
మా పిల్లలను రోజూ ఆటోలో దిగబెడతాడు సూర్యం. ఆరోజెందుకో ఎంతకీ రాకపోయేసరికి వాడిల్లు అక్కడికి దగ్గరేనని చెబితే కనుక్కుని వెళ్ళాను. సిమెంట్ రేకుల షెడ్‌లో ఉంటున్నాడు. తలుపు కొంచెం నెట్టాను. లోనికెళ్ళేసరికి ఒకవారగా ఓ అమ్మాయి నన్ను చూస్తూనే ..
'ఎవరండీ మీరు? ' అన్నది భయంగా.
'మా పిల్లలను సూర్యం దిగబెడుతుంటాడు. రాలేదని ఇలాగొచ్చా' అన్నాను.
'మానాన్నకి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. రేపటికి తగ్గితే వస్తాడు' అని తన పనిలో పడింది. ఇంతకాలం సూర్యంకి ముసలి తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుగానీ ఇంత అందమైన కూతురుందని తెలీదు. మెరుపుతీగకు పర్యాయపదం అనొచ్చు ఆమెను. ఒక్కసారి చూస్తే కళ్ళు జిగేల్ మంటాయి. పేరడిగితే చెప్పింది రేవతి అని. ఒక మామూలు మనిషికి అంతటి సౌందర్యరాశి పుట్టడం గొప్ప విషయం!!
'తాగొద్దంటే మానడు. ఒంటి మీదకు తెచ్చుకుంటాడు. అమ్మపోయి ఐదేళ్లయ్యింది. అయినా ఇతగాడికి బుద్ధిరాలేదు' అన్నప్పుడు రేవతి కళ్ళు చెమర్చాయి.
'ఆసుపత్రికి రమ్మంటే నేనూ వస్తాను' అన్నాను సానుభూతిగా.
'వద్దులెండి.. నా పాట్లేవో నేను పడతాను. రోజూ ఉండేవే మా బాధలు. సంపాదనంతా దానికే తగలేస్తే కుటుంబానికి ఏం సరిపోతుందని..' బాధగా అన్నది.
మరో ఆటో ఏదైనా చూద్దామని బైటకు నడిచాను.
మరో రోజు నేను ఆఫీసుకి వెళ్తుంటే ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది రేవతి. 'రేవతీ! మీ నాన్నకెలాగుంది?' అని పలకరించాను.
'మందులు వాడుతున్నాడు. తగ్గాక వస్తాడులెండి' అని ముక్తసరిగా జవాబిచ్చింది.
'రా.. బైకెక్కు. ఎక్కడికి వెళ్ళాలో చెబితే దించేస్తాను' అని పక్కగా ఆపి, అడిగాను.
'వద్దండీ.. పర్వాలేదు. నేనెళ్తాలెండి' అని నిరాకరించింది. అసలు నా ఉనికికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదనిపించి, మనసు చివుక్కుమంది. బహుశా ఆమె అత్యంత అందమే ఆమె టెక్కుకి కారణమేమో? రేవతి ఎక్కడికి వెళ్తుందోనని గమనించేలోగా మాయమైంది. మరి శోధించే సమయం లేక ఆఫీసుకెళ్ళిపోయాను.
అప్పటికి పదిరోజుల అనంతరం మళ్ళీ సూర్యం రావడం లేదన్న మిషతో వాళ్ళ గడప తొక్కాను. నన్ను చూడ్డంతోనే వెనక్కి తప్పుకుంది రేవతి.
'మా నాన్నకింకా తగ్గలేదు. తగ్గాక వస్తాడని చెప్పాగా.. మీరెందుకొచ్చారు?' అంటూ చిన్న చిరాకు ప్రదర్శించింది.
అనవసరంగా వెళ్ళాననుకున్నా. మగాడి పొడ గిట్టనట్లుగా ప్రవర్తిస్తోందా? లేక నా రాక ఇష్టపడడం లేదా? మరి నేను కదలక తప్పలేదు.
మళ్ళీ ఒకరోజు రేవతిని చూసాను. పుస్తకాలతో వెళ్తోంది. ఏ కాలేజీలో చదువుతోందో తెలుసుకోవాలని అనుసరించాను. కానీ ఆమె ఒక సందు మలుపు తిరిగి అందులోకి వెళ్ళి, ఒక ఇంట్లోకి దూరింది. మరి రేవతి కాలేజీకి కాకుండా ఎక్కడికి వెళ్తున్నట్లు? చేతిలో పుస్తకాలు పట్టుకుని వెళ్తే అనుమానం రాదని చెప్పి, మరేదైనా చెడు పనికి పూనుకుంటోందా? సందేహం నా మనసును తొలిచింది.
ఔను! అందమైన రేవతిని ఎవరు కాదంటారు? ఆమె ఔనంటే ఎంత అడిగినా కుమ్మరిస్తారు? అసలే మంచి వయసు వేడిమీద ఉంది. పిటపిటలాడే యవ్వనం.. ఇల్లు పట్టించుకోని తండ్రి..!! కుటుంబ బాధ్యతలు మోయడానికి ఇది సాధనంగా ఎంచుకుందేమో? ఛ!!
ఈ విషయం సూర్యానికి తెలీదు.. తన కూతురు కాలేజీకి వెళ్తోందనే అపోహలోనే బ్రతుకుతున్నాడేమో? పాపం! తన అందాలను పణంగా పెట్టి, ఇంటి ఖర్చులను ఒడ్డెక్కిస్తుందేమో. ఇలాంటి అనేక అనుమానాలకు తావిచ్చింది.
నా అనుమానాలకి ఊతమిస్తున్నట్లుగా మరో సంఘటన!! మా ఆఫీసుకి దగ్గరలో రేవతి నాకు అనుకోకుండా కనిపించింది. నన్ను చూడలేదామె. గబగబ నడుచుకుంటూ వెళ్ళి, ఒక భవనంలోకి దూరింది. అది ఎవరిదో నాకు తెలుసు. రాజారవీంద్ర గారిది. ఆయనకు లెక్కలేనంత ఆస్తి. మరాయన దగ్గర రేవతికేం పని? ఆయనలాంటి వారు ఏది కావాలన్నా తమ దగ్గరకు తెచ్చుకోగలరు. డబ్బుతో దేన్నైనా కొనగలరు. ఒకవేళ రేవతి అందాన్ని చూసి వల వేయలేదు కదా? ఇంటి పరిస్థితికి తలవొగ్గి, తప్పుడు పనికి ఒడిగట్టి డబ్బు సంపాదిస్తోందా? లేకపోతే ఇంటి దగ్గర నుంచి కాలేజీకి బయల్దేరినట్లుగా వచ్చి, ఇలాంటి వ్యవహారాలు నడుపుతోందేమో?ఒక అందమైన చిత్రం అలుక్కుపోతున్నట్లుగా భావన. రేవతి తన జీవితాన్ని పక్కదోవ పట్టిస్తోందేమోనన్న అనుమానం నన్ను పీడించసాగింది.
సూర్యం మళ్ళీ మామూలుగా మా పిల్లలను స్కూల్‌కి దిగబెట్టడానికి వస్తున్నాడు. 'తగ్గిందా సూర్యం..?' అని పలకరించాను.
'ఏదో మీ దయవల్ల బాబూ!' అన్నాడు.
'ఇదిగో సూర్యం .. ఇంతకాలం నీకు కూతురున్నట్లుగానే తెలీదు.. మీ అమ్మాయి ఏం చదువుతోంది?'
అన్నాను.
'ఆ సదువులేటో నాకు తెలీదయ్యా! రోజూ కాలేజీకెళ్తాది.. వస్తాది.. అంతే. నేనూ.. నా ఆటో.. ఇవే నాకు తెలుసు' అన్నాడు బుర్ర గోక్కుంటూ.
అంటే సూర్యం ఏమీ పట్టించుకోడన్న సంగతి బోధపడింది. రోజూ వాడికి మందు గొంతులో పడితే మరే ప్రశ్న వేయడు. కూతురు ఎక్కడ్నించి తెచ్చి పెడుతోందో వాడికక్కర్లేదన్నమాట! రేవతి పక్కదారులు పట్టడానికి కారణం సూర్యం ప్రవర్తన ప్రధానకారణం కావచ్చును. రోజూ రేవతి ఉనికిని గమనించడం ఒక భాగమైపోయింది నాకు. ఒక్కోసారి ఒక్కో ఇంటికి వెళ్ళడం గమనించాను. నిత్యం రాజా రవీంద్రగారి భవంతికి మాత్రం తప్పనిసరి. ఇదేదో పెద్ద వ్యవహారమే నడుస్తున్నట్లుగా ఉంది.
కొందరనుకుంటారు తమ అందం తమకే శాపమని. కానీ రేవతికి మాత్రం అది ఒక వరమేమో! తన సౌందర్యాన్ని పెట్టుబడిగా పెట్టిందేమో! వాస్తవానికి పెళ్ళి కాని దేవకన్యలాంటి రేవతి సన్మార్గంలో ఉంటే, తనతో జీవితం పంచుకోవడానికి ఎవరైనా ఇట్టే అంగీకరిస్తారు. మరి ఈమె పంథా ఏమిటో కొరుకుడు పడటంలేదు. ఈ మధ్య కాలంలో చూస్తున్న విపరీత ధోరణులు ఇలాగే ఉంటున్నాయి. అమ్మాయిల హవా ఎక్కువగా ఉంటోంది. స్వేచ్చకి అలవాటుపడి, పక్కదారులు తొక్కుతున్నారు. సిగిరెట్, మత్తు మందులకి అలవాటు పడి, బానిసగా మారుతున్న వైఖరి సినిమాలలో చూస్తూనే ఉన్నాం. పబ్బుల్లో అబ్బాయిలతో పాటు మందుకొట్టి, సిగరెట్లు కాలుస్తూ, మాదక ద్రవ్యాలు సేవిస్తూ, అశ్లీల నృత్యాలు చేయడమూ.. టివీలో నిత్యం ఇవే కని, విని విసుగొస్తోంది కూడా.
ఒకరోజు తెల్లవారు ఝామున ఐదు గంటలకి నేను నడక కోసం వీధిలోకి వచ్చాను. ఒక ఇంట్లోంచి బైటకు వచ్చి, సైకిల్ తొక్కుకుంటూ పోతున్న రేవతిని గమనించాను. ముంగురులు చెదిరిపోయి ఉన్నాయి. నిద్రలేని మొహంలాగ ఉంది. ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాని ప్రశ్నగా మారింది. రేవతి వెనుక ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. ఆ కుర్రాళ్ళు రేవతి చేతిలో ఏవో సొమ్ములుంచడం కనిపించింది. బహుశా రాత్రంతా ఎక్కడైనా గడిపి వస్తోందేమోనన్న అనుమానం బలంగా ఏర్పడింది. ఛీ! ఓ పెళ్ళి కావలసిన అమ్మాయి ఇలా ప్రవర్తించడం జుగుప్సాకరంగా తోచింది.
ఈ విషయం మా శ్రీమతితో అంటే కొట్టిపారేసింది. 'మీకంత సందేహముంటే సూర్యాన్నే అడగచ్చు కదా! పిల్ల విషయంలో జాగ్రత్త తీసుకుంటాడేమో!' అన్న మాటకి నవ్వొచ్చింది. 'ఆయనే ఉంటే.. అనే సామెతలాగుంది నువ్వు చెప్పడం. వాడు అస్థిరుడు.. వ్యసనపరుడు.. వాడే కచ్చితంగా ఉంటే ఇవన్నీ ఎందుకనుకోవడం?' అన్నాను.
