
ఊరంతా సందడిగా వుంది.
ఊర్లోని పెద్దోళ్లంతా ఆ ఊరి మధ్యలో వున్న చెట్టుకింద పోగవుతున్నారు.
అదేమీ అట్టాంటిట్టాంటి చెట్టు కాదు. దానికి వందేళ్ల చరిత్ర వుంది.
నాలుగు రోడ్ల కూడలిలో పెద్దపెద్ద కొమ్మలతో విస్తరించి వుంటుంది.
ఒకవైపు పంచాయితీ ఆఫీసు. ఆఫీసు ముందు స్థలమంతా ఖాళీగా వుంటది.
పంచాయితీ ఆఫీసుకి ఒకపక్కన మట్టి దిమ్మతో పోసిన స్టేజీ వుంటది. దానిమీదనే నాటకాలు, బుర్రకథలు, మీటింగులు పెడుతుంటారు.
దానికి ఎదురుగా మరోవైపున పేద్ద ఏనుగువడ చెట్టు వుంటది.
ఈ చెట్టు ఆ ఊరికొక ఆనవాలు.
ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఎవరో ఒకరు ఆ చెట్టు కింద వుంటూనే వుంటారు.
కుండలు అమ్ముకునేటోళ్లు, చిలగడదుంపలు అమ్ముకునేటోళ్లు.. వారి బళ్లను ఆ చెట్టుకిందే విడుస్తారు.
రెండు మూడు రోజులు ఆ చెట్టుకిందే వుండేవాళ్లు.
చివరకు గంగిరెద్దులను ఆడించాలన్నా.. ఆ చెట్టు దగ్గరే.
అక్కడే ఒక మూలగా పెద్ద నీళ్లబావి. దానికి నాలుగువైపుల గిలకలు వుంటాయి.
ఆ బావిలోంచి నీళ్లు తోడుతుంటే.. ఆ గిలకలు చేసే శబ్దం సంగీతంలా ధ్వనిస్తుంటుంది.
ఉదయం... సాయంత్రం- నీళ్ల బిందెల శబ్దాలు, గాజుల గలగలలు... వరసైన వాళ్ల పరాచికాలతో సందడిగా వుంటుంది.
కోడికూతతో పాటు... బావి గిలకల శబ్దం కూడా వేకువజాము నుండే మొదలవుతుంది.
ఎండాకాలమైతే...ఆ చెట్టుకింద చానా చల్లగుంటది.
ముసలీముతకా అంతా అక్కడ చేరి, కబుర్లు చెప్పుకుంటారు.
కొందరైతే మధ్యాహ్నం సమయంలో లేదంటే.. రాత్రి సమయంలో కిందే తుండుగుడ్డ పరుచుకుని ఆ నీడనే ఒక కునుకు తీసేస్తారు.
పొద్దునపూట పది దాటిందంటే కాస్తోకూస్తో చదువుకున్నోళ్లంతా అక్కడ చేరి, ప్రజాశక్తి పేపర్ కోసం చూస్తుంటారు.
పొద్దున్నే పేపర్ వేసేవాళ్లు ఎవరూ ఆ ఊరు రారు. అందుకే పదిగంటలకు ఆ ఊరికి వచ్చే ఉత్తరాలతో పాటు పేపర్‌ను కూడా పోస్టుమ్యానే మోసుకొస్తాడు.
ఆ స్టేజీ అన్నా... ఆ పేపర్ అన్నా బాబుగాడు పడిచస్తాడు.
పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు వేసే ఆ స్టేజీ మీద...
నాలుగో తరగతిలోనే బాబుగాడు తొలిసారిగా 'గురిగింజ గుమ్మడి' అని ఓ నాటిక ఆడేసాడు.
అంతేకాదు... కుర్రోళ్ల దగ్గర కూర్చొని పేపర్ చదివేటోడు. తెలియని విషయాలు వాళ్లనడిగి తెలుసుకునేవోడు.
