Oct 08,2023 11:12

ఊహ తెలిసి నప్పటినుండి
పరిగెత్తి పరిగెత్తి చేరుకున్న
నగర నడి బొడ్డున
అలసో సొలసో
ఆగి ఒంటరిగా కూర్చున్నప్పుడు
నాకు తెలియకుండానే
నన్ను నేను
గట్టిగా శ్వాసించుకుంటాను !!
తెలియకుండానే ఒక్కసారిగా
'మట్టివాసన' గుభాళింపు
నన్ను ఆవహించుకుంటుంది !
ఏం కోల్పోయానో
ఏది వదులుకున్నానో
ఎంత దూరమయ్యానో
మూసుకున్న కళ్ల ఎదుటే
సాక్షాత్కరింపజేస్తుంది..!
వెనక్కి వెళ్ళి వెతికితే
మన మట్టి వాసనే అని గుర్తుపట్టి
గట్టిగా హత్తుకునే గుండె
ఒక్కటైనా మిగుల్చుకున్నావా అని
నిలువునా నిలదీస్తుంది !
కాసేపటి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
ఏదో వర్తమాన మాయ
నన్ను మళ్ళీ
ఈ లోకంలోకి తీసుకొస్తుంది !!
మరలా నా పరుగు
షరా మామూలే..!
ఇక మట్టి వాసనంటావా
ఎప్పటిలా కాసేపు
మిగిలిపోయే జ్ఞాపకమే !!


తిప్పాన హరి రెడ్డి
94938 32412