
అపార్ట్‌మెంట్ బాల్కనీలో నుంచి వీధిలోకి చూసింది అమీనా. చీకటిగా ఉందా ఏరియా. పేదవాళ్లు, పలుకుబడి లేనివాళ్లు ఉండే ఏరియాలు చీకటిగా ఎందుకుంటాయో అనుకుంది. మురికి నీళ్లు పారుతున్న ఆ పాతబస్తీ గల్లీ రాత్రి ఎనిమిదికే భీతిగొలిపేలా ఉంది. కొన్ని నిమిషాలకు కనిపించారు ఆ వస్తున్న ఇద్దరూ. బుర్ఖాలు ధరించి చీకట్లో కలిసిపోయినట్టుగా ఉన్నారు. ఒక బుర్ఖా ముందు నడుస్తుంటే ఇంకో బుర్ఖా బెరుకుగా అనుసరిస్తోంది. తన దగ్గరికే వస్తున్న ఆ ఇద్దరి కోసం అమీనా బాల్కనీలో నుంచి హాల్లోకి వచ్చింది. లిఫ్ట్ లేని ఆ అపార్ట్‌మెంట్‌లో ఫోర్త్‌ఫ్లోర్ వరకూ ఎక్కి, వాళ్లిద్దరూ బెల్లు కొట్టడానికి మరో నాలుగైదు నిమిషాలు పట్టింది.
అమీనా తలుపు తీసింది.
ఎదురుగా నిలుచుని ఉన్నారు. ముందున్నామె ముఖం కనపడుతోంది. వెనుకున్న ఆమె కళ్లు మాత్రమే కనిపించేలా నఖాబ్‌తో ఉంది.
'సలాం మేడం' అన్నారు చిన్న గొంతుతో.
సలాంకు జవాబిచ్చి 'రా కరీమా' అంది అమీనా.
లోపల సోఫాలో కూర్చోబెట్టింది వాళ్లిద్దరిని.
'నిన్న చెప్పిన కథ మేడం...' పక్కనున్న బుర్ఖావైపు సైగ చేసి, తన బుర్ఖా తీసి పక్కన పెట్టింది కరీమా.
'నీ పేరేంటి?' అడిగింది అమీనా.
'మక్సూదా..' కరీమా జవాబిచ్చింది.
'ఆమె గొంతు విననియ్యరాదు కరీమా. అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు' నవ్వింది అమీనా.
'ఆ.. గట్లేం లేదు మేడం' తల కిందికి దించుకొని నవ్వి, మక్సూద వైపు చూసింది కరీమా.
'ఎక్కడుంటావు మక్సూదా?'
మక్సూదాకు గొంతు పెగలడం లేదు. కాళ్లు చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. భయంగా 'మెహదీపట్నం మేడం' అంది.
'ఎందుకు భయపడుతున్నావ్ మక్సూదా..?'
మక్సూదా ఇంకా బిగుసుకు పోయింది. నోరు పిడసకట్టి మాట పెగలడం లేదు. ఎదురుగా ఉన్న మంచినీళ్ల బాటిల్ అందించింది అమీనా. బాటిల్ అందుకొని, మూత తీసి తడారి పోయిన గొంతులో కాసిన్ని నీళ్ళు వొంపుకుంది మక్సూదా.
'ఇక్కడ ఉన్న ముగ్గురం ఆడవాళ్ళమే కదా. బుర్ఖా తియ్యరాదు మక్సూదా'
పట్టు తప్పుతున్న చేతుల్లో కాస్త బలాన్ని తెచ్చుకొని.. నఖాబ్ తీసింది మక్సూదా.
'బుర్ఖా కూడా తియ్యి. మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకుందువులే' అంది అమీనా.
కరీమా వైపు తిరిగి 'మేడంకు చెప్పినవా?' నొసలు ముడివేసి లోగొంతులో అడిగింది మక్సూదా.
'నువ్వేం టెన్షన్ పడకు. మేడంకు అంతా తెలుసు'
ఆ మాట వినగానే తానొచ్చిన ఈ ఇల్లు తనకు ఊతమిస్తోందని నమ్మకం కలిగి, మక్సూదా మనసు తేలిక పడింది. వెంటనే లేచి నిలబడి, బుర్ఖా తీసి మడత పెట్టి, పక్కన పెట్టింది. గంధం రంగులో పోతపోసిన బొమ్మలా ఉంది మక్సూద.
