'అంతరించిపోవడం' అనే పదం ఈ మధ్య వార్తల్లో తరుచుగా వినబడుతున్న పదం. అంటే ఒక జీవజాతి పూర్తిగా కనుమరుగైపోవడం అని అర్థం. అంతరించిపోయే జాతుల్లో ఒక్క జాతినైనా తిరిగి మనుగడలోకి తీసుకొచ్చేందుకు వాటి పేరిట ఏటా దినోత్సవాలు జరుపుకుంటాం. ఈ నెల 29 ప్రపంచ పులుల దినోత్సవం అలాంటిదే. వంద కంటే తక్కువ సంఖ్యలో ఉన్న జీవజాతులు త్వరగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటాయని ఐయుసిఎన్ రెడ్‌లిస్ట్ హెచ్చరిస్తోంది. విశ్వవ్యాప్తంగా పదుల సంఖ్యలో పులులు ఉన్న అభయారణ్యాలు ఎన్నో ఉన్నాయి. అంతరించిపోకుండా ఉండాలంటే వాటి సంఖ్య పెరిగితే సరిపోతుందా..? మన్యంలో ఉండాల్సిన పెద్దపులులు మానవ ఆవాసాల్లోకి ఎందుకొస్తున్నాయి..? ఆలోచించాల్సిన విషయాలు.
పెద్దపెద్ద పంజాలతో ఎంతో ఠీవిగా రాజసంతో నడిచే పెద్దపులి గడ్డి భూములు, చిత్తడినేలలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తాయి. పిల్లిజాతిలో పెద్దపులులు అతిపెద్దవి. ఈశాన్య ఆసియాలో పొడవాటి జట్టుతో చాలాపెద్దవిగా.. సుమత్రా, ఇండోనేషియా, ఉష్ణమండల వర్షారణ్యాల్లోని పులులు చిన్నవిగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70 శాతం మనదేశంలోనే ఉన్నాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు వాటి పెరుగుదలకు సహాయపడతాయి. మనదేశంలో 53 పులుల అభయారణ్యాలున్నాయి.
గాండ్రింపులు పెరుగుతున్నాయి..
పెద్దపులులు పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకు దోహదపడతాయి. ఒకప్పుడు దేశీయంగా వీటి సంఖ్య భారీగా పడిపోవడంతో వాటిని పరిరక్షించేందుకు 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 'టైగర్ ప్రాజెక్టు'ను ప్రారంభించి, చర్యలు చేపట్టింది. దీనివల్ల ఒకప్పుడు 1800గా ఉన్న పులుల సంఖ్య పెరిగి, ప్రస్తుతం 3,167కు చేరుకుంది. మన రాష్ట్రంలో నాగార్జునసాగర్ రిజర్వు, శేషాచలం అడవుల్లో మొత్తం కలిపి 75 పులులున్నాయి. 2010లో జరిగిన గ్లోబల్ టైగర్ సమ్మిట్‌లో పాల్గొన్న దేశాలు 2022 కల్లా పెద్దపులుల సంఖ్య రెండింతలు చేయాలని నిర్ణయించాయి.
ఎలా లెక్కిస్తారు ?
అరణ్యంలో పులులు ఎక్కడున్నాయో..?! అని వెతుక్కుంటూ వాటి కంటపడకుండా తప్పించుకుంటూ వాటిని గణించడం అటవీశాఖ అధికారులకు పెద్దసవాలే! ప్రతి నాలుగేళ్లకోసారి పులుల సంఖ్యను లెక్కిస్తారు. అప్పట్లో ఫారెస్టు అధికారులు అరణ్యాల్లో నడుచుకుంటూ వెళ్లి, వాటి గుర్తులతో ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొనేవారు. ఆ తర్వాత పులుల పాద ముద్రలను లెక్కించే పగ్‌మార్క్ విధానాన్ని అమలుచేసేవారు. అంటే మనుషుల వేలిముద్రలన్నీ ఎలా ఒక్కలా ఉండవో పులుల పాద ముద్రలు కూడా ఒకేలా ఉండవు. ఆ తర్వాత పులులను పట్టుకుని, వాటిపై ముద్ర వేసేవారు. లెక్కించే సమయంలో ముద్ర ఉందో లేదో చూసి.. లేని వాటిని కొత్త జాబితాలోకి చేర్చేవారు. ఒక దశలో వాటి గోళ్లు, మలం సేకరించి.. దాని ఆధారంగా గణన చేసేవారు. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఎక్కువగా పులుల సంచార ప్రాంతాలను గుర్తించి, అక్కడ సిసి కెమెరాలను చెట్లకు అమర్చడం ద్వారా వాటిని లెక్కించడం మొదలుపెట్టారు. కెమెరాల సాయంతో వన్యప్రాణుల గణన చేపట్టిన తొలిదేశంగా భారత్ గిన్నిస్ రికార్డులకెక్కింది.
దారితప్పి మానవ ఆవాసాల్లోకి..
తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ఒక యువకుడిని, బాలికను చంపిన ఘటన.. కాకినాడ, విజయనగరం సాలూరులో పెద్దపులి సంచారం వంటి ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అటవీ ప్రాంత సమీప ప్రజలు జంతువులపై భయంతో వాటిని కొట్టి చంపేస్తున్నారు. వేసవిలో పులుల మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2012-22 మధ్య 1,062 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. పులుల వేట, అక్రమ రవాణా కూడా వాటి తగ్గుదలకు కారణమవ్వొచ్చు.
అడవుల నరికివేత, కార్చిచ్చులు, సముద్ర జలాల పెరుగుదల, వాతావరణ మార్పులు, పెద్దపులులను మానవ ఆవాసాలకు దగ్గర చేస్తున్నాయి. ఆహారం, నీటి కోసం అడ్డంకులు ఎదురైనప్పుడు మాత్రమే అవి దారితప్పుతాయి. ఆ ప్రాంతాల్లో విరివిగా గడ్డినేలలను ఏర్పాటుచేస్తే శాకాహార జంతువుల సంఖ్య పెరిగి, పులికి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. అప్పుడు అవి మనిషి జోలికి రావని, పైగా పులుల అభయారణ్యాల మీదగా సాగే రహదారులపై రాత్రివేళల్లో వాహనాలను నిషేధిస్తే అవి స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందని జంతుప్రేమికులు అంటున్నారు.