
- గౌరియమ్మ స్మారక పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో
- చే గువేరా కుమార్తె అలైదా గువేరా
ప్రియమైన మిత్రులారా!
డియర్ కామ్రేడ్స్.
ఇది నిస్సందేహంగా నాకు లభించిన గొప్ప పురస్కారం. నాకు బాధ కలిగిస్తున్న విషయమేమిటంటే గొప్ప నాయకురాలు, సామాజిక సేవాతత్పరురాలు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన ఆమె కన్ను మూసిన దరిమిలా నాకు ఈ అవార్డు రావడం. మహా నాయకురాలు గౌరియమ్మ అంటే నాకెంతో అభిమానం. ఆమె నాకు ఒక సహచరురాలు మాత్రమే కాదు, మంచి మార్గదర్శి కూడా. ఆ నాయకురాలి గురించి ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరముంది. అసంబద్ధమైన ఆచారాలు, విశ్వాసాలతో చదువుకు దూరంగా ఉంటూ తరతరాలుగా అణచివేతకు గురవుతున్న మహిళల్లో చైతన్యాన్ని రగిలించిన వీర వనిత గౌరియమ్మ. అంతేకాదు, సమర్థవంతమైన పాలకురాలిగా, రచయితగా, దౌత్యవేత్తగా అన్నింటికీ మించి ఇరవయ్యో శతాబ్దిలో జన్మించిన గొప్ప మార్క్సిస్టు విప్లవకారిణి. పట్టుదలతో ఎటువంటి సంక్లిష్ట పరిస్థితినైనా సమర్థవంతంగా అధిగమించగల ధీశాలి. మరో ప్రపంచం సాధ్యమేనని దృఢంగా విశ్వసించడమే కాదు, ఇతరుల్లోనూ అటువంటి విశ్వాసాన్ని పాదుకొల్పిన నాయకురాలు ఆమె. గతంలో గౌరియమ్మను కలుసుకునే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతసిస్తున్నాను. అనేక అంశాలపై మేమిరువురం అభిప్రాయాలను, అనుభవాలను పరస్పరం పంచుకున్నాము. అమెకు అపారమైన పరిజ్ఞానం ఉంది. అటువంటి విజ్ఞాన గని నేడు మన మధ్య లేనందుకు బాధగా ఉంది.

- నా జీవిత గమనం...
చాలా మంది ఇతర క్యూబన్ డాక్టర్ల మాదిరిగానే, విభిన్న పరిస్థితుల మధ్య ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో నాకు పనిచేసే అవకాశం లభించింది. ఈ వృత్తి నాకెన్నో అనుభవాలను ఇచ్చింది. ఈ అనుభవమే లేకుంటే నేను ఒక మంచి వైద్యురాలిగా, మంచి సంఘజీవిగా నేడు మీ మధ్య ఉండేదాన్ని కాదని నిస్సందేహంగా చెప్పగలను. పిల్లల ఆరోగ్యపరిస్థితి మెరుగుపడి, వారి ముఖాల్లో నవ్వులు విరబూస్తే అంతకన్నా గొప్ప కానుక డాక్టర్‌కు ఇంకేముంటుంది? నా కోసం ఒక గౌనును తల్లి చేత కొనిపించి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, వేకువ జామునే లేచి నాతో కలిసి ఆ పిల్లలు ఆసుపత్రి చుట్టూ రెండు రౌండ్లు మార్నింగ్ వాక్ చేసినప్పుడు ఆ ఆనందం, అనుభూతి చెప్పనలవికాదు. ఒక రోగి చనిపోతే కలిగే బాధ కన్నా మించిన బాధ డాక్టర్‌కు మరొకటి ఉండదు.
క్యూబా ప్రపంచ మైత్రీ సంస్థకు చెందిన వారితో నేను పనిచేశాను. మా కుటుంబానికి ఉన్న మంచిపేరు వల్ల పలు దేశాల్లో పర్యటించే గొప్ప అవకాశం నాకు లభించింది. దీనివల్ల క్యూబా విప్లవం గురించి, నా తండ్రి జీవితం, మహోన్నత సంకల్పం గురించి ప్రపంచానికి తెలియజెప్పగలిగాను. నూతన ప్రపంచం సాధ్యమేనన్న సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా. ముఖ్యంగా పిల్లలు, నూనూగు మీసాల నూతన యవ్వనం కలిగిన పిల్లల జీవనం మెరుగ్గా, ఆనందమయంగా గడిపేందుకు, విశాల దృక్పథాన్ని అలవర్చుకునేలా పాటుపడడమే నా ధ్యేయం.
బ్రెజిల్‌లో భూమిలేని వ్యవసాయ కార్మికులతో కలసి పనిచేసినప్పుడు వారితో జీవితానుభవాలను పంచుకునే అవకాశం నాకు లభించింది. వారు తరతరాలుగా అందిస్తున్న వారసత్వ సంపద, తెలివితేటలు అనేకం వారి నుంచి నేర్చుకున్నాను. ఆ విధంగా వారికి మరింతగా చేరువయ్యాను. మనిషి జీవితానికి సుస్థిరత భూమి ఉంటేనే సాధ్యమని గ్రహించాను. వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయాల్లో స్వయంగా జోక్యం చేసుకుంటున్నాను. అయితే, దీంతోనే ఏవో అద్భుతాలు సృష్టించానని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేనేదో గొప్ప శాస్త్రవేత్తనని కానీ, అత్యంత ప్రముఖురాలినని కానీ అనుకోవడం లేదు. అయితే, మంచి క్యూబన్ పుత్రికగా ఉన్నానని మాత్రం సగర్వంగా చెప్పగలను. నా ప్రతి అడుగు దీనికనుగుణంగానే ఉండేలా చూసుకుంటున్నాను. నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. ఏదేమైనా నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞురాలిని. ఈ అవార్డు నాపై మరింత బరువు బాధ్యతలను పెంచింది. సమానత్వం, న్యాయంతో కూడిన మెరుగైన సమాజం కోసం, విభిన్న భావజాలాలతో కూడిన ఈ సమాజంలో వర్గ, వర్ణ, కుల భేదాలు లేని ఒక కొత్త వ్యవస్థ కోసం సాగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అవార్డు ఒక ప్రేరణగా ఉంటుంది. ప్రజల మధ్య సంఘీభావాన్ని పెంపొందించేందుకు జరిగే పోరాటం విజయవంతం గావించేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రతిన బూనుతున్నాను.