజిల్లిందీ నేడే..
మేడే.. మేడే.. మేడే..
కార్మికులారా ఏకంకండని
కొడవలి, గొడ్డలి పట్టిన
చేతులను ఏకం చేసి
పిడికిలెత్తి సమైక్యతను చాటిందీ నేడే..
మేడే.. మేడే.. మేడే..
మేడే.. ఈనాడే..
హాలిడే.. జాలీడే కాదని
భావితరాలకు భవితనిచ్చే
బతుకు బాటయని..
చాటి చెబుదాం
చేయిచేయి కలిపితే
సాధ్యం కానిది లేదని
సమ సమాజమే ప్రజాహితమని..
నాంది పలుకుదాం..
నేడే.. మేడే..
టాన్య