తెలుగు పీరియడ్ సమయం అవగానే గంట కొట్టాడు అటెండరు యాదయ్య. వెంటనే ఐదవ తరగతిలోకి సైన్స్ మాస్టారు అనీల్‌కుమార్ ప్రవేశించాడు. అతని చేతిలో ఉన్న పేపర్ల కట్ట వంక పిల్లలంతా ఆసక్తిగా చూడసాగారు. మొదటి యూనిట్ పరీక్షల జవాబు పత్రాలు అవి. పేపర్లు తమకి ఎప్పుడిస్తారా అని విద్యార్థులంతా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. తమకి ఎన్ని మార్కులు వచ్చాయో, ఒకవేళ తక్కువ వస్తే మాస్టారి చేత తిట్లు, దెబ్బలు తప్పవేమో అని టెన్షన్ పడుతున్నారు అందరూ. మాస్టారు కుర్చీలో కూర్చుని పేపర్ల కట్ట టేబుల్ మీద పెట్టి, వరుసగా పేర్లు పిలుస్తూ వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా చదవసాగారు. అరుణ్-20, అరవిందా- 16, అమర్నాథ్- 22, భవాని - 21, భరత్- 9, పావని- 19. వరుసగా అందరి మార్కులు చెప్పి, వాళ్ళ పేపర్లు చూసుకోమన్నారు.
పిల్లలందరూ తమ మార్కులు చూసుకుని, తాము ఎక్కడ తప్పు జవాబులు రాసామో చూసుకుని, మార్కులు తగ్గినందుకు వాపోతున్నారు. ఇరవై ఐదు మార్కులకు ఇరవై కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని దగ్గరకు పిలిచి, వారు సరిగ్గా ఎందుకు రాయలేదో కారణాలు అడిగి, తగిన సలహాలు ఇవ్వసాగారు అనిల్ మాస్టారు.
పేపర్లు అందరికీ ఇవ్వడం పూర్తి అయినాక, ఇరవై ఐదు మార్కులకు ఇరవై నాలుగు మార్కులు తెచ్చుకుని తరగతిలో ప్రథమంగా నిలిచిన కైలాష్‌ను మెచ్చుకుని, విద్యార్థులందరిచేత చప్పట్లు కొట్టించారు. చివరగా పది మార్కుల కంటే తక్కువ వచ్చిన నితీష్, లోహిత, అంకిత్‌ను కాస్త బెదిరించి, చదువు మీద బాగా శ్రద్ధ పెట్టమని గట్టిగా హెచ్చరించారు. అలాగే మాస్టారు అని వాళ్ళు తలలు ఊపారు.
మూడునెలల పరీక్షలు అయిపోయాక సెలవులు కూడా అయిపోయి, బడులు తెరిచి వారం అయింది. ఆ రోజు ఐదవ తరగతికి సైన్స్ పేపర్లు తెచ్చిన అనిల్‌కుమార్ మాస్టర్ వరుసగా పిల్లలను పిలిచి పేపర్లు ఇవ్వసాగారు. కైలాష్ నీకు తొంబై ఎనిమిది మార్కులు వచ్చాయి. వెరీగుడ్ అన్నారు మాస్టారు. కైలాష్ ముఖంలో సంతోషం. తర్వాత నితీష్ నీకు తొంబై ఐదు మార్కులు వచ్చాయి అంటూ నితీష్ వంక కాస్త ఆశ్చర్యంగా చూసారు. నితీష్ ముఖం వంద వోల్టుల బల్బ్‌లా వెలిగిపోయింది. గర్వంగా తన స్నేహితుల వంక చూసాడు.
విద్యార్థులందరికీ పేపర్లు ఇచ్చేసి తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో వచ్చిన కైలాష్, పావని లకు చప్పట్లు కొట్టించాడు. కానీ అతని మనసులో ఏదో తెలియని చికాకు మొదలైంది.
ఎప్పుడూ పరీక్ష పెట్టినా ఫెయిల్ అవడమో, లేదా పాస్ మార్కులకు అటు, ఇటుగానో మార్కులు తెచ్చుకునే నితీష్‌కి 95 మార్కులు రావడం అమితాశ్చర్యంగా ఉంది. పోనీ ఈసారి బిడ్డ కష్టపడి చదివాడేమో.. లేకుంటే తన అనుమానమే నిజమా..? ఎటు తేల్చుకోలేక అప్పటికప్పుడు యాదయ్యని పిలిచి, మూడు నెలల పరీక్షల్లో పిల్లల సీటింగ్ వివరాలు ఉన్న పేపర్‌ని హెడ్ మాస్టారిని అడిగి తెమ్మన్నారు.
