
పాల్వంచ స్టీల్‌ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికిన నాలుగేళ్లకే కన్నప్ప ఊరికి దూరంగా దేవునిగుట్టకు దగ్గర్లో చౌకలో వస్తుందని నాలుగొందల గజాల ఇంటిస్థలం కొనిపెట్టాడు.
ఐదేళ్లకాలం గడిచేటప్పటికి పాల్వంచ పట్టణంలో అపార్ట్‌మెంట్ కల్చర్ అనే రాచకురుపు పుట్టుకొచ్చింది. బిల్డర్లు పోటీపడుతూ ఊరికి నాలుగు పక్కలా పట్టాభూముల్ని గాలించి, ఎకరాలకు ఎకరాలు కొని బహుళ అంతస్తుల వెంచర్లు చెయ్యసాగారు.
కన్నప్ప స్థలం చుట్టూ పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు లేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ఏజంట్లు ఎక్కడ ఖాళీస్థలాలున్నా అక్కడ కోడిపిల్లల్ని చూసిన గద్దల్లా వాలిపోతున్నారు. మాటల మాయాజాలంతో భూ యజమానులను తమ బుట్టలో వేసుకుని కొనేస్తున్నారు. కన్నప్ప స్థలం చుట్టు పక్కల అపార్ట్‌మెంట్లు లేపుతున్న బిల్డర్ల చూపు ఆ స్థలం మీద పడింది.
ఆ స్థలానికి చుట్టుపక్కల పాల్వంచలో అందరికన్నా పెద్ద బిల్డర్ భీష్మారావు ఫరమ్ కొత్తగా నాలుగు అపార్ట్‌మెంట్లు మొదలుపెట్టింది.
భీష్మారావు ఓరోజు కన్నప్పను తన ఆఫీస్‌కి పిలిపించుకొని, కూల్‌డ్రింకులు తాపించి, కుశలప్రశ్నలు వేసిన తరువాత 'చూడు కన్నప్పా! నీ స్థలానికి నువ్వు చెప్పినంత రేటు పెడతా, లేదు నాకు భూమే కావాలనుకుంటే నీ నాలుగొందల గజాలకు బదులు సున్నండంగు పక్కన దమ్మపేట మెయిన్‌రోడ్డును ఆనుకొని మాకున్న ఐదొందల గజాల భూమిని ఇస్తా. రోడ్డు పక్కనే వుంది కాబట్టి, నీ భూమి కంటే మా భూమికి ఎక్కువ ధరే పలుకుతుంది. అయినా వంద గజాలు ఎక్కువ ఎందుకిస్తానంటు న్నానంటే, ఆ మెయిన్‌రోడ్డు దగ్గర్నుండి మేమిప్పుడు కడుతున్న మానాలుగు అపార్ట్‌మెంట్లదాకా సీదా రోడ్డు వెయ్యాల్నంటే నీ స్థలం లేందే మేం అనుకున్నట్టు రోడ్డుపడేటట్టు లేదు. అందుకే ఇంతగ బతిమిలాడుతున్నా' అంటూ తన్నెందుకు పిలిపించాడో సూటిగా తెలియజేశాడు.
అతని మాటల్ని విన్న కన్నప్ప 'వీడీ మాట అడిగేటందుకే నన్ను పిలిపిస్తుండని నేననుకున్నట్టు అదేముచ్చట ముందల బెట్టిండు. వీనికి అవసరముందని నేనెందుకు నా భూమినియ్యాల? వీడెంత గీసులాడినా అర్కీస్ ఇచ్చేదేలేదు' మనసులో గట్టిగా నిర్ణయించుకుని, అదే మాటను భీష్మారావుతో నిర్భయంగా చెప్పేశాడు.
'సరే మంచిది నీజాగ నీ ఇష్టం. అందునా నువ్వు మాకన్నా ముందే అక్కడ స్థలం కొన్నవాడివి. కాబట్టి నీకు ఎట్లా అన్పిస్తే అట్లానే చెయ్యి. ముఖపరిచయం వున్నవాళ్లం గాబట్టి ఒకమాట అడిగి చూస్తే తప్పేముందని అడిగాను అంతే' అంటూ విషయాన్ని అంతటితో ముగించాడు భీష్మారావు.
'భీష్మారావుగారే స్వయంగా పిలిపించి, రేటు ఎంతైనా పెడతా, లేదంటే అంతకంటే విలువగల భూమి మెయిన్‌రోడ్డు పక్కన్నే ఇంకో వందగజాలు ఎక్కువే ఇస్తానన్నా ఆ కోయోడు భూమిని ఇయ్యనన్నడంటే ఏమనుకోవాలి!?'
'ఇయ్యాల్రేపు ఆ కోయోళ్లు మనకంటే ఎక్కువ తెలివిమీరిండ్రుగాదు?'
'తొండా! తొండా! ఎంతదూరం ఉరుకుతవ్? అంటే ఆ ఏముంది కంపతొడుగులో పడ్డదాక అన్నదంట. అట్లనే మన భీష్మరావు సార్ని కాదని ఆ కోయోడు ఎంతదూరం బోతాళ్లేరా?' ఊళ్లో భీష్మారావుకు నచ్చిన భూమిని కొనిపెట్టి, అతని దగ్గర్నుంచి మంచి పర్సెంట్‌తో కమీషన్లు తీసుకునే ఊరిలోని ఏ ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజంట్లు కలిసినా కన్నప్పను గురించే మాట్లాడుకోసాగారు.