రెప్ప వేయకుండా మక్సూద వైపు చూస్తూ- 'ఈ చక్కటి చుక్కకు ఎంత కష్టమొచ్చింది?' అనుకుంది అమీనా.
'మక్సూదా! ఇట్రా, నా పక్కన కూర్చో' పిలిచింది.
తటపటాయిస్తూనే నెమ్మదిగా లేచి, అమీనా పక్కన కూర్చుంది మక్సూదా.
మక్సూదా భుజం మీద చెయ్యి వేసి, రెండో చేత్తో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమీనా. వణుకుతున్న మక్సూదా చేతిని ప్రేమగా తడిమి 'నువ్వేం తప్పు చేశావు? విధి ఆడిన ఆటలో నువ్వు బలయ్యావు. మీ ఆయన టెర్రరిస్ట్ ముద్ర వేసుకొని, జైల్లో ఉన్నంత మాత్రాన నువ్వా టెర్రరిస్ట్ భార్య పేరు మోయనవసరం లేదు' అంది.
మక్సూదా కళ్ళు నీళ్ళు నిండిన చెలమలయ్యాయి. ఇప్పటి దాకా మక్సూదాకు ఈ ప్రేమమయ హస్తం దొరకలేదు. ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. మనసు నిండా ఆనందం.
'ఏం ఆలోచిస్తున్నావ్ మక్సూదా? ఇది సోషల్ ఎంటర్‌ప్రైజ్. ఆడవాళ్ళను ఆర్థికంగా బలోపేతం చెయ్యడానికే పెట్టాను. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఏ ముద్రలు మోస్తున్నావు? నాకు వాటితో పనిలేదు. నా సంస్థలోకి వచ్చాక ఎంత శ్రద్ధగా కోర్సు నేర్చుకుంటావు..? ఎంత డెడికేషన్తో పనిచేస్తావు? ఇదే నాక్కావలసింది..!'
మక్సూదా కళ్ళల్లోంచి నీళ్ళు టపటప రాలిపడ్డాయి. అమీనా మక్సూదాను దగ్గరికి తీసుకుంది. ఏళ్ళ నుంచి అదిమిపెట్టిన బాధ ఒక్కసారి కరిగి, వెక్కివెక్కి ఏడ్చింది మక్సూదా. కుదుట పడేదాకా ఏడ్వనిచ్చి, తన చీరకొంగుతో మక్సూదా కళ్లు తుడిచింది అమీనా. కాసేపటికి మక్సూదా ఏడుపాపి,
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. ఆమె మొహంలో పెనుతుఫాను తర్వాత ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనబడింది.
ఎదురుగా ఉన్న బాటిల్‌లోంచి కాసిన్ని నీళ్ళు వంపుకొని, మరో గుటక వేసి గొంతు విప్పింది. ఆ గొంతులో ఆర్తి, ఆవేదన కన్నా ఒక శక్తి కన్పించింది.
'మేడం! నా బతుకులో ఇదే మొదలు.. నా గతం తెలిసీ నన్ను దగ్గరికి తీసింది మీరే. నా ఇద్దరు బేటిల మీన ప్రమాణం చేసి చెప్తున్నా. పని నేర్చుకొని నా బతుకు నేను బతుకుతా.. మీకు పేరు తెస్తా!'
'షబ్బాష్. రేపటి నుంచి ఆఫీసుకొచ్చేరు. మీరేం దొంగలు కాదు.. చీకట్లో చాటుగా రావడానికి. మామూలుగా రండి!' వీపు మీద తట్టి భరోసా ఇచ్చింది అమీనా.
'షుక్రియా మేడం' మెరిసే కళ్ళతో బయటికి నడిచారు ఇద్దరు.
మక్సూదా, ఆరీఫ్‌ల నాలుగో జుమ్మాగి. ఇల్లంతా చుట్టాలతో కిటకిటలాడుతోంది. దావత్ కోసం ఇంటి ముందు వేసిన షామియానాలో మగవాళ్ళు భోజనాలు చేస్తున్నారు. రాత్రి పది దాటింది. కాస్త దూరంలో ఒక జీపు ఆగింది. అందులోంచి మఫ్టీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ళు షామియానాలో కలియతిరిగి, లోపలికి వెళ్ళి ఆరీఫ్‌ని చెరోవైపు పట్టుకొని తీసుకువచ్చి జీపు ఎక్కించారు. మక్సూదాకు ఏమీ అర్థంకాలేదు. నిఖా అయ్యి నెల కూడా నిండలేదు. తేరుకునేలోపు పట్టుకెళ్లిపోయారు. ఆ అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి వెతకగా మూడు నెలలకు ఆరీఫ్ జాడ తెలిసింది. ఆరీఫ్ కాళ్ళు, చేతులు గొలుసులతో కట్టేసి, నడవలేని స్థితిలో పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పోలీస్‌లు బాగా కొట్టారని మక్సూదాకు అర్థమైంది. బెంగళూరు బాంబ్ కేసులో ఆరీఫ్, అతని ఎనిమిది మంది స్నేహితులపై కేస్ బుక్ అయ్యింది. మక్సూదా కుప్పకూలి పోయింది. ఇక బయటికి వచ్చే ఆశ లేదు. ఖులా ఇచ్చేసి, రెండో పెళ్ళి చేసుకోమని పుట్టింటి వాళ్ళు, అత్తింటివాళ్ళు మక్సూదాకు నచ్చజెప్పారు. పదిహేడేళ్ళ మక్సూదాకు మనసొప్పలేదు. అంతలోనే వేవిళ్ళు. కడుపు తీయించుకోమన్నారు. ఏవేవో మందులు వేశారు. గట్టిపిండం, తొమ్మిది నెలలకు తస్లీమా పుట్టింది. పాపను పెంచుతూ తన బాధను మర్చిపోయే ప్రయత్నం చేసింది మక్సూదా. పాపకు ఐదేళ్ళు వచ్చాయి. అత్తమామలు మక్సూదాను కూతురిలా చూసేవాళ్ళు. తస్లీమాను దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు. పొద్దున్నే పాపను స్కూల్లో దింపి, సాయంత్రం తెచ్చుకొనేది. ఒకరోజు పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళిన మక్సూదాను ప్రిన్సిపల్ పిలిచాడు. ఆఫీస్‌రూంలోకి వెళ్ళి ఆయనను కలిసింది మక్సూదా.
'చూడమ్మా! మీ పాపను ఈ స్కూల్లో ఉంచుకోలేము!'
'నా బిడ్డ ఏమన్నా తప్పు చేసిందా సార్? పసిబిడ్డ కదా. మళ్లా అట్లా జరగకుండా చూసుకుంటా!' అమాయకంగా అంది మక్సూదా.
'మా స్కూల్లో అందరూ మంచి కుటుంబాల్లోంచి వచ్చిన పిల్లలున్నారు. ఒక టెర్రరిస్టు కూతురు తమతో పాటు చదువుతుందని తెలిస్తే మా స్కూల్‌కు చెడ్డ పేరొస్తుంది. ఇదిగో టి.సి' అని కవర్ చేతిలో పెట్టాడు.
పుట్టెడు దు:ఖంతో ఇంటికొచ్చింది. మామ కోడళ్ళు తస్లీమాను తీసుకొని, చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నీ తిరిగారు. ఎక్కడా తస్లీమాకు అడ్మిషన్ దొరకలేదు. ఇక గత్యంతరం లేక దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో చేర్పించారు. అంతలోనే అత్త చనిపోయింది.
పది రోజుల పెరోల్‌పై ఆరీఫ్ బయటకొచ్చాడు. మనిషి ఎట్లనో అయిపోయాడు. ఏం మాట్లాడేవాడు కాదు. అతనికి స్వాంతన తన శరీరమే. దాని ఫలితంగా రెండోపాప నస్రీన్ పుట్టింది. ఇద్దరు పిల్లలు, ఇంకో చంటి పిల్లాడి వంటి మామగారు.. వీరితో సతమతమైంది మక్సుదా.
పాపం ఆ మామగారు దయతలిచి, తొందరగానే అల్లా దగ్గరకు వెళ్లిపోయాడు. అత్తమామలు పోయాక బయటికొచ్చి పనిచేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదు మక్సూదాకు.
