Dec 11,2022 07:43

           'పెళ్లి చేసుకోరా నాయనా... జల్ది పెళ్లి చేసుకోరా నాయనా.. పెళ్లి వయసు దాటనీకురా నాయనా..' అంటాడో సినీ కవి. 'ముప్పై యేళ్లొచ్చాయి... ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు. నీతోటి వారందరికీ అప్పుడే పిల్లలు కూడా పుట్టేశారు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం వుందా ? లేదా? వీడికి ఈ జన్మలో పెళ్లవుతుందా? అని చూసినోళ్లంతా హేళన చేస్తున్నారంటూ... పెళ్లీడు దాటిపోతున్న పిల్లలున్న ఇంట్లో వినిపించే పెళ్లిగోల ఇది. 30వ పడిలో వున్న యువతీ యువకులను కదిలిస్తే... అప్పుడే పెళ్లా? మంచి ఉద్యోగం చెయ్యాలి... జీవితంలో స్థిరపడాలి... అప్పుడు చూద్దాం... అంటుంటారు. మూడు పదులు దాటితేనే మూడు ముళ్ల బంధం అంటూ తెగేసి చెబుతున్నారు. 'పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోరు/ ఎల్లరు సుఖము చూడాలోరు మీరెల్లరు హాయిగ ఉండాలోరు' అంటాడు సినీకవి పింగళి. కానీ... ఇప్పటి యువత ఈ రోజుల్లో ఇది నడవదు అంటున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లోని వారైతే... చదువుకోసం అయిన అప్పులు తీర్చాలనో, మంచి ఇల్లు కట్టాలనో, విదేశాలకు వెళ్లాలనో కలలు కంటున్నారు. ఉద్యోగంలో చేరగానే పెళ్లి చేసుకుంటే, కెరీర్‌ దెబ్బతింటుందనే భయం ఎక్కువమందిలో కనిపిస్తుంది. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలనే ఆత్మవిశ్వాసంతో వున్నారు. అందుకే స్థిరపడిన తర్వాతే పెళ్లి అని కరాఖండీగా చెబుతున్నారు.
            'ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి' అంటారు పెద్దలు. కానీ, చదువు, ఉద్యోగం, స్థిరత్వం... ఆ తర్వాతే పెళ్లి అనే భావన మొదలై చాలాకాలమే అయ్యింది. 'జాతీయ గణాంకాల సంస్థ' తాజా నివేదిక ప్రకారం... మన దేశంలో 15-29 ఏళ్ల మధ్య ఉండే యువత పెళ్లి ఆలోచనే చేయడం లేదట. దేశం మొత్తం మీద పెళ్లి కాని యువతీ యువకులు అత్యధికంగా ఉన్న జమ్ము-కాశ్మీర్‌, ఆ తర్వాత యు.పి, ఢిల్లీ, పంజాబు రాష్ట్రాల్లో దాదాపు 30 ఏళ్లు దాటే వరకూ పెళ్లి మాటే ఎత్తడంలేదు. వీళ్లందరి మాటా ఒక్కటే...ముందు జీవితంలో స్థిరపడాలి, తర్వాతనే పెళ్లి అని. భారత్‌లో పెళ్లిళ్ల వ్యయానికి అప్పులిచ్చే 'బెటర్‌ హాఫ్‌' సంస్థ తాజాగా ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో 21-35 ఏళ్ల 2100మంది అభిప్రాయాలను సేకరించింది. వారిలో 68 శాతం మంది ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటామని తేల్చి చెప్పారు. సొంత డబ్బుతోనే పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని 70 శాతం మంది యువత ఆ సర్వేలో వెల్లడించారు.
         ఇప్పుడు బతుకంతా ప్రైవేటు రంగం కౌగిట్లోకి చేరిపోయింది. వ్యక్తిగత జీవితం అభద్రంగా, సామాజిక జీవితం కల్లోలంగా, భవిష్యత్తు సందిగ్ధంగా పరిణమించిన ఒకానొక సంధికాలం ఇప్పుడు నడుస్తోంది. ప్రజల జీవితాలు అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా ఈ అభద్రతా భావం యువతను వెన్నాడుతోంది. దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోంది. యువతలో ఉద్యోగ రేటు 2017 కంటే ఇప్పుడు సగానికి సగం తక్కువ నమోదైందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువ వుంటే పెట్టుబడిదార్లకు అంత చౌకగా శ్రమశక్తి లభిస్తుంది. కనుకనే ఉపాధి కోసం ఎదురుచూసే పరిస్థితిని పాలకులు మరింతగా పెంచుతున్నారు. ఈ అభద్రతా భావ పరిస్థితే... యువతీ యువకుల ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ఉద్యోగం రావాలి, ఆర్థికంగా స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి అనే ధోరణి పెరుగుతోంది. ఆ అభద్రత నుంచి పుట్టిందే... ముందు స్థిరపడాలి... ఆ తర్వాతే ఏదైనా అనే ఆలోచన. కథ అయితే... కావాల్సిన చోట ఆనందాన్ని అతికించవచ్చు. వద్దనుకుంటే విషాదాన్ని తీసెయ్యవచ్చు. కానీ ఇది జీవితం... అలా కుదరదు. యువత ఆనందమయమైన వైవాహిక జీవితం గడపాలంటే... వారికి భరోసానిచ్చే ఓ వ్యవస్థ కావాలి. చదువు పూర్తికాగానే ఉపాధి కల్పించే సమున్నత వ్యవస్థ రావాలి. అలాంటి అభ్యుదయకర వ్యవస్థలోనే ఆదర్శవంతమైన నవసమాజం, స్వేచ్ఛాయుతమైన యువతరం ఆవిర్భవిస్తుంది.