Dec 04,2022 08:33

(గోలకొండ పాదుశాహి పర్మానుల సీలు ఇచ్చట విప్పబడుటంజేసి దీనికి సికాకోల్‌ లేక చికాకోల్‌ అనుపేరు కలిగెనని యిచ్చటి వారందరు గాని అది నిజముకాదు. ఈ పట్టణము బహు ప్రాచీనమైనది. దీనిపేరు శ్రీకాకుళం. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేరు మహమ్మదు పెద్ద మసీదును కట్టెను. నిజమిది)
ఒక సంవత్సరమున కార్తీక శుక్లపక్ష దశమినాటి సాయంత్రము ఇద్దరు బ్రాహ్మలు, ముప్పది యేండ్ల ప్రాయపుటతడొకడును, యిరువది యేండ్ల లోపు వయస్సుగల యతడొకడును తూర్పున నుండి పట్టణము దరియ వచ్చుచుండిరి.
నారాయణభట్టు మోము అత్యంత సంతోషముతో వికసితమై యుండెను.
'పుల్లా! మా వూరొచ్చాంరా, యిట్టి వూరు భూ ప్రపంచంలో వుండ
శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరుని దేవాలయం ఉండేది. పూర్వ కళింగ గాంగులు పరమ మహేశ్వరులు. అయినా వైష్ణవాన్ని కూడా ఆచరించారు. ఆర్వాచీన కళింగ గాంగులలో వైష్ణవులెక్కువ.
క్రీ. శ. 1571లో గోలకొండ నవాబు కులీకుతుబ్‌షా గజపతులను జయించి శ్రీకాకుళం సర్కార్‌ను లోబరుచుకున్నాడు. కుతుబ్‌షాహీల కాలంలో శ్రీకాకుళం పాలకుడుగా (ఫౌజ్‌దార్‌) పని చేసిన షేర్‌ మహమ్మద్‌ ఖాన్‌ అక్కడ మసీదు కట్టించాడు.
క్రీ. శ. 16వ శతాబ్ది చివరి భాగంలో చికాకొల్లు ఫౌజ్‌దారైన షేర్‌ మహమ్మద్‌ ఖాన్‌ తనతోబాటు వచ్చిన వాళ్ళలో ఒకరికి కుమిలి (కుంభిళా పురం), మరొకరికి బొబ్బిలి ('షేర్‌' అంటే పులి. అతని పేరుమీదనే ఈ కోటకు 'బొబ్బిలి' అని పేరు వచ్చిందంటారు) ఇచ్చాడు. కుమిలి పాలకులు విజయనగర పాలకులుగా పరిణమించారు.
ఈ కథలోని పాద పీఠిక అవసరాల సూర్యారావుది. పెద్ద మసీదు' అన్నది యీ కథకు యింకో పేరు.
పాద పీఠికలో 'కథ మధ్యలో ఆగిపోయిం'దనీ 'రాసి కొట్టివేసిన దాన్నిబట్టి నారాయణ భట్టు చినమామ లక్ష్మణభట్టు. లచ్చన్న - అని తెలుస్తుంది. లేచి అతడు మేనల్లుణ్ణి కౌగలించుకోబోతాడు. కానీ వద్దు వద్దంటూ నారాయణ భట్టు దూరం తొలగుతాడు' అని ఉంది. గురజాడ రాసి కొట్టివేసిన కాగితం అలభ్యం. (సం)
బోదురా. కాళిదాసు అవంతిని ఉద్దేశించి చెప్పిన మాటలు దీనియందు వర్తిస్తున్నాయిరా, యేమి నది! యేమి వూరు: యేమి పాడి పంటలు : ఇక శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము. ఎట్టి మహా క్షేత్రమని చెప్పను, అదుగో!'
నారాయణభట్టు నిశ్చేష్టుడై నిలిచి, కొంత తడవు మాటాడకుండెను,
'యేమి స్వామీ! యేమి స్వామీ!' అని పుల్లంబొట్లు అడుగ 'యేమి చెప్పనురా. పుల్లా! కోవిలె గోపురం మాయవైపోయిందిరా!' అని నేలపై కూలబడెను.
చెట్ల చాటున ఉందేమో స్వామీ?'
'యే చెట్లు కమ్మగలవురా, పుల్లా! ఆకాశానికి నెత్తంటిని ఆ మహా గోపురాన్ని! మనస్సు చివుక్కుమని పోయిందిరా పుల్లా. యీ పట్నానికీ మనకీ రుణస్య యిక చెల్లిపోయింది. రా తిరిగీ కాసీ పోదాం.'
'గోపురం కోసవా యిక్కడికి వచ్చాం స్వామీ? ఎడతెగని మార్గాయాసం పడి యీ నాటికి దేసం చేరాం గదా. మళ్లీ వెంటనే కాసీ పోవానికి యినప కాళ్ళు కావు గదా? లెండి, నా మాట వినండి! దాని సిగ్గోసిన గోపురం గోపురవన్నదే మీకు కావలసివుంటే మా వూరు రండి.'
'ఓరి వెఱ్ఱివాడా! మీ వూరి గోపురం యెవరిక్కావాలిరా! నీకు బోధపడదు. చిన్నతనంలో యెన్నడూ ఆ గోపురం మీదే ఎందుకా తీపులు. మా గోపురం కథా విశేషవైంది.'
లేచి 'శివ శివ! ఒరే. మీ వూరి గోపురం కూడా యీ మ్లేచ్చులు పడగొట్టి వుంటాఱ్ఱా!'
'మీకు యేమి ఉపద్రవం వచ్చింది. పడగొడితే ఆ పాపం వాళ్లకే కొడుతుంది. ఆకలేస్తూంది. పెందరాళే వూరు చేరుదాం! లేచి అడుగెయ్యండి.'
'ఏం వూరు - చావడం! ఆకలంతా పోయిందిరా.'
నారాయణ భట్టు లేచి మౌనం వహించి కొంత తడవు నడిచెను. అంతట తలయెత్తి చూడ సంజ యీకటిలో నెలి వెలుగు కమ్మిన పడమటి ఆకాశమును చూసి రెండు మసీదు స్తంభములు కళ్ల యెదుట నిలిచెను. నారాయణ భట్టు మరల నిలిచిపోయి స్తంభముల పరికించుచు :
'కాకుళేశ్వరుడి గుడి పగులగొట్టి మ్లేచ్చుడు మసీదు కట్టాడు' అనుకొనెను.
'దేవుడెందు కూరకున్నాడు, స్వామీ.'
'ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా పుల్లా. మసీదువేపు పోదాం పద.'
'మసీదుగానీ సత్రం అనుకున్నారా యేమిటి? పెందరాళే భోజనం మాట ఆలోచించుకోకపోతే ఉపవాసం తటస్థిస్తుంది.'
'అంత మహా క్షేత్రం పోయిన తరువాత తిండి లేకపోతే వచ్చిన లోటేమిటి?'
కాలుకు కొత్త సత్తువ పుట్టి గురువును, కాలీడ్చుచు శిష్యుడును గట్లంట, పుట్టలంట బడి మసీదు ద్వారం చేరిరి.
'ఏమి తీరుగా కట్టాడు స్వామీ, మసీదు!'
'వాడి శ్రాద్ధం కట్టాడు!'
గడ్డము పెంచి యాబది సంవత్సరములు ప్రాయముగల ఒక తురక చిలుము పీల్చుచు కూర్చుని యుండ నారాయణ భట్టు 'సలా'మని ఇట్లడిగెను:
'భాయీ! ఇక్కడే కదా పూర్వం శివాలయం వుంటూ వచ్చింది.'
తురక ఒక నిముష మూరుకొని నోటిలో పొగ నెగనూది 'హా సైతాన్కా ఘర్‌' అని యుత్తర మిచ్చెను.
'ఏం పాట్లొచ్చాయీ దేవుళ్ళకి!'
'దేవుళ్ళకి యే పాట్లూ లేవు, మన సాపాటు ఆలోచించరేం?'
'కుఱ్ఱవాళ్ళకి ఆకలి లావు సాయిబు గారూ! యీ వూళ్లో చేబ్రోలు వారుండాలి; వున్నారా? యీ దేవాలయం దగ్గిరే వారి బస వుండేది. అనగా యిప్పుడు మీ మసీద్దగ్గిరే!'
ముసల్మాను స్వచ్ఛమగు తెనుగు నవలండించి 'లేద'నెను.
'అయ్యో! మా పెదమావ రామావధాన్లు, చినమావ లక్ష్మణ భట్టు దేశాంతర గతులైనారా? మృతులైనారా?'
సాయీబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలుదెసల చెదర, ''నారాయణా'' యని నఖేదముగా పిలిచెను.
'అయ్యో! నువ్వా మావా!'