రెండు రోజుల తరువాత సూర్యంని అడిగాను... 'పిల్లకు పెళ్ళెప్పుడు చేస్తావు? నీ బాధ్యత తీర్చుకోవా?' అని.
'మనదేముందయ్యా! అంతా భగవంతుడి దయ.. అతగాడెలాగ నడిపిస్తే అలాగవుతుంది.. మనం ఎంత ప్రయత్నం చేసినా జరగాల్సింది జరగక మానదు' అని పైకి చూస్తూ దణ్ణం పెట్టాడు. సూర్యం వెళ్ళిపోయాక శ్రీమతితో అన్నాను. 'చూసావా వాడి తీరు.. గాల్లో దీపం పెట్టిన బాపతు.. అలాగ యోచించే వాడితో మనమేం చెప్పినా బదిర శంఖారావమే' అన్నాను.
కూతురి వైఖరిలో సూర్యానికి ఎటువంటి అనుమానాలు లేవని నిర్ధారణ అయింది. వాడికి ఇల్లు గడిచిపోతే చాలు. మరిక ఏ విషయాలలో తల దూర్చడు. కానీ నా మనసులో మాత్రం ఒకటే ఆవేదన... ఒక మంచి అప్సరసలాంటి పిల్ల.. పెళ్ళి వయసొచ్చాక.. ఇలాగ తిరగడం నచ్చలేదు. నా వంతుగా ఏం చేయాలో బోధపడలేదు.. ప్చ్!
ఒకరోజు నేను ఆఫీసు నుండి వస్తుంటే అప్పుడే ఎక్కడినుంచో రేవతి వస్తోంది.. హడావుడిగా వెళ్ళిపోతుంటే ఆమెను చూసిన కొందరు కుర్రాళ్ళు.. 'ఇది రాజుగారి కొలువులో పని పూర్తిచేసుకుని వస్తోందిరా..' అన్నాడొకడు.
'రాజు గొప్ప అదృష్టవంతుడురా.. మంచి కత్తిలాంటి దాన్ని పట్టాడు. నిలువెత్తు బంగారం పోయొచ్చు దీని అందానికి.. హాయిగా అనుభవిస్తున్నాడు' అని మరొకడు.
'పైకి మాత్రం పతివ్రత...కానీ ఈ యవ్వారాలెవరికీ తెలీవు.. ఆడేమో తాగుబోతు.. అందుకే ఈవిడగారి ఆటలు సాగుతున్నాయి.' అంటూ మరోడు.. ఇవన్నీ వింటున్న నా అనుమానం మరీ బలపడింది.. ఇలా లోకం కారుకూతలు కూయడానికి ఆస్కారం ఆమె ప్రవర్తనే ముమ్మాటికీ.. నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత జ్ఞాపకానికొచ్చింది.
ఈ సంగతులన్నీ సూర్యానికి చెప్పి ఓ దారిలో పెట్టాలన్న ఆశయం నాకున్నా వాడు వినే పరిస్థితిలో లేడన్నది నిజం. పోనీ నేనే రేవతికి ఎదురెళ్ళి నాలుగు చీవాట్లు పెడదామంటే నా పొడ గిట్టనట్లుగా ప్రవర్తిస్తోంది.. దానిక్కారణం ఆమె చేసే రాచకార్యాలకు నేను అడ్డంకిగా మారతానేమోనని అనుకోవచ్చు. ఏం చేయాలో అర్థం కాక నా మనసు మాత్రం మల్లగుల్లాలు పడుతోంది...వక్రగతిని పడుతున్న సగటు ఆడపిల్ల రేవతి వైఖరి గురించి.