గోలీలాట, కర్రాబిళ్ల, కోతికొమ్మచ్చి, చెడుగుడు ఆటల్లో బాబుగాడు దిట్ట.
అదీకాక ఐదోక్లాసుకి బాబుగాడు క్లాసులీడర్ అయిపోయాడు. అందుకే పిల్లోళ్లలో ఆడో హీరో లెక్క.
బాబుగాడు కూడా అంతేలెవల్లో ఫోజు కొట్టేవోడు.
చెట్టుకి...స్టేజీకి మధ్యనున్న ఖాళీ స్థలంలో బాబుగాడి బృందం ఎప్పుడూ గోలీలాడుతుంటారు.
ఇన్నిగాడు బాబుగాడి బృందాన్ని ఛాలెంజ్ చేశాడు. 'గోలీలాటలో ఎవరు గెలుస్తారో చూద్దాం' అని.
అసలే బాబుగాడికి, ఇన్నిగాడికీ పడదు.
అందుకే వాడి గోలీలు పగలగొట్టాలని బాబుగాడి బ్యాచ్‌గాళ్ళు గట్టి పట్టుదలగా వున్నారు.
గుండ్రంగా గీత గీసి, అందులో చెరో ఐదు గోలీలు పెట్టారు. ఎవరెక్కువ గోలీలు గెలుచుకుంటే వాడే గెలిచినట్లు.
బాబుగాడు గురిచూసి కొడితే.. నాలుగైదు గోలీలు ఒక్కసారిగా గీత దాటి బయటకు రావాల్సిందే. లేదంటే గోలీ బద్ధలవ్వాల్సిందే.
బాబుగాడు గురిచూసి కొట్టాడు. ఒక గోలీ పగిలిపోయి, ఒక చెక్క గుండ్రంగా గీసిన గీతలోనే వుండిపోయింది. ఒక చెక్క దూరంగా పడింది.
'నీకు గోలీ రాలేదు... ఇప్పుడు నేనే కొట్టేది' అంటూ వచ్చాడు ఇన్నిగాడు.
'కాదు... మళ్లీ కొట్టేది నేనే. ఆ గోలి పగిలిపోయింది కాబట్టి నాకు వచ్చినట్టే' బాబుగాడు అరిచాడు.
నేనంటే నేనని ఇన్నిగాడు, బాబుగాడు గొడవపడుతున్నారు. బాబుగాడి పక్కన ఇంకో ఇద్దరు చేరారు.
దాంతో అక్కడంతా గోలగోలగా మారింది.
ఆ చెట్టుకి మరోవైపున రోడ్డుపక్కన పెద్దోళ్లంతా ఒక్కొక్కరూ చేరతన్నారు. ఏవేవో మాట్లాడుకుంటున్నారుగానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో వాళ్లు లేరు.
అప్పటికే చెట్టుకింద జనం పోగయ్యారు.
అక్కడి నుంచి ఏసోబు తాత కేకేసాడు...
'అరే బాబుగా...ఏంట్రా ఆ గోల... ఆ... ఇక్కడంతా పెద్దోల్లు మాట్టాడుతుంటే...'
'అరేరు... పిల్లలు... పోండ్రిరా... ఇళ్లకు పోండి..' అని కేకలేసాడు.
దాంతో... గొడవ పడుతున్న పిల్లలు కొందరు వెళ్లిపోయారు.
బాబుగాడు మాత్రం... వాడి ఫ్రెండ్ జీవన్‌గాడితో కలిసి చెట్టుకిందకి వచ్చాడు.
సమయం ఉదయం 11గంటలు అవ్వొస్తాంది. ఎండ కూడా పెరుగుతోంది.
ముఖానికి పట్టిన చెమటను కుడిచెయ్యి పైకెత్తి చొక్కా చేతికి తుడిసేశాడు బాబుగాడు.