అయినా 'నలుగురు దొంగలు నల్లమేక' కథలో బ్రాహ్మడి మాదిరిగా కన్నప్పను కూడా మాటల్లో మభ్యపెట్టి అతని స్థలాన్ని భీష్మారావుకి కట్టబెట్టిచ్చి లబ్ది పొందాలన్న ఆశతో వున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లంతా ఒకరి తరువాత ఒకరు వంతులు వేసుకుని, స్థలాన్ని అమ్మమని కన్నప్ప చుట్టూ తిరగసాగారు.
ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రలోభపెట్టినా కన్నప్ప మాత్రం 'జాగ అమ్మనంటే అమ్మను' అంటూ ఒకేమాట మీద గట్టిగా నిల్చున్నాడు.
అదంతా చూసిన భీష్మారావు 'అబ్బా! ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా స్థలం విషయంలో ఆ కోయోడు ఎంత మొండిగా వ్యతిరేకిస్తున్నాడు! ఇంతజేసినా వాడు నిజంగానే ఆ స్థలం అమ్మకపోతే అపార్ట్‌మెంట్లకి సరైనదారి లేదని కొనేవాళ్లు ముందుకురారు. టౌన్లో పదిపదిహేనేళ్ల నుండి కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి, వ్యాపారం చేస్తూ భూమి అవసరమైనప్పుడు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్లను ఒప్పించగలిగాను. కానీ ఆఫ్ట్రాల్ ఓ కోయోడిని నా దారిలోకి తెచ్చుకోలేకపోతున్నామంటే మార్కెట్లో నా ప్రెస్టేజ్ ఏంకావాలి? ఇప్పుడు నేను ఏంచేయాలి? ఏంచేద్దామన్నా రాజ్యాంగం, చట్టాలు, కోర్టులు, నాయకులు అంతా వాళ్ల పక్షాన్నే మాట్లాడ్తారుగదా!?' అనుకుంటూ ఆలోచనల్లో పడిపోయాడు.
జరుగుతున్న తతంగాన్నంతా చూసి భయపడిపోయిన కన్నప్ప 'ఆ భూమిని ఇన్నాల్టిలెక్క ఎవ్వరికీ అమ్మకుంట అట్లనే వుంచితె, ఎవరో ఒకల్లు దొంగకాయితాలు పుట్టిచ్చి ఏ అర్ధరాత్రోవచ్చి భూమిని ఆక్రమిచ్చుకున్నారంటే తరువాత నేను కోర్టుల చుట్టూ తిరగలేక సావాల. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ? నాభూమిల నేనే ఇల్లుకట్టుకుంటె ఒడ్సిపోద్దిగదా? ఎట్లా ఇంక రెండేండ్లల్ల కొలువు నుంచి గూడ దిగిపోయేదేనాయె. కొలువుల వుండంగనె ఇల్లు గట్టి పిల్లలిద్దరికీ పెండ్లి జేసి, పంపిస్తె దిగిపోయినంక పెన్షన్ పైసల్తోటి మేం ఆలు మొగలిద్దరం కలోగంజో తాక్కుంట ఇంట్లె పడి వుండొచ్చు' అనుకుంటూ తీవ్రంగా ఆలోచించి 'ఏదిఏమైనా ఇల్లు కట్టాల' అన్న నిర్ణయం తీసుకున్నాడు.
అనుకున్నదే ఆలస్యం. ముర్రేటి ఒడ్డున తన సొంత ఊరు ఎదురుతోగులో వున్న వాళ్ల పాత ఇల్లు కలపకుతోడు మరో పాత ఇల్లు కలపకొని, దాన్నంతా బండ్లమీద పాల్వంచ తోలించాడు.. అంతా మూడునెలల్లో నాలుగుదూలాల పూరిల్లు లేపాడు.
జరుగుతున్నదంతా చూసిన భీష్మారావు గత్యంతరంలేక వేరేవాళ్ల స్థలాలు కొని, తన అపార్ట్‌మెంట్లకి రోడ్డు వేశాడు. అయితే, అది 'నీ ముక్కేది?' అంటే చేతిని తలచుట్టూ తిప్పి చూపించినట్టు అయ్యింది.
కొత్త ఇంట్లోకి దిగిన ఏడాదిలోపు సంబంధాలు చూసి, ఇద్దరు బిడ్డలుకూ పెండ్లిల్లు చేసి అత్తవారిండ్లకు పంపించారు కన్నప్ప, రేగులమ్మ దంపతులు.
ఇంకో రెండునెల్లకు కన్నప్ప రిటైర్డ్ అవుతాడనగా ఓరోజు..
కన్నప్ప ఒంటిగంటకు సెకండ్ షిప్ట్ డ్యూటీకి బయలుదేరుతుంటే 'మనూరికి పొయ్యిరాక రోజులు అయితుంది. నేనుగూడ ఎమ్మటే బైలుదేరిపొయ్యి, నువ్వు తొమ్మిది గంటలకు డూటీ దిగి, ఇంటికొచ్చేలోపల్నే తిరిగొస్తా' అంది రేగులమ్మ.
