
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న గుంపుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఎంతటి హేయమైన చర్య ఇది! అక్కడ జరుగుతున్న అమానవీయ ఘటనలను చూసి దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. అన్నింటికీ మించి తమని పోలీసులే ఆ గుంపుకి అప్పగించారంటూ ఒక బాధిత మహిళ చెప్పిన మాటలు మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ప్రభుత్వాలు చేతులెత్తేస్తే తామే న్యాయం చేస్తామంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహంతో చెప్పడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుని మత్తు వదలాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపు చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడంలో అర్థం లేదు. అక్కడి ప్రభుత్వం పట్ల ఒక వైపు వారికి నమ్మకం లేదు. పక్షపాత వైఖరితో నమ్మకాన్ని పోగొట్టుకుంది. జాతుల మధ్య వైరం పెంచడం సులభమైన పని. మంటలు అంటుకున్న తర్వాత వాటిని ఆర్పడం కష్ట సాధ్యం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. మణిపూర్ గాయాల్ని మాన్పి శాంతి, సామరస్యతలను సాధించాలంటే ముందు అక్కడి ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. కేంద్రం చేయాల్సిన మొదటి పని అది. మహిళల పట్ల నేరానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించగలిగితే అది శాంతి స్థాపనకు మొదటి మెట్టు అవుతుంది. అక్కడ ఇంకా బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్ని హీన నేరాలో? మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకుగాను... కేంద్రం లోను, ఆ రాష్ట్రంలోను అధికారంలో వున్న బిజెపి చిత్తశుద్ధితో ప్రయత్నించడం అవసరం, అన్నివైపులా.
- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.
ఆజ్యం పోసిన పాలకులు
భరతమాత వారసులం, నిజమైన దేశభక్తులం అంటూ అనునిత్యం గొప్పలు పోతుంటారు మోడీ, షా లు. చర్చిలను ధ్వంసం చేస్తున్న, మహిళలను వివస్త్రలు చేస్తున్న వీడియోలను విశ్వమంతా చూస్తుంటే దేశానికి అవమానమట. ఓవైపు దేశంలో మణిపూర్ రగులుతుంటే అటువైపు కూడా తొంగి చూడని ప్రధాని ఫ్రాన్స్ పర్యటన చేశారు. పార్లమెంటుకు రావడానికి ముందు మోడీ మనుసు బాధ, ఆగ్రహంతో నిండిపోయిందంటూ కార్చిన మొసలి కన్నీరు మతోన్మాద పన్నీరే కదా. ప్రధాని పార్లమెంట్ బయట ఎందుకు ఆగ్రహం వెళ్లగక్కుతారు? పార్లమెంటులో మౌనం వహిస్తారెందుకు? ప్రజలకు మాయమాటలు, అబద్ధాలు చెప్తూ మతోన్మాదులకు అండదండలందించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? గుజరాత్ మారణకాండను కళ్ళకు కట్టినట్లు వివరించిన తీస్తాసెల్వాద్‌కు శిక్షలెందుకు? మతోన్మాద ప్రమాదాన్ని వివరించిన తులసీ చందుకు బెదిరింపులెందుకు? ప్రజల మధ్య చిచ్చు పెట్టే పాలకులరా రాజీనామాకు సిద్ధమవ్వాలి. లేదా హిమాలయాల్లో జపం చేసుకోవాలి. అపుడే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం తప్పుతుంది.
- వి.వెంకటేశ్వర్లు, లక్ష్మీనగర్, కర్నూలు.
ఎంతకాలం ఈ మౌనం ?
ఇటీవల వెలుగు చూసిన మణిపూర్ అమానుష, అమానవీయ ఘటన హృదయాన్ని కలిచివేసింది. దు:ఖంతో గుండె మండిపోయింది. ముద్ద నోట్లోకి కూడా వెళ్లడం లేదు. రాజ్యం చేసిన గాయానికి భారతమాత సిగ్గుతో తలదించుకుంది. కుకీ మహిళలను నగంగా ఊరేగించిన ఘటన దేశ మహిళలకు మాత్రమే కాదు. దేశ సార్వభౌమత్వానికి కూడా అవమానమే. నడి రోడ్డు మీద దుర్ఘటనకు పాల్పడిన వాళ్లని ఏమీ చేయలేని మూర్ఘుడి పాలనలో ఉన్నందుకు ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. తమ డబుల్ ఇంజన్ పాలన ఉన్న చోటే దాడులను నివారించలేని ప్రధాని... దేశ మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? కంటి తుడుపు మాటలు సమస్యకు పరిష్కారమా? భారతంలో నిండు కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి కారకుడైన దుష్ట దుర్యోధనుడిని .... మహా సేనాని భీష్ముడు, పాండవులు ఏమీ చేయలేని నాటి దుస్థితిలోనే నేడు రాజ్యముందా? కళ్లకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడిలా పాలకుల తీరు ఉందా! మేధావులూ స్పందించండి. దేశ ప్రజలారా...కళ్లతో చూసి కాళ్లతో నడిచి వెళ్లిపోకండి. నిలబడండి. ప్రశ్నించండి. మన ఇంటి బిడ్డకు జరిగిన అన్యాయంగా మణిపూర్ దారుణాన్ని ఖండించండి. నిర్లజ్జగా, నిర్భయంగా ప్రవర్తించిన నిందితుల వెనుకున్న అసలు దోషులను శిక్షించాలని కోరండి. గుండె గాయాల నుంచి రక్తం స్రవిస్తుంటే చేతులు కట్టుకున్న పాలకుల చేతల్ని నిలదీయండి.
- సుధాకిరణ్
పాలనా వైఫల్యమే
మే నెల నుంచి మణిపూర్ మంటల్లో కాలి బూడిద అవుతున్నా... దేశ ప్రధాని కనీసం ఒకసారైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కానీ, అదే సమయంలో ఎన్నికల క్యాంపైన్ కోసం కర్ణాటక రాష్ట్రంలో పలుమార్లు పర్యటనలు చేశారు. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. మాకు మాత్రం అధికారమే కావాలి అన్నట్లు ఉంది. అదే విధంగా భవిష్యత్తులో అధికారం చేపట్టేందుకు వివిధ పార్టీలతో కార్యాచరణ సమావేశాలు, విదేశీ పర్యటనలకు మాత్రం ప్రధాని మోడీకి సమయం ఉంటుంది. కానీ, దేశంలో ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి సమయం కేటాయించకపోవడం బాధాకరం. ప్రపంచానికి, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండటానికి మాత్రం ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయడం, మీడియాపై ