కొల్‌కతా : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహౌమానికి భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గు సిగ్గు అంటూ బుధవారం నాడిక్కడ వామపక్షాల ఆధ్వర్యాన జరిగిన సాలిడారిటీ మార్చ్‌లో ప్రదర్శకులు నినదించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అనుకూల వైఖరిని తీసుకోవాలని ప్రదర్శకులు డిమాండ్ చేశారు. మహాజాతి సదన్ నుంచి రాంలీలా మైదాన్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ప్రారంభ మరియు ముగింపులో సంక్షిప్త సమావేశాలు జరిగాయి. రాంలీలా మైదాన్‌లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం మాట్లాడుతూ.. 'ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి హిట్లర్ మద్దతుదారులు. హిట్లర్ యూదులను ఊచకోత కోశాడు. ఆర్‌ఎస్‌ఎస్ ఆ హిట్లర్‌కు మద్దతుదారు. ఇప్పుడు యూదుల రక్షణ పేరుతో పాలస్తీనా ప్రజల ఊచకోతకు మద్దతిస్తున్నారు.'' అని విమర్శించారు. సలీం మాట్లాడుతూ, ''ఈ యుద్ధం వెనుక ప్రధాన స్పాన్సర్ అమెరికా''. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆసియాలో అమెరికా కూటమిలోకి భారత్‌ను ఇరికించింది. అలీనోద్యమం నుంచి అమెరికా అనుకూల విధానం వైపు భారత్‌ను మళ్లించింది. ఐక్యరాజ్యసమితిలో కాల్పుల విరమణ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. కానీ 120 దేశాల మద్దతుతో ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. భారతదేశం తన సాంప్రదాయ మిత్రుడినికి ద్రోహం చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి దీనిని యూదులు, ముస్లింల మధ్య యుద్ధంగా చిత్రిస్తున్నాయి. కానీ, ఇది నిజం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూదు ప్రజలు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సలీం అన్నారు. సామ్రాజ్యవాద యుద్ధాలకు వామపక్షాలు మద్దతు ఇవ్వవు. యుద్ధం ఓ వ్యాపారం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతారు. పాదయాత్ర ప్రారంభంలో మహాజాతి సదన్‌లో జరిగిన సభకు లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్‌బోస్ అధ్యక్షత వహించారు. లెఫ్ట్ ఫ్రంట్‌కు వెలుపల ఉన్న పార్టీలు కూడా పాదయాత్రలో పాల్గొనడం విశేషం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్ బెనర్జీ, ఆర్‌ఎస్‌పీ తపన్ హౌర్, ఫార్వర్డ్ బ్లాక్ నరేన్ ఛటర్జీ, సీపీఐ-ఎంఎల్(లిబరేషన్) అభిజిత్ మజుందార్, ఎస్‌యూసీఐ తరుణ్ మండల్ తదితరులు మాట్లాడారు.