'సరే మంచిది పొయిరా' అంటూ స్కూటీ స్టార్ చేసుకుని, వెళ్లిపోయాడు కన్నప్ప.
సాయంత్రం ఆరున్నర కావస్తుండగా అప్పటిదాకా ఊళ్లోనే వున్న రేగులమ్మ అత్తమామల్తో 'ఆయిన డూటీ నుంచి వచ్చేలోపల నేను ఇంటికి పొవ్వాల. ఇగ బొయ్యొస్తా' అన్జెప్పి బయలుదేరి, చర చరా నడ్చుకుంటూ ఏడుగంటల ప్రాంతంలో ముర్రేడువాగు దాటి ఒడ్డెక్కుతుండగా, అక్కడికి దూరంగా వున్న ఇసుక ర్యాంప్ నుండి వెనుకపాటుగా వచ్చిన ఏదో వాహనం ఆమెను గుద్దేసి, ఆగకుండా అదేమోపున వెళ్లిపోయింది. పాపం! రేగులమ్మ వాగొడ్డున వున్న దర్భదుబ్బుల మీద ఎగిరిపడి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
డ్యూటీ దిగి తొమ్మిదిన్నరకు ఇంటికొచ్చిన కన్నప్పకు తలుపుకు తాళం వేసే వుండడంతో 'అరే! రేగులమ్మ ఇంకా రానట్టుందే' అనుకొని వెంటనే వాళ్ల తమ్ముడికి ఫోన్ చేశాడు.
'అదేందన్నా!? ఒదిన ఆరున్నరకే బైల్దేరి వచ్చిందిగా?' అంటూ అవతల్నుండి బదులిచ్చాడు అతని తమ్ముడు.
'మరి ఇంతరాత్రి ఐతున్నా ఇంటికి రాలేదు. ఫోన్ జేస్తె రింగైతుందిగాని ఎత్తట్లేదు. ఏమయ్యుంటది' ఆందోళనగా అన్న కన్నప్ప వెంటనే స్కూటీ ఎక్కి, వాళ్ల ఊరిదిక్కు బయలుదేరాడు.
అతను ముర్రేడువాగొడ్డుకి చేరుకునేసరికి అటువైపు నుండి వాళ్ల వాళ్లందరూ వాగులోకి వచ్చారు.
అందరూ కలుసుకుని 'ఇక్కడాలేక ఇంటికి రాక మధ్యల ఏమైట్టు?' అంతా కంగారు కంగారుగా అనుకుంటుండగా మళ్లోసారి ఆవిడ ఫోన్‌కి రింగిచ్చాడు కన్నప్ప.
అవతలి ఒడ్డునున్న దర్భదుబ్బల్లో నుండి ఫోన్ చప్పుడు విన్పించడంతో అంతా అక్కడికి పరుగు తీశారు. శవమై పడివున్న రేగులమ్మ, ఆవిడకు కొద్దిదూరంలో పొదల మధ్య పడివున్న ఆవిడ ఫోన్ కనిపించాయి. ఒక్కసారిగా రేగులమ్మ కుటుంబసభ్యుల రోదనలతో ముర్రేడువాగు పరిసరాలు ప్రతిధ్వనించాయి.
అక్కడున్న వాళ్లల్లోనే ఒకళ్లు పోలీస్‌స్టేషన్‌కి ఫోన్ చేశారు.
వెంటనే జీప్ వేసుకుని, పోలీసులు రానేవచ్చారు.
తెల్లవారి ఏడు గంటలకు పోలీసులు శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.
విషయం తెలిసిన భీష్మారావు వెంటనే కలుగజేసుకొని పోలీసుల్తోను, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్లతోనూ మాట్లాడి, పంచనామా తొందరగా అయ్యేటట్టు చేసి, శవాన్ని కన్నప్ప వాళ్లకు ఇప్పించిన తరువాతనే ఇంటికెళ్లాడు.
భీష్మారావు చేసిన సాయాన్ని చూసిన కన్నప్ప ఊరివాళ్లంతా 'అబ్బా! ఈ భీష్మరావు ఎంతమనిషిరా నాయినా! లేకపోతె తన అపార్ట్‌మెంట్ల రోడ్డుకోసం స్థలం ఇయ్యమని అడిగితే అమ్మను పొమ్మన్న మనోడి మాటలను ఏమాత్రం మనుసులో పెట్టుకోకుండా, ఆయిన స్థాయికి ఆయినే మంచి ఆపదల ఎంతసాయం జేసి పోయిండు' అనుకుంటూ ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు.
జనం మాటలు చెవున పడుతున్నా ఏంమాట్లాడలేని కన్నప్ప మనసులోనే మౌనంగా భీష్మారావుకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు.
రేగులమ్మ కర్మకాండలు అయిపోయిన వారంరోజులకు బిడ్డలు, అల్లుళ్లూ 'మల్ల నీ రిటేర్‌మెంట్ నాటికి వస్తం' అనుకుంటూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
ముప్పై ఐదేండ్లపాటు కష్టంలో, సుఖంలో తోడుగా నిలిచిన అర్ధాంగి కనుమరుగైపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన కన్నప్పకు డ్యూటీకి వెళితేనే తోటివాళ్లతో ఏదోవిధంగా కాలం గడిచిపోతుంది. అదే ఇంటికొచ్చి ఒంటరిగా వుంటే మాత్రం భార్య స్మృతులు బాధించసాగాయి.
