చూస్తున్నారేంటి
చింతిస్తున్నామనుకున్నారా
శిథిలమై ఉన్నాము
నెత్తురు చిందిన దారుల్లో
చీకటి నిండిన మడుగులో
వెలుగుతూ తరుగుతున్న
అంతిమయాత్రలో..
చిత్రవధ చేసిన క్షణాలను
కాగితాలలో నింపకండి
ఆనవాలు చిరిగిపోయి
కనుమరుగైపోతాయి
కాగడాలకు కనిపించనంతగా..
మతోన్మాదపు పైశాచికత్వాన్ని
రాతి శాసనాలపై చెక్కండి
రేపటి అసుర సంతతికి
పాఠ్యాంశాలుగా బోధించండి
వక్ర ప్రబుద్ధులుగా మారతారు..
ఉబికే నెత్తురంతా
వొక్కసారిగా చల్లబడిందేమో
ట్రోల్ మెట్రో ట్రైన్ ఆగినట్టుగా
మరక మంచిదే అనిపించిందేమో
యావత్ మానవాళి ఆమోదించడానికి
మానవత్వం మౌనం వహించింది
మేధావి మౌనం
దేశానికి చేటుగా మారినట్టు..
విత్తు వేసిన చోట
గుండె చీల్చి చూస్తే
కనిపించేది మీ చిత్రాలే
నొక్కి వత్తుడుపుండ్లు చేసిన చోట
కనిపించలేదా ఆనాటి పాల ముద్ర
చంద్రమతి మాంగల్యానికి
సూర్యగ్రహణమే పట్టింది
ఏ దివిటీతో కడగాలి
మచ్చను తుడిచి వేయాలంటే..
మానం కాదు మర్మం
జరిగింది సన్మానం కాదు అవమానం
పోయింది ప్రాణం కాదు జననం
రహస్యంపై రాక్షసత్వం రహదారి వేసింది
చర్చలతోనే సమాధి కడుతున్నారు
అతివ గోడుకి మూడు అడుగులకు
బలితల ధరణిలో
ఏ ఆకలికి మాతృత్వం పుడమిలో
భారతావని గర్విస్తోంది
తల్లిని చెరిచే కామాంధులకు
జన్మనిచ్చిన..
త్యాగమూర్తుల తనువులపై మారణకాండ
అడగలేని సమాజానికి ఓ పూలదండ
ఎన్నాళ్ళు రాయను 'ఈ' హింసాకాండ
సమాప్తం లేని యుద్ధకాండ
జరిపించండి ఆ నికృష్టులకు కర్మకాండ..
జంగం స్వయంప్రభ
88975 52022