బాబుగాడికి పదేళ్లుంటాయి. ఆ ఊర్లోని ఆర్‌సిఎం స్కూల్లో ఐదోక్లాస్ చదువుతున్నాడు.
వాడు భయపడేది వాళ్ల తాతకి, స్కూల్లోని శిఖామణి మాస్టారికి మాత్రమే.
మాస్టారికి కూడా బాబుగాడంటే చాలా ఇష్టం... బాబుగాడికి మాత్రం ఆయనంటే భయం.
ఒకసారి చర్చికి రాలేదని గోడకుర్చీ వేయించాడు. మోకాళ్లు నొప్పితో ఏడ్చినంతపనైంది.
ఆ క్లాసులోని అమ్మాయిలు నవ్వుతారేమోనని.. వస్తున్న ఏడ్పును బలవంతానా ఓర్చుకున్నాడు...
బాబుగాడికి పదేళ్లేగానీ... ఊర్లో చాలామంది ఫ్రెండ్స్ వున్నారు.
బడికి వెళ్లేవాళ్లేకాదు... పనికి వెళ్లేవాళ్లు, గేదెలు కాయడానికి వెళ్లేవాళ్లలో కూడా బాబుగాడికి మంచి నేస్తాలు వున్నారు.
'బాబూ... ఇక్కడ ఏదో మీటింగ్ అంట తెలుసా...?' అన్నాడు జీవన్‌గాడు.
'తెలీదురా... ఎవరూ చెప్పలేదు'... వాళ్ల తాతయ్య కూడా వచ్చేడేమోనని వచ్చినవాళ్లలో వెతుకుతూ అన్నాడు.
ఎవర్ని వెదుకుతున్నావో నాకు తెలుసులే అన్నట్టుగా నవ్వాడు జీవన్.
ఆ సమయంలోనే ఇద్దరు మనుషులు పంచాయితీ ఆఫీసులోంచి చెరో చెక్క కుర్చీ మోసుకొచ్చి, చెట్టుకింద రోడ్డువైపున వేశారు.
ఆ కుర్చీల చుట్టూ జనం మూగారు.
అక్కడున్న కుర్రాళ్ల దగ్గరకెళ్లి 'దేవ చిన్నాన... అంతా పోగయ్యారెందుకు?' అని ఒక కుర్రాడ్ని అడిగాడు బాబుగాడు.
'అరే బుడ్డోడివి.... నీకెందుకురా ఇంటికి పోరాదు...' అన్నాడు చదువుతున్న పేపర్‌లోంచి తలెత్తి.
అతనివైపు ఓరగా చూస్తూ... కుర్చీలు వేసిన వైపు వెళ్లాడు.
ఏం జరుగుతుందా..? అని ఆసక్తిగా చూస్తున్నారు బాబుగాడు, జీవన్‌గాడు.
మాజీ సర్పంచ్ ఆంథోని తాత వాళ్లకి ఏదో చెబుతున్నాడు.
'అరే కామ్రేడా... ఆ కుర్చీలు తుడవరా' అన్నాడు ఏసోబుని.
బాబుగాడు కూడా 'కామ్రేడ్ తాతా!' అనే పిలుస్తాడు ఏసోబుని..
ఈ లోపు ఏదో కారు వస్తున్న శబ్దం... అంతలోనే తెల్లకారు వచ్చి ఆగింది.
ఆ కారులోంచి నలుగురైదుగురు దిగారు. అంతా తెల్లచొక్కాలు పంచెలు కట్టుకున్నారు. ఒకాయన మాత్రం పొడుగాటి తెల్లచొక్కా.... బాగా లూజుగా వున్న తెల్లప్యాంటు వేసుకున్నాడు.
'సుందరయ్య గారొచ్చారు... సుందరయ్య గారొచ్చారు...' అంటూ ఒక్కసారిగా హడావుడి ప్రారంభమైంది.
బాబుగాడు వస్తున్నవాళ్ల వైపు చూశాడుగానీ... వారిలో సుందరయ్య గారెవరో తెలియలేదు.
ముఖానికి పట్టిన చెమటని మరోసారి చొక్కాకి తుడుచుకొని, ముందుకొచ్చాడు.
'అరే నువ్వేంటిక్కడ పో అటు...' కసిరాడు శౌరి తాత.
అదేమీ పట్టించుకోకుండా కుర్చీలు వేసివున్న వైపు జరిగాడు బాబుగాడు.
లూజు ప్యాంటు వేసుకున్నాయన ఒక కుర్చీలో, ఇంకోకాయన మరో కుర్చీలో కూచున్నారు.
బాబుగాడు మెల్లగా లూజు ప్యాంటు ఆయన కూర్చున్న కుర్చీ పక్కకు చేరాడు.
అక్కడకొచ్చిన జనమంతా కింద కూర్చున్నారు. కొంతమంది చివరలో నుంచున్నారు.
ఒకాయన నుంచుని మాట్లాడాడు. ఆ తర్వాత లూజుప్యాంటు వేసుకున్నాయన మాత్రం కూర్చునే మాట్లాడుతున్నాడు...
'ఇంకా కొద్దిరోజుల్లో వ్యవసాయ పనులు సాగుతాయి. మీరంతా కూలి రేట్లు పెంచమని గట్టిగా నిలబడాలి. కూలి పెంచకపోతే... పనులకి వచ్చేదిలేదని.. కచ్చితంగా చెప్పండి. మీకు తోడుగా మేమంతా వున్నాం....' అని చెప్పాడు.
ఇంకా చాలానే చెప్పాడు కానీ, అవేమీ బాబుగాడి బుర్రకెక్కలేదు.
అందరి ముఖాల్లోకి చూస్తూ వుండాడు. మధ్యమధ్యలో అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొడుతున్నారు.
'ఓహో... సుందరయ్య అంటే ఈయనేనేమో' అనుకున్నాడు బాబుగాడు.
రోజూ సాయంత్రం సమయాల్లో ఆ చెట్టుకిందే కూర్చొని సుందరయ్య గారి గురించి పిల్లలకు కథలు కథలుగా చెప్పేవాడు కామ్రేడ్‌తాత.
సుందరయ్య అంటే సినిమాల్లో ఎన్టీయోడిలా వుంటాడేమో అనుకునేవోడు బాబుగాడు.
కానీ వీళ్లంతా సుందరయ్య అంటున్నారు. వీళ్లలో సుందరయ్య ఎవరో అర్థం కాలేదు బాబుగాడికి.
చివరికి మాట్లాడే ఆయనే సుందరయ్యేమో అనుకున్నాడు.
ఈయనేంటి... ఎన్టీయోడిలాగ లేడు...? తెల్లచొక్కా, లూజు ప్యాంటు వేసుకున్నాడు. అదీకాక చాలా ముసలాయన...
కామ్రేడ్ తాతేమో సుందరయ్య గారి గురించి సినిమా హీరోలా చెప్పాడు. బాబుగాడి బుర్రలో చాలా ఆలోచనలు...
కామ్రేడ్‌తాత చెప్పే కథల్లోని హీరో సుందరయ్యా, ఈయనా ఒక్కరేనా? తెలుసుకోవాలని బాబుగాడికి ఒకటే తొందరగా వుంది. కానీ, ఎవరిని కదిలించాలన్నా భయంగా వుంది.
అందరూ చర్చిలో ఫాదర్ ప్రసంగం చెబుతుంటే విన్నట్టుగా... వింటున్నారు.
కామ్రేడ్ తాతని అడుగుదామంటే.. ఆయనేమో జనాల్లో వున్నాడు.
ఈలోపు ఒకాయన- 'అరె... పిల్లలు మీరిక్కడెందుకురా... పోండి!' అంటూ వెనక్కి గెంటేశాడు.
