
మెయితే, కుకీ తెగల మధ్య బిజెపి ప్రభుత్వం రగిలించిన చిచ్చు మణిపూర్‌ను నేడు నిలువునా దహించివేస్తోంది. యాభై రోజులైనా మంటలు ఆరలేదు. ఆర్మీ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దింపినా పరిస్థితి అదుపులోకి రాకపోగా, రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, బీరేన్‌సింగ్ కేబినెట్‌లో నెంబర్ టూ గా ఉన్న వ్యక్తి ఇంటికి కూడా నిప్పుపెట్టే యత్నం చేశారు, మణిపూర్‌లో శాంతిభద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ మత మారణ హోమంలో ఇంతవరకు 120 మంది హతులయ్యారు. నాలుగువేలకుపైగా ఇళ్లు తగలబడ్డాయి. 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఏ క్షణంలో దాడి జరుగుతుందో అని ప్రాణభయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బతుకు జీవుడా అంటూ. వేలాదిమంది ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. ఆహార ధాన్యాలు, నిత్యావసరాలు దొరక్క ఆకలితో అలమటించడం, వైద్యం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యమైంది. ప్రధాని చెప్పే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు వస్తే జరిగేది వికాస్ కాదు, వినాశనమేననడానికి మణిపూర్ మారణకాండ ఒక తిరుగులేని ఉదాహరణ. మణిపూర్ సంక్షోభానికి ఒక దారి చూపండని కేంద్రాన్ని కోరేందుకు ఆ రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపక్ష నేతల బృందం ఢిల్లీలో పది రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకలేదు. మణిపూర్ మండుతుంటే దానికి పరిష్కారం చూపకుండా ప్రధాని మోడీ అమెరికా యాత్రకు వెళ్లడం పలు విమర్శలకు దారితీసింది.
పక్షపాత రహితంగా పాలన సాగిస్తామంటూ ప్రమాణం చేసిన పాలక పార్టీలు రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా మతతత్వ విషాన్ని, జాతుల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తే చోటుచేసుకునే అంతులేని హింసకు తార్కాణమే మణిపూర్. మెయితే ఓటు బ్యాంకును కాపాడుకోవడం, హిందూ మతతత్వాన్ని పెంచి పోషించి మత విభజనను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని బీరేన్‌సింగ్ ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. అందుకోసమే రాష్ట్రంలోని మెజారిటీ వర్గమైన మెయితేలకు ఎస్‌టి రిజర్వేషన్లు కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. మెయితేలను ఎస్‌టి జాబితాలో చేర్చే ప్రక్రియపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారికి రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా కొండ ప్రాంతాల్లోని తమ భూములు కొల్లగొడితే, ఉద్యోగాలు ఎగరేసుకుపోతే తమ గతేంటంటూ గళమెత్తిన కుకీలపై బీరేన్‌సింగ్ సర్కారు మద్దతున్నట్లు భావిస్తున్న గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో మొదలైన ఈ హింసాకాండ రావణకాష్టంలా నేటికీ మండుతూనే ఉంది. మెయితేలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు, నాగాలు తదితర ఆదివాసీలు, కొండ ప్రాంతాల నుంచి మెయితేలు వలసపోతున్నారు. మెయితేలలో అత్యధికులు హిందువులు, కుకీ తదితర గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పేరుతో ఇంఫాల్‌లో అనేక చర్చిలను బిజెపి ప్రభుత్వం కూల్చేసింది. అనంతర హింసాకాండలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వందలాది చర్చిలతోసహా ఆసుపత్రులు, అంబులెన్సులు సైతం నిత్యం తగలబడుతూనే ఉన్నాయి. వైద్యం అందక చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. పరస్పర విద్వేష విషం ఎంతగా పాకిందంటే తమ ప్రత్యర్థులకు ఆహారం, తాగునీరు సైతం అందకుండా చేసేవరకూ. మణిపూర్ రైఫిల్స్ నుంచి, పోలీసుల నుంచి ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో ఎక్కువ భాగం మెజార్టీ తెగ అయిన మెయితేల వద్దే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 'ఆ ఆయుధాలను దయుంచి తిరిగి ఇచ్చేయండి' అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనంగా చేస్తున్న విజ్ఞప్తులు బిజెపి ప్రభుత్వ అసమర్థ పాలనకు ఓ మచ్చుతునక. మంటలు చెలరేగిన 25 రోజుల తరువాత తీరిగ్గా అక్కడికి వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 15 రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడతాయని హామీ ఇచ్చి వచ్చారు. ఆ తరువాత హింస పెరిగిందే తప్ప తగ్గలేదు. మెయితేలకు బీరేన్‌సింగ్ ప్రభుత్వం కొమ్ముకాస్తుండటంతో గవర్నర్ నేతృత్వంలోని శాంతి కమిటీకి సహకరించేందుకు కుకీలు నిరాకరించారు. ప్రభుత్వం మీద తమకు నమ్మకం పోయిందని కుకీలు అంటుంటే, కుకీలను అదుపు చేయడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోందని మెయితేలు విమర్శిస్తున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంకుచిత మతతత్వ ధోరణే ఈ సమస్యకు మూలం. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈశాన్య ప్రాంతంలో అశాంతి దేశ సమైక్యత సమగ్రతలకు ముప్పుగా మారక ముందే ముణిపూర్ సమస్యకు ఒక పరిష్కారం చూపాలి.