- 2014వరకు రూ.4.32 లక్షల కోట్లు
- ఆ తరువాత ఎనిమిదేళ్లలోనే 8.28 లక్షల కోట్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రాలు చేసే రుణాలపై అడ్డగోలుగా పరిమితులు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో విచ్చలవిడిగా విదేశాల నుండి రుణం తీసుకుంటోంది. దీంతో విదేశీ రుణభారం భారీగా పెరుగుతోంది. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనగంటి రవికుమార్ దరఖాస్తుపై కేంద్రం అందించిన వివరాలను అధ్యయనం చేస్తే మోడీ ప్రభుత్వ హయంలో రుణభారం ఏ విధంగా పెరిగిందో అర్ధమవుతుంది. మోడీ అధికారంలోకి రాకముందు (2014 వరకు) విదేశీరుణాలు 4,32,950 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు ఈ రుణాలు 12,61,929 కోట్లకు చేరుకున్నాయి. అంటే అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 8,28,979 కోట్ల రూపాయలు అదనం. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఏఐఐబి, ఐఎఫ్‌ఏడి, ఎన్‌డిబి, ఐడిఏ వంటి పలు ఆర్ధిక సంస్థల నుంచి ఈ రుణాలను సేకరించింది. అలాగే నేరుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు 7.12 లక్షల కోట్లు ఉండగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు 88,947 కోట్లుగా రికార్డయ్యాయి. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి సుమారుగా లక్ష కోట్ల రూపాయలను విదేశాల నుండి రుణంగా సేకరించింది. మొత్తంమీద ఎనిమిది సంవత్సరాల కాలంలో విదేశీరుణం 83శాతం పెరిగింది. ప్రస్తుత దేశ జనాభా సుమారుగా 140 కోట్లు కాగా, ఒకొక్కరిపై 5,47,493 రూపాయల విదేశీ రుణభారం ఉంది.