ఒక ఆదివారం మా ఆఫీసులో పని చేసే తోటి ఉద్యోగి శ్రావణ్ నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు.
..అది సరిగ్గా రాజా రవీంద్రగారి భవంతి ఎదురుగుండానే.. ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేశాడు.. శ్రావణ్‌కి ఇద్దరు పిల్లలు. అబ్బాయిది సాఫ్ట్‌వేర్ జాబ్. అమ్మాయికింకా పెళ్ళి చేయడానికి చూస్తున్నాడు.
భోజనం చేశాక ఇల్లంతా చూపించాడు పైన బాల్కనీలోకి వెళ్ళి నించున్నాం... అప్పుడే రేవతి బైట నుంచి వస్తూ కనిపించింది. ఆమె వెంట ఒకమ్మాయి ఉంది. 'అదేనండీ మా అమ్మాయి దీప. పక్కనున్న అమ్మాయి రేవతి. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్' అని చెప్పగానే ఒక్కసారిగా అదోలాగ అనిపించడానికి కారణం దీప పక్కన రేవతి ఉండటం. ' రేవతి గురించి మీకు తెలీదు. కొన్ని విషయాలు చెప్పాలి.' శ్రావణ్‌తో చెప్పకుండా ఉందామన్నా సరే ఆగలేకపోయాను.
'రేవతి గురించి అన్నీ తెలుసు.. మీకే నేను చెప్పాలి.' శ్రావణ్ ఎదురు మాటాడటం చూసి నివ్వెరపోవడం నా వంతైంది.
'రేవతి ఒక ఆటో వాడి కూతురు. తండ్రికి కుదురులేదు. సంపాదనంతా తాగుడుకే పెడతాడు. ముసలి తల్లిదండ్రులున్నా సరే.. వాళ్ల బాగోగులు చూడడు. ఎదిగిన అమ్మాయి పెళ్ళికి ఉందన్న జ్ఞానం కూడా లేదతగాడికి. పాపం! ఈ అమ్మాయే అన్నీ చూసుకుంటోంది. ఉదయం మొదలు రోజంతా ఎంత కష్టపడుతుందో? ఉదయం పేపర్లు, పాలప్యాకెట్లు పంచుతుంది. తర్వాత కొన్ని ఇళ్ళకు వెళ్ళి ప్రైవేట్లు చెబుతోంది. మా ఎదురింటి రాజా రవీంద్రగారి కూతురు మానసిక వికలాంగురాలు. అక్కడకెళ్ళి ఆమెకు సేవలు చేస్తుంది. ఇవన్నీ చేస్తూనే మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి కూడా రానివి తను చెప్పి, చదువుకుంటుంది. ఇంత మంచి వ్యక్తిత్వం, అందమున్న పసిడిబొమ్మలాంటి అమ్మాయి, మరో కుటుంబంలో అయితే ఎంత సుఖపడేదో? కుటుంబ యజమానికి శుధ్ధిలేదు. లోకం ఏవేవో అంటుంది. కానీ అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే స్థితప్రజ్ఞ రేవతిది' అని ఆమె గురించి ఒకటొకటే చెబుతుంటే దిగ్భ్రాంతికి గురయ్యాను.
తన ఒంటి చేత్తో కుటుంబాన్నంతటినీ ఈదుకొస్తున్న రేవతి నిజంగా ఉన్నతురాలే!! ఆమె గురించి చెడుగా అంచనా వేసిన నా ఆలోచనలకు పాతరేసాను. నా హృదయంలో ఏర్పడిన మకిలి తుడిచి పెట్టుకుపోయేదాకా అణువణువూ పశ్చాత్తాపపడ్డాను. నా మనోయవనికపైన అలుక్కున్న మసక క్రమంగా మాయమవసాగింది. ఇప్పుడు నా మనసెంత వికాసంగా.. ఆహ్లాదంగా ఉందో చెప్పలేను.
కె.కె.రఘునందన
9705411897