ఎలాగైనా సుందరయ్య గారెవరో తెలుసుకోవాలని... జనాల్లోంచి నెమ్మదిగా ముందుకొచ్చి, మళ్లీ కుర్చీ పక్కన నిలబడ్డాడు బాబుగాడు.
మీటింగ్ పూర్తవగానే చెట్టుకింద కూర్చున్నవారంతా లేస్తున్నారు.
ఎవరికి వారే మాట్లాడుతుండటంతో గోలగోలగా వుంది.
అప్పటికీ సుందరయ్య గారెవరో బాబుగాడికి తెలియలేదు.
నా పక్కనున్న కుర్చీలో కూర్చున్న తెల్లచొక్కా, లూజుప్యాంట్ వేసుకున్న ఆయన కూడా లేచి రెండడుగులు ముందుకెళ్లి ఆంథోని తాతతో మాట్లాడుతున్నాడు.
బాబుగాడు మెల్లగా లూజుప్యాంట్ ఆయన లేచిన కుర్చీలో కూర్చున్నాడు.
ఆ వెనుక వున్న శౌరితాత 'ఏంట్రా.. జానెడులేవు, సుందరయ్య గారు కూర్చున్న కుర్చీలో కూర్చుంటావా..?' అంటూ నెత్తిమీద ఒక్కటి మొట్టాడు.
'అబ్బా' అంటూ మొట్టిన చోట రుద్దుకుంటూ... కుర్చీలో నుంచి లేచి, సుందరయ్య గారు మాట్లాడుతున్న వైపు వెళ్లాడు.
బాబుగాడికి తలపై బొప్పి కట్టింది... కళ్లలో నీళ్లు తిరిగాయి. నొప్పితో తలపై రుద్దుకున్నాడు.
అంత నొప్పిలోనూ సుందరయ్య గారంటే ఎవరో తెలిసిపోవడంతో... నొప్పి సంగతి మర్చిపోయాడు.
'నేనిప్పటి వరకూ ఈయన పక్కనే కదా నిల్చుంది...' అని పిచ్చ సంతోషపడిపోయాడు బాబుగాడు.
సినిమాల్లో ఎంటియోడంటే బాబుగాడికి వీరాభిమానం.
ఇప్పుడు సుందరయ్య గారిని చూసేసరికి ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది.
కామ్రేడ్ తాత చెప్పిన కథ గుర్తొచ్చింది...
''ఒకసారి సుందరయ్యగారు పోలీసుల నుంచి తప్పించుకుని ఒక ఊరిలో వున్నాడట. ఆ విషయం తెలిసిన పోలీసులు ఆ ఊరికే వచ్చేశారట. అప్పుడు పోలీసులకు కనబడకుండా దాక్కోడానికి ఒక ఇంట్లోకి వెళ్లాడట. ఆ ఇంట్లో వున్నామె... చిన్న పిల్లాడికి పాలిస్తూ పడుకుందిట. వచ్చింది సుందరయ్య గారని, పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి, పిల్లాడి పక్క నుంచి ఆమె లేచి, సుందరయ్యగారిని ముసుగేసుకొని, పిల్లాడి పక్కన పడుకోమని చెప్పిందట. సుందరయ్యగారు అలాగే చేశారట. అప్పుడే వచ్చిన పోలీసులు గుమ్మంలో కూర్చున్న ఇంటామెను 'ఇటు ఎవరైనా వచ్చారా?' అని అడిగారట. లేదని చెప్పినా వినకుండా ఇంట్లోకి వచ్చేశారట. అయ్యో... ఇంట్లో పసిపిల్లతో మా అక్క పడుకొని వుంది. మీరలా రాకూడదు అని చెప్పిందట. చిన్నబిడ్డ పక్కన ముసుగేసుకొని పడుకున్న సుందరయ్యను చూసి నిజంగానే వాళ్ల అక్క అనుకుని వెళ్లిపోయారట. సుందరయ్య గారు ఆ ఇంటామె ధైర్యాన్ని మెచ్చుకున్నారట.''