కన్నుమూసి తెరిసినంతసేపట్లో రెండుమాసాలు గడిచిపొయ్యాయి.
అన్న ప్రకారం కన్నప్ప రిటైర్మెంట్ రోజునాటికి బిడ్డలు, అల్లుళ్లు, బంధువులు దిగిపొయ్యారు. రిటైర్మెంట్ అయిపోయిన మర్నాడే పెద్దమ్మ గుడి దగ్గర రెండు యాటపోతుల్ని వేయించి, కంపెనీలో దోస్త్‌లకు, చుట్టాలకు భోజనాలు ఏర్పాటు చేశాడు.
ఏదో అర్జంట్ పనిమీద భద్రాచలం వెళుతూ గుడి దగ్గర ఆగిన భీష్మారావు కన్నప్పకు కనబడివెళ్లాడు.
మూడోనాడు కన్నప్ప తన తోడబుట్టిన నలుగురక్కచెల్లెళ్లకు తలా పాతిక వేలు. బిడ్డలిద్దరికీ చెరో రెండులక్షలు ఇచ్చాడు. అంతటితో రిటైర్మెంట్ కార్యక్రమం అయిపోవడంతో బిడ్డా అల్లుళ్లతోపాటు అంతా వెళ్లిపోయారు.
కన్నప్పకు అప్పటిదాకా వంట రాకపోయినా ఎట్లాగో తిప్పలుపడి, స్టౌవ్ మీద బియ్యం పెట్టుకొని, బజారుకెళ్లి కర్రీపాయింట్‌లో ఏదో ఓకూర, సాంబారు, పెరుగు కొనుక్కొచ్చుకొని, రెండుపూటలా అదే సర్దుకుని తినసాగాడు.
ఫ్యాన్ గాలికి తిరిగిపోయే పుస్తకంలోని పేజీల మాదిరిగా నూట ఎనభైరోజులు గడిచిపోయాయి.
కన్నప్పకు మెలమెల్లగా స్వయంపాకం అలవాటైపోయింది.
ఈ మధ్యకాలంలో ఒకటి, రెండుసార్లు అతని ఇంటిమీదిగా కార్లో వెళుతూ చూసి, కారు ఆపిన భీష్మారావు 'ఏం కన్నప్పా! ఈ బాధంతా ఎందుకు? ఎన్నాళ్లిట్లా తిప్పలు పడతావు? గంతకు తగ్గ బొంత అన్నట్టు ఎవరన్నా నీ వయసుకు తగ్గ అనాధ మనిషిని చూసి పెండ్లి చేసుకోరాదు' అంటూ సలహా ఇచ్చాడు.
అతని మాటలు వింటూనే 'అరవైఏండ్లు దాటినై ఇంకా నాకు పెండ్లేందయ్యా? ఒక్కసారే కాటికిపోవుడే తప్ప' అంటూ కండ్లనీళ్లు పెట్టుకున్నాడు కన్నప్ప.
అట్లా అంటే ఎట్లా? లోకం మీద నీలాంటోళ్లు ఎంతమంది మళ్లా పెండ్లిళ్లు చేసుకోవట్లేదు? నామాటిని నువ్వు పెండ్లి జేసుకోవడమే మంచిది. నేను ఎందుకు చెబుతున్నానో బాగా ఆలోచించుకో' అనేవాడు భీష్మారావు.
అతనట్లా చెప్పిపోయిన ప్రతిసారీ కన్నప్ప 'అరే! నిజానికి బీష్మారావు శానామంచోడు. నేనే ఆయిన్ని సరిగ్గ అర్థం జేస్కోలేకపోయిన. నా ఇంటిజాగ ఇస్తె అడిగినన్ని డబ్బులిస్తనన్నడు. మేం వుండనికి కావాలన్న అపార్టుమెంటుల రొండు పడగ్గదుల ప్లాటిస్త్తనన్నడు. కానీ ఏంలాభం? నేను ససేమిరా జాగ ఇయ్యనంటె ఇయ్యనంటి. అయినా ఆయిన అయ్యన్ని మనుసుల పెట్టుకోకుంట నా భార్య చచ్చిన్నాడు ముందలబడి ఎంత సాయం జేసిండు. నేను సూపిచ్చిన మొండితనానికి అదే ఇంకొకలైతే సాయం జేసేడుగాదు. ఉల్టా ఎన్ని వంకరమాటలు మాట్లాడేటోల్లో?' అన్న ఆలోచనకులోనయ్యేవాడు.
సహజంగానే ఎదుటివాళ్లు చేసిన మేలును మరిచిపోని మూలాల నుండి వచ్చిన కన్నప్ప, భీష్మారావు చేసిన సాయాన్ని మనసులో పెట్టుకొని, అతనన్నా అతనిమాటన్నా ఎంతో గౌరవం చూపించినప్పటికీ పెండ్లి విషయంలో మాత్రం అతని సలహానుగూడా పక్కనబెట్టి మరో ఆలోచనకు తావులేకుండా ఒంటరిగానే వుండిపోసాగాడు.