ఐదు నిమిషాల్లో యాదయ్య క్లాసులోకి వచ్చి పేపర్లు అనిల్ మాస్టారికి ఇచ్చి వెళ్ళాడు. ఐదోతరగతి పిల్లల సీటింగ్ వివరాలు పరిశీలించారు. అతని అనుమానం దృఢపడింది. వెంటనే నితీష్‌ని పిలిచి జవాబు పత్రం తెమ్మన్నారు. నితీష్ పేపర్‌ని చాల నిశితంగా పరిశీలించారు. తన అనుమానం నిజమని రుజువైంది. వెంటనే నితీష్‌ని దగ్గరకి రమ్మని పిలిచారు మాస్టారు.
'నితీష్.. చెప్పు ఈ జవాబులు, బిట్ పేపర్లో జవాబులు అన్ని నీ సొంతంగానే రాసావా? ఇంకెవరి పేపర్లో అయినా చూసి రాసావా?'
'ఎవరిదాంట్లో చూసి రాయలేదు సార్. నా సొంతంగానే రాసాను' నితీష్ కాస్త నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చాడు.
'అయితే ''కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి?'' జవాబు చెప్పు?' మాస్టారి గొంతులోని అదిలింపుకు 'అది.. అదీ.. కిరణజన్య సంయోగక్రియ అంటే.. అది.. మాస్టారు' నీళ్లు నమలసాగాడు నితీష్ ఇప్పుడు చేతులు కట్టుకుని..
'ఆ.. అది ఏంటో నీకు తెలియదు నితీష్. ఎందుకంటే ఆ జవాబు నువ్వు సొంతంగా రాయలేదు. పరీక్షలో నీ ముందు కూర్చున్న కైలాష్ పేపర్లో చూసి రాసావు. కాబట్టి నీకు ఆ ప్రశ్నకు జవాబు తెలియదు. నిజమే కదూ నితీష్?'
'లేదు సార్. నేను నా సొంతంగా జవాబులు రాసాను' అంటూ బుకాయించాడు నితీష్.
కోపంతో మాస్టారి కళ్ళు ఎర్రబడ్డాయి.
వెంటనే 'కైలాష్ పరీక్ష రోజు నితీష్ నీ వెనుకే కదా కూర్చుంది. నువ్వెందుకు జవాబులు చూపించావు వాడికి?' మాస్టారు అరవడంతో కైలాష్ భయపడుతూ 'జవాబులు చూపించమని నన్ను బలవంతం చేసాడు సర్. చూపించకుంటే కొడతానన్నాడు. అందుకని తనకి నా పేపర్‌ని ఇచ్చాను' అన్నాడు వణికిపోతూ.
ఇక ఎటు తప్పించుకోలేక దొరికిపోయిన దొంగలా నిలబడ్డాడు నితీష్ మాస్టారును భయంతో చూస్తూ.
'నిజం చెప్పు నువ్వు కైలాష్ పేపర్లో చూసి రాసావు కదూ మొత్తం జవాబులు' మాస్టారి గొంతు కంగుమనడంతో నిజాన్ని అంగీకరిస్తూ అవునంటూ తల ఊపాడు నితీష్ కన్నీళ్లతో.
తను చేసిన తప్పుని అంగీకరించడంతో అనిల్ మాస్టారు నితీష్‌ని దగ్గరకు తీసుకుని 'మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి. పక్కవాళ్ళు, వెనుక వాళ్ళ పేపర్లలో చూసి రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ, ఆ జవాబులు ఇంకెప్పటికీ నీకు తెలియవు. ఇప్పుడు మీరు నేర్చుకునేదంతా మార్కుల కోసం కాదు. ఈ విజ్ఞానం అంతా మీ భావి జీవితంలో ఉపయోగపడడానికి. ఇప్పుడు మీరు ఇతరుల దగ్గర కాపీ కొట్టి రాస్తే మార్కులు మాత్రమే వస్తాయి. కష్టపడి చదివి మీరు సంపాదించుకున్న జ్ఞానం మాత్రం ఎప్పుడూ మీతోనే శాశ్వతంగా ఉంటుంది. అది మీ భవిష్యత్‌కి బంగారు బాటలు వేస్తుంది. ఇంకెప్పుడూ చూసి కాపీ కొట్టి రాయనని నాకు మాట ఇవ్వు!' అంటూ నితీష్ వైపు చెయ్యి చాపారు.
మాస్టారి బోధనతో బుద్ధి వచ్చిన నితీష్ 'అలాగే సార్. ఇక నుంచి కష్టపడి చదువుతాను. ఇంకెప్పుడూ ఇతరుల దగ్గర చూసి రాయను' అంటూ మాస్టారి చేతిలో చేయి వేసి చెప్పాడు.
- రోహిణి వంజారి
90005 94630