ఎవరో ఇంటి దగ్గర్లో కొత్తగా పెట్టిన స్కూల్లో మక్సూదాకు ఆయా ఉద్యోగం ఇప్పించారు. పిల్లలకు లంచ్ తినిపించి, నాప్‌కిన్తో మూతి తుడుస్తోంది మక్సూదా.
అంతలోనే గట్టిగా అరుపులు వినిపించాయి ప్రిన్సిపల్ రూం నుంచి. కాసేపట్లో ఆఫీస్ బారు వచ్చి మక్సూదాను ఆఫీస్ రూములోకి పిలుచుకెళ్లాడు. ఒక చిన్నపాప మక్సూదా చెయ్యి విడవకుండా తనతో వెళ్లింది. మరో ఇద్దరు ముగ్గురు పిల్లలు వెనకాలే వెళ్లారు. అది చూసిన పిల్లల పేరెంట్స్ మక్సూదా మీద మండిపడ్డారు.. దీంతో హడలిపోయింది.
'ఏమీ మాట్లాడకుండా ఎలా నటిస్తోందో చూడండి. పిల్లలందరిని ఒకచోటకు చేర్చి, ఏ బాంబో పేల్చి చంపదని గ్యారంటీ ఏంటి? మా పిల్లల టీసిలు ఇవ్వండి.. వేరే స్కూల్లో చేర్పించుకుంటాం' ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు.
అంతలోనే కరస్పాండెంట్ కల్పించుకొని, మక్సూదాను చీదరించుకొని స్కూల్లో నుంచి బయటికి గెంటేశాడు.
పిల్లలకు తిండి పెట్టే పరిస్థితి లేదు. తమ బస్తీ నుంచి రోడ్డవతల ఉన్న అపార్టుమెంట్‌లో చాలామంది వెళ్ళి పనిచేస్తారు. వాళ్ళతో వెళ్ళి నఖాబ్ తియ్యకుండా, నోట్లో మాట బయటికి రానీయకుండా అపార్టుమెంట్‌లో పనికి కుదిరింది. మూడు నెలలు బాగానే గడిచింది. ఒక ఆదివారం పూట అపార్ట్‌మెంట్‌లో ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ జరిగింది. మక్సూదా పనిచేసే ఇంటి వాళ్లను పిలిచి, మక్సూదాను పనిలోంచి తీసెయ్యాలని ఆదేశించింది కమిటీ. టెర్రరిస్టు తాలూకు మనుషులు అపార్ట్‌మెంట్‌లోకి రావడానికి వీల్లేదని తీర్మానించింది.
మక్సూదా తప్పేముందని ఆ ఇంటి వాళ్ళు ఎంత వాదించినా లాభం లేకపోయింది.
మక్సూదాను తీసెయ్యడం కుదరకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని అల్టిమేటం జారీ చేసింది కమిటీ. గత్యంతరం లేక నెల జీతం మక్సూదా చేతిలో పెట్టి, పనిలోంచి తీసేశారు.
ఎప్పటికప్పుడు కొత్త పనులు వెదుక్కుంటూ, అవమానాలు భరిస్తూ భయం భయంగా బతుకుతున్న మక్సూదాకు ఇన్నాళ్లకు పెద్ద అండగా అమీనా కనిపించింది.
ట్రైనింగ్‌తో పాటు జీతం కూడా దొరికే ఉద్యోగం రావడం చాలా ఉత్సాహానిచ్చింది. పదో క్లాస్ చదివిన మక్సూదా సంవత్సరం కోర్సును మూడు నెలల్లో నేర్చుకొని, ఆరునెలలు తిరక్కుండానే అదే సంస్థలో ట్రైనర్ స్థాయికి ఎదిగింది.
ఏడాది తిరిగేలోపు వేరే సంస్థలో ఉద్యోగం వచ్చి, వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమీనాకు కనపడలేదు.
అమీనాకి నుదుటి మీద ముడతలు ఎక్కువగా కన్పిస్తున్నాయని నగరంలో పేరున్న స్కిన్ అండ్ కాస్మొటాలజీ సెంటర్‌లో ఫిల్లర్స్ వేయించుకోవడానికి వెళ్ళింది. పది వేల చదరపు అడుగుల్లో ఉన్న ఈ సెంటర్‌ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు.
అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది మొత్తం అమ్మాయిలే. వెయిటింగ్ లాంజ్‌లో కూర్చుని తన నెంబర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా తిరుగుతున్న సిబ్బందిని గమనిస్తోంది.