చూస్తుండగానే రేగులమ్మ చనిపోయి రెండేండ్లు దాటిపోయింది.
ఈమధ్య రెండునెల్ల కింద భీష్మారావువాళ్ల ఫంక్షన్ హాల్లో పనిచేసే సూరమ్మ అనే ఒంటరి మహిళ ఒకావిడ కన్నప్ప ఇంటికి ఎడమపక్కనున్న ఖాళీజాగాలో దానిచుట్టూ బేస్‌మెంట్ లేపి, ఇంటినెంబర్ కోసం తాత్కాలికంగా వేసి వున్న రేకుల షెడ్లో కిరాయికి దిగింది.
అడపా దడపా కన్నప్పకు ఎదురుపడిప్పుడు.. ఆవిడే అదో ఇదో మాటకలిపి మాట్లాడేది.
మరో ఆరునెల్లు గడిచేటప్పటికి ఆ పలకరింపులు కాస్తా ఏదో మాటాముచ్చట్లకు దారితీశాయి.
సూరమ్మ ఫంక్షన్ హాల్లో నుండి తీసుకొచ్చిన మటన్, చికెన్, బగారాలు కన్నప్పకు ఇవ్వడం మొదలుపెట్టింది. వంటపని తప్పడంతోపాటు మంచి భోజనం కూడా దొరుకుతుండడంతో అతనూ కాదనకుండా తీసుకోసాగాడు.
వెన్నపూస ఎంతగట్టిగా పేరుకున్నదైనప్పటికీ సెగపక్కన వుంటే కరగక తప్పదన్నట్టు కన్నప్ప మెలమెల్లగా సూరమ్మ ఆకర్షణలో పడిపోసాగాడు.
ఆరునెల్లు గడిచేటప్పటికి రాత్రికాగానే అతను సూరమ్మ కౌగిట్లో వెచ్చదనాన్ని ఆస్వాదించసాగాడు. ఆ వీధిన వుండే వాళ్లందరికీ వాళ్లిద్దరి మధ్యా నడుస్తున్న వ్యవహారం అర్థమైనప్పటికి 'అదిచూస్తే ఒంటరి ఆడది. వీణ్ణి చూస్తే పెండ్లాంలేనోడు. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతున్నారు. మధ్యన మనకెందుకొచ్చిన గొడవ?' అనుకుంటూ ఎవరికివాళ్లు చూసీచూడనట్టు వుండిపోయేవాళ్లు.
మరో ఆరునెల్లు గడిచిపోయాయి.
ఓరోజు మధ్యరాత్రి సూరమ్మ ఇంట్లో నుండి ఆరుపులు, కేకలు వినిపించడంతో 'ఏంటబ్బా!?' అనుకుంటూ వీధిలో వాళ్లంతా గబగబా తలుపులు తీసుకుని వచ్చి, ఆ ఇంటిముందు గుమిగూడారు.
సిగ ఊడిపోయి, జాకెట్టు చిరిగిపోయి, చీర సగం జారిపోయి తలుపులు తీసుకుని బయటకు ఉరికొచ్చిన సూరమ్మ గుండెలు బాదుకుంటూ 'ఇంకాస్సేపైతే ఈయ్యాల నన్ను అన్యాయంగ సంపేటోడు' అంటూ గోల గోలగా ఏడవసాగింది.
అసలు లోపల ఏంజరిగిందోగానీ సూరమ్మ తీరుకి ఒక్కసారిగా విస్తుబోయినట్టు నిలబడిపోయిన కన్నప్ప వాడకట్టు వాళ్లముందు సిగ్గుతో తలవంచుకుని, నిలబడిపోయాడు.
ఇంతలో...
ఎలా తెలిసిందో? ఏమోగానీ, సూరమ్మతోపాటు ఫంక్షన్‌హాల్లో పనిచేసేవాళ్లో ఐదారుగురొచ్చి కన్నప్పను చుట్టుముట్టి 'ఒంటరిగా వుంటుందన్జెప్పి, రాత్రిపూట ఇంట్లో జొరబడి ఆగంజెయ్యనీకి తెగబడతావా?' అంటూ అతని మీద చెయ్యిచేసుకున్నారు.
సూరమ్మ, కన్నప్పల మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్న ఇరుగుపొరుగువాళ్లు అడ్డుపడి 'అరే విషయమేదన్నా వుంటే కూర్చుని మాట్లాడుకోవాలి గానీ, ఇలా మనిషిని పట్టుకొని కొట్టడమేంటి?' అన్నారు.
వాళ్ల మాటలతో కాస్త వెనక్కి తగ్గిన ఫంక్షన్‌హాల్ వాళ్లు వెంటనే కన్నప్పను సూరమ్మ ఇంట్లోకితోసి తలుపేసి, ఆవిడతో సహా బయట కాపలా కూర్చున్నారు.
ఆ రాత్రిమీదనే ఎవరెవరికో ఫోన్లు చేశారు.
రాత్రంతా అక్కడే వుండిపోయిన ఫంక్షన్‌హాల్ వర్కర్స్ తెల్లవారిన తరువాత 'పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి రేప్ కేస్ పెడదాం పాండి!' అంటూ హడావిడి చెయ్యసాగారు.