ఈ కథ కామ్రేడ్ తాత చెబుతుంటే... భలే వుంటదిలే.
'అరే... బాబూ! నొప్పిగా వుందేరా..?'
బాబుగాడికి తోకలా వాడి వెనకే వుండే జీవన్‌గాడు అడిగాడు.
కథలో నుంచి బయటపడ్డ బాబుగాడు...
నొసటిపైకి వచ్చిన జుట్టుని పైకి ఎగరేశాడు. ముఖం మీది చెమటని చొక్కాకి రుద్దేశాడు.
శౌరితాత మాటలు విన్న సుందరయ్య గారు ఆంథోనితో మాట్లాడుతూనే... వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ.. బాబుగాడి తలపై బొప్పి కట్టిన చోట చేత్తో నిమిరాడు. వాళ్లతో మాట్లాడుకుంటూ ముందుకి వెళ్లాడు.
ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
బాబుగాడి సంతోషానికి పట్టపగ్గాల్లేవు.
గాల్లో తేలిపోతున్నట్టుగా వుంది బాబుగాడికి.
కామ్రేడ్‌తాత ఒంటరిగా ఎప్పుడు కనబడతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
సుందరయ్యగారు కారెక్కగానే... ఒక్కొక్కరూ మళ్లీ చెట్టుకిందకు వచ్చేస్తున్నారు.
'కామ్రేడ్ తాతా... కామ్రేడ్ తాతా... సుందరయ్య గారు నన్ను అంటుకున్నారు... నా తలపై చెయ్యేసి ఇలా... అన్నాడు!' అంటూ యాక్ట్ చేసి మరీ చెప్పాడు.
'మరేమనుకున్నావ్... సుందరయ్య గారంటే...!'
'మనోళ్లంటే ఆయనకు చాలా ఇదిలే...' అన్నాడు.
'తాతా... ఆళ్ల ఊరులో భోజనాలు పెట్టించారని చెప్పావు కదా... ఈయనే కదా...' అన్నాడు బాబుగాడు.
'అవున్రా... ఈయన ఆస్తి అంతా పేదోళ్లకే ఇచ్చేశాడు. ఈయనెప్పుడూ ''మనోళ్ల'' పక్షమే!'.
బాబుగాడికి పెద్ద సందేహం వచ్చింది.
'తాతా... ''మనోళ్లు'' అంటే ఎవరు?'
'అబ్బో అది చానా పెద్ద కథలే. సాయంత్రం చెబుతా తీరిగ్గా.. పో... ఇంటికి పోయి, బువ్వ తిను' అంటూ వాళ్లింటివైపు వెళ్లాడు.
''మనోళ్లు'' అంటే ఎవరు? బాబుగాడి బుర్రను తొలిచేస్తున్న ప్రశ్న.
'అరే బాబుగా... గోలీలాడతావా?' అంటూ ఇన్నిగాడొచ్చాడు.
'నేనాడినా...'
''మనోళ్లు'' అంటే ఏంటో తెలుసుకునే వరకూ వాడి ఆరాటం ఆగేలాలేదు.
సాయంత్రం కోసం ఎదురుచూస్తూ... నెత్తి మీద బొబ్బను రుద్దుకుంటూ ఇంటివైపు నడిచాడు బాబుగాడు.
ఒకరోజు కామ్రేడ్ తాతను నిలేశాడు బాబుగాడు. 'ఈ రోజు నువ్వేమైనా సరే ''మనోళ్లు'' అంటే ఎవరో చెప్పి తీరాలి!' అని.
'నువ్వు పెద్దవుతున్నకొద్దీ నీకే తెలుస్తది'..
రాజాబాబు కంచర్ల
9490099231