ఆడపిల్లలు ఎక్కడున్నా ఆ ప్రదేశానికే అందం వస్తుంది అని మనసులోనే ముచ్చటపడింది. అమీనా దృష్టి సడన్‌గా తను కూర్చున్న లాంజ్ ఎదురుగా ఉన్న క్యాబిన్ వైపు మళ్ళింది. చూడముచ్చటగా ముప్పైల్లో ఉన్న యువతి హడావిడిగా ఫైల్స్ చెక్ చేస్తూ, మరోవైపు వచ్చిన క్లయింట్స్‌తో, స్టాఫ్‌తో మాట్లాడుతూ కన్పిస్తోంది.
మధ్యలో రౌండ్స్‌కి వెళ్ళి వస్తోంది. లాంజ్‌లో ట్రీట్‌మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉన్న వాళ్ళతో చక్కటి ఇంగ్లీషులో మాట్లాడుతోంది. ఆమెను చూస్తే మేనేజర్ క్యాడర్‌లో ఉన్నట్లు అర్థమైంది అమీనాకు.
ఆమె లాంజ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా ఆమె మెడలో వేలాడుతున్న ఐడికార్డు చూసే ప్రయత్నం చేస్తోంది.
ఉన్నట్టుండి ఆ అమ్మాయి అమీనా వైపు తిరిగి చూసి, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి.. ఒక్క అంగలో అమీనా దగ్గరకొచ్చేసింది. అమీనా ఉలిక్కిపడి కళ్ళు పైకెత్తి ఆమెవైపు చూసింది.
మక్సూదా - రిలేషన్షిప్ మేనేజర్ అని రాసి ఉన్న ఐడి కార్డు కంటపడింది. అమీనా నోట మాట రాలేదు. కన్నార్పకుండా మక్సూదానే చూస్తోంది. దాదాపు పది ఏళ్ళు తనను చూసి.
మక్సూదా తేరుకొని 'మేడం! చూడండి నా కాళ్ళ మీద నేను బలంగా నిలబడ్డాను. హ్యాపీనా మీరు' అంటూ అమీనాను అమాంతం చుట్టేసింది.
'ఆ రోజు భయం భయంగా నా దగ్గరకొచ్చిన అమ్మాయేనా ఈ అమ్మాయి?' అప్రయత్నంగా పైకే అనేసింది అమీనా.
'నేనే మేడం. మీ మక్సూదాని. మీరు నిలబెట్టిన మక్సూదాని' ఆ గొంతులో అదే శక్తి, అదే ఆత్మ విశ్వాసం కన్పించింది అమీనాకు.
భుజాల చుట్టూ చెయ్యి వేసి, దగ్గరుండి అమీనాకు ట్రీట్‌మెంట్ చేయించింది. ఆ తర్వాత తన కేబిన్లోకి తీసుకెళ్ళి, కాఫీ తెప్పించింది అమీనా కోసం.
తను ఈ పదేళ్ళలో చేసిన ప్రొఫెషనల్ కోర్సుల గురించి, మారిన ఉద్యోగాల గురించి పూస గుచ్చినట్లు చెప్పింది.
'పిల్లలు ఎలా ఉన్నారు మక్సూదా?' మాటల మధ్యలో అడిగింది.
'బాగున్నారు మేడం. పెద్ద పాప మెడిసిన్ చేసింది. పి.జి.కి ప్రిపేర్ అవుతోంది. చిన్నది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఉంది. అల్లా దయవల్ల బాగున్నాం!'
'కడుపు నిండిపోయింది మక్సూదా. గాడ్ బ్లెస్‌యూ' అంటు కుర్చీలోంచి లేచింది అమీనా.
బయటి దాకా వచ్చి అమీనాను సాగనంపుతూ, ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంది మక్సూదా. కృతజ్ఞతలో మక్సూదా కళ్ళలోంచి రాలిన కన్నీటి బొట్లు అమీనా చేతుల్ని వెచ్చగా ముద్దాడాయి.
'కోర్టులు, చట్టాలు కాకుండా సాటి మనుషులు వేసే శిక్ష నుంచి మక్సుదాకు విముక్తి దొరికింది' అనుకుని సంతృప్తిగా కదిలింది అమీనా.