విషయం తెలిసి వచ్చిన కన్నప్ప బంధువుల్తోపాటు ఆ బస్తీ వాళ్లంతా 'అయ్యో తొందరపడకండీ! ముందు మనందరికీ కావాల్సిన పెద్దమనిషి భీష్మారావు గారున్నారుగదా? ఆయన దగ్గరికెళ్లి విషయం వివరిద్దాం. ఆ తరువాత ఆయిన ఎట్లా చెబితే అట్లా చేద్దాం' అంటూ మద్యేమార్గంగా తమకుతోచింది చెప్పారు.
ఎప్పుడైతే భీష్మారావుపేరు బయటకొచ్చిందో అప్పుడు చప్పున తగ్గిపోయిన ఫంక్షన్‌హాల్ సిబ్బంది 'సరే మా సార్ మాటైతే మేం గూడా ఇనుకుంటాం' అంటూ తమ సమ్మతిని తెలియజేశారు.
వెంటనే ఆ కాలనీ పెద్దమనిషి రిటైర్డ్ హెడ్‌మాస్టార్ విశ్వనాథం కొంతమందిని వెంటబెట్టుకొని, భీష్మారావు ఇంటికెళ్లి జరిగిన విషయాన్నంతా వివరించాడు.
వాళ్లకు మాట ఇచ్చిన ప్రకారం పది గంటలకు భీష్మారావు కారేసుకుని సూరమ్మ ఇంటిదగ్గరికి వచ్చాడు.
వచ్చిన వెంటనే గది తలుపులు తీయించి, కన్నప్పను బయటకు రప్పించి అతని ముఖంలోకి చూస్తూ 'ఇటువంటివి జరక్కుండా వుండాలన్న ముందుచూపుతోనే నిన్ను పెండ్లిచేసుకుమ్మని సలహా ఇచ్చాను. నువ్వే వినిపించుకోలేదు. దాని ఫలితం ఇట్లా జరిగింది. సరే అయ్యిందేదో అయ్యింది. పోలీస్‌లొద్దు, కేసులొద్దు. నీకు ఇష్టమైతే సూరమ్మతో మాట్లాడి, మీ ఇద్దరికీ ముడిపెట్టే ఏర్పాటుచేస్తాను. వున్నన్నాళ్లు ఇద్దరూ హాయిగా బతకండి. ఎవరు ముందో? ఎవరు వెనుకో ఎవరికీ తెలియదు. కాబట్టి నీ తదనంతరం నీ పెన్షన్ ఆవిడకొచ్చేటట్టు రాసియ్యి.. సరిపోతుంది' అంటూ సలహా ఇచ్చాడు.
దాంతో ఆలోచనలో పడిపోయిన కన్నప్ప మనసులో సూరమ్మ చేసిన వంచన ముల్లులా గుచ్చుకుంటున్నా, ఇక తప్పదు కాబట్టి పైకిమాత్రం 'నాకిష్టమే' అన్నాడు.
వెంటనే సూరమ్మ దిక్కు తిరిగిన భీష్మారావు 'మరి నువ్వేమంటావ్?' అంటూ అడిగాడు.
'మీరెట్ల చెబితే అట్లనే సారూ!' సిగ్గుపడుతూ తలవంచుకొని, అంది సూరమ్మ.
ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కన్నప్ప బిడ్డలు, అల్లుళ్లూ 'ఇల్లు మాకు రాసిచ్చి, నీపెన్షన్, నువ్వు ఎక్కడన్నా చావు' అంటూ తేల్చి చెప్పారు.
'సరే' అంటూ అందుకూ ఒప్పుకున్నాడు కన్నప్ప.
దాంతో పెద్దమ్మగుడి దగ్గర సూరమ్మ, కన్నప్పకు పెండ్లి జరిగిపోయింది.
పెండ్లి అయ్యి ఆరునెల్లు గడిచేసరికి అనుకున్న ప్రకారం పెన్షన్ కాగితాల మీద రేగులమ్మ పేరుకు బదులు సూరమ్మ పేరు ఎక్కించడం జరిగిపోయింది.
మరో ఏడాది గడిచిపోయేసరికి బ్యాంక్‌లో వున్న కన్నప్ప క్యాష్ మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయింది. దాంతో సూరమ్మ, కన్నప్ప కాపురంలో కలహాలు మొదలై, తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఒక్కసారి కళ్లు తెరిచి చూసుకున్న కన్నప్ప 'నేను సూరమ్మ వేసిన ఉచ్చులో పూర్తిగా తగులుకున్నా' అనుకుని గగ్గోలు పెడుతూ బిడ్డల దగ్గరికి వెళ్లాడు.
బిడ్డలిద్దరూ 'ఆ ఇంటిస్థలం అమ్మి, వచ్చిన డబ్బులు మాకు చెరిసగం ఇస్తే చెరో ఏడాదిచొప్పున పువ్వుల్లోపెట్టి చూసుకుంటాం' అంటూ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు.
అప్పటికి తన పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థమైన కన్నప్ప వెనుదిరిగి నేరుగా భీష్మారావు దగ్గరికెళ్లి 'అయ్యాల మీరు ఎంత అడిగినా భూమి ఇవ్వలేదు. ఇయ్యాల నా అంతటనేనే మీకా భూమిని అమ్ముతానని చెప్పనికి వచ్చిన' తానేదో కానిపని చేస్తున్నవాడిలా సిగ్గుపడుతూ అన్నాడు.
అతను చెప్పిందంతా విన్న భీష్మారావు 'చూడు కన్నప్పా! నువ్వా స్థలం నీ బిడ్డలకిస్తున్నట్టు ఆరోజు మాముందే కాగితాలు రాసిచ్చావుగదా? మరిప్పుడు నువ్వొక్కడివే వచ్చి ఇల్లమ్ముతానంటే ఎట్లా? నిజంగా నువ్వు అమ్మాలనుకుంటే నీ ఇద్దరు బిడ్డల్ని తీసుకునిరా.. వాళ్లతో మాట్లాడిన తరువాత భూమిని తీసుకునేదీ లేనిదీ చెబుతా' సందర్భాన్నిబట్టి మాట్లాడే పక్కా వ్యాపారిలా మాట్లాడాడు భీష్మారావు.
'సరేనయ్యా! అట్లనే నా బిడ్డల్ని తీసుకొనొస్తా' అని వెళ్లిన కన్నప్ప మూడురోజుల తరువాత ఇద్దరు బిడ్డల్ని, అల్లుళ్లను తీసుకుని నేరుగా భీష్మారావు దగ్గరికి వచ్చాడు.
కొంతసేపు ఏవేవో పిచ్చాపాటి మాటలు మాట్లాడిన భీష్మారావు ఆఖరికి 'అవ్వాళ్ల నేను నీ జాగా అడిగినప్పుడు ఆ ఏరియాలో గజం యాభైవేలుండేది. అప్పుడు నువ్వు ఇస్తానంటే ఇంకో పదివేలు కలిపి, అరవైవేలైనా ఇచ్చి తీసుకుందాం అనుకున్నా. పెద్దమ్మోరు నీ నెత్తిన కూర్చుని, ఎంతబమితిలాడినా నువ్వు నామాట విన్పించుకోలేదు.
ఇప్పుడు జూస్తే కరోనా వచ్చి రెండేండ్ల నుండి అపార్ట్‌మెంట్ల కట్టుబడి పూర్తిగా ఎక్కడిదక్కడ నిల్చిపోయింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబరంతా ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. దాంతో మాపెట్టుబళ్లన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. నా మీద అభిమానంకొద్దీ నాదగ్గరికొచ్చిందుకు సంతోషమే. కానీ, ఈ పరిస్థితిలో నేను అంతరేటుపెట్టి, మీ ఇంటి స్థలం కొనలేను. కాబట్టి ఎవరన్నా కొనేవాళ్లుంటే శుబ్బరంగా అమ్ముకోండి' అంటూ నెమ్మదిగా చెప్పుకొచ్చాడు.
అతని మాటలను విన్న కన్నప్ప అతని పిల్లలుగూడా 'సారు చెబుతుందిగూడా నిజమేగదా?' అనుకున్నారు.
కొంతసేపు ఏదో ఆలోచించుకున్న కన్నప్ప 'మీ ఇష్టం సారూ! మీరు ఎంతియ్యాలనుకుంటె అంతే ఇయ్యండ్రి! నాకు అప్పట్నుంచి ఇప్పటిదాక మీరు అన్నిరకాలుగా సాయంజేసుకుంటా వచ్చిండ్రు. నేను మీకు తప్ప వేరేవాళ్లకు భూమి అమ్మనే అమ్మను' అంటూ ఎంతో విశ్వాసంగా చెప్పుకొచ్చాడు.
'అయ్యో! నేనిస్తానన్న రేటు మీకు నచ్చకపోవచ్చు. ఎందుకొచ్చిన గోల? ఇవ్వాళ్ల కాదనుకున్న డబ్బులు రేపు రమ్మన్నా రావుగదా? అందుకే మీకు వారం గడువిస్తున్నా, రేటు పెట్టేవాళ్లుంటే తెలుసుకొని, అమ్ముకోండి! నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే వంకరో టింకరో నేను రోడ్డు వేసేశాను. కాబట్టి ఆ స్థలంతో అప్పుడున్నంత అవసరం నాకిప్పుడు లేదు. మీకు నాలుగు రూపాయలు ఎక్కువొస్తే మీకంటే నేనే ఎక్కువ సంతోషపడతాను' అంటూ కమ్మగా చెప్పుకొచ్చాడు భీష్మారావు.
'ఎవ్వర్నీ కనుక్కునేదిలేదు ఏంలేదు సారూ! మీరింత రేటని తెగేసి చెప్పండ్రి! మీ మాటకు ఎదురుచెప్పకుంట ఇచ్చేస్త్త' అన్నాడు కన్నప్ప.
అసలా భూమే తనకు ఇష్టంలేనట్టుగా ముఖంపెట్టి, కొంతసేపు ఆలోచించిన భీష్మారావు 'చూడు కన్నప్పా! నువ్వు నన్ను మరీ మొఖమాటం పెట్టేస్తున్నావు. నువ్వు అంతగ చెబుతున్నావు కాబట్టి గజానికి ముప్పై ఐదువేలిస్తా. అదీ నాకు అవసరంలేక పోయినా నీ కోసం తీసుకుందామనుకుంటుకున్నా' అతని మీద ఎంతో సానుభూతిని వర్షిస్తున్నట్టు మాట్లాడాడు.
'మీ ఇష్టమయ్యా!' ఏమాత్రం తేడా లేని వినయంతో బదులిచ్చాడు కన్నప్ప.
దానికి అతని బిడ్డా అల్లుళ్లు గూడా 'సరే' అన్నారు.
వారం రోజుల్లో రాతకోతలన్నీ అయిపోయి, సరీగ్గా డబ్బులు కట్టబోతున్న సమయంలో.. సూరమ్మ వచ్చి, అందరూ చూస్తుండగా భీష్మారావు కాళ్లమీద బడి.. 'అయ్యా! ఈవయసున నన్ను మాయజేసి, మారుమనువు కట్టుకొని నానాపుల్లెందలు పెట్టిండు. అయినా నేను పడ్డకాన్నే పారుకులాడాలన్నట్టు ఓపికతోనే వుంటున్న. ఇప్పుడాయిన నాకేమన్న ఇడాకులిచ్చిండా? రేపు ఆయన సస్తే నేను ముండమొయ్యొద్దా? నాకు ఒక్కమాటగూడ చెప్పకుంట అయ్యా బిడ్డలు గలిసి భూమి అమ్ముకొనుడు నాయమేనా? అమ్మితే అమ్మిండ్రు నాగ్గూడా పావులో బేడో ఇచ్చే ఏర్పాటు జెయ్యుండ్రి!' అంటూ బొలబొలా ఏడవసాగింది.
'ఏమయ్యా కన్నప్పా! ఏంటిదంతా? పిల్లల్తో చెప్పినట్టు భార్యతోగూడా ఒకమాట చెప్పితే సరిపోయేదిగదా' విసుగ్గా అన్నాడు భీష్మారావు.
'ఆమెకు చెప్పేదేంది సారూ! మాకు ఇంటిస్థలం. ఆమెకు పెన్షన్ అని అయ్యాల్నాడు కాయితాలు రాసుకున్నదే గదా? మల్లిప్పుడు ఇంటిపైసల్ల గూడ భాగమియ్యాల్నని అడుగుడు ఎక్కడ్ది!?' అంటూ కన్నప్ప పిల్లలిద్దరూ లబలబలాడుతూ భీష్మారావుతో మొరపెట్టుకున్నారు.
వాళ్లు చెప్పిందంతా ఓపిగ్గా విన్న భీష్మారావు 'మీరన్నది నిజమే. కాని భార్యగా వున్నప్పుడు అంతో ఇంతో ఆశ పడడంలో తప్పులేదుగా. ఏదో దయాభిక్షం అన్నట్టు ఎంతో కొంత ఇచ్చి, ఆవిణ్ణిగూడా సంతోషపెట్టండీ' అంటూ సలహా ఇచ్చాడు.
అనేక తర్జనభర్జనల తరువాత సూరమ్మకు ఓ లక్ష రూపాయలు ఇచ్చే ఒప్పందం చేసుకున్నారు. ఆవిడకిచ్చిన లక్ష పోను మిగిలిన డబ్బుల్లో ఇద్దరు బిడ్డలకు చెరిసమానంగా పంచి ఇచ్చేశాడు కన్నప్ప.
డబ్బులు చేతిలో పడగానే కన్నప్పను వదిలేసి సూరమ్మదారి సూరమ్మ చూసుకుంది.
జరిగినదానికి ఇక అక్కడ వుండడానికి ముఖం చెల్లక కన్నప్ప బిడ్డల్తోపాటు ఊరు విడిచిపెట్టి, వెళ్లిపోయాడు.
కన్నప్ప శాశ్వతంగా ఊరు విడిచి వెళ్లిపోయిన మూడోరోజు తన ఫామ్‌హౌజ్ ఏసి రూమ్‌లో కూర్చున్న భీష్మారావు ముందు డ్రైవర్ నర్సిమ్మ, సూరమ్మలిద్దరూ చేతులు కట్టుకుని నిల్చుని, అతని వంక విశ్వాసంగా చూస్తున్నారు.
'శభాష్! ఇంతమంది పన్జేస్తున్న మన సంస్థలో నేను నిప్పుల్లో దూకమన్నా ఎందుకు? ఏంది? అని అడక్కుండా దూకే మీరిద్దరంటే నాకు చెప్పలేనంత అభిమానం. అరే నర్సిమ్మా! నేను చెప్పినట్టు రెండో కంటికి తెలియకుండా ఆ కన్నప్పగాడి భార్యను టిప్పర్‌తో గుద్ది, చంపినందుకు నీకు! నామాట ప్రకారం ఆ కన్నప్పగాడిని వల వేసి లొంగదీసుకుని, పెండ్లిజేసుకొని, వాడికి నిండా సున్నం రాసి, చివరికి నేను అనుకున్నట్టు వాడంతట వాడే తన ఇంటిస్థలాన్ని నాకు అమ్మేటట్టు చేసిన సూరమ్మకూ ఎంతిచ్చినా తక్కువేరా!' అంటూ వాళ్లిద్దరికీ చేరో నాలుగు ఐదొందల నోట్ల కట్టలు అందించాడు.
శీరంశెట్టి కాంతారావు
k.r.siramsetty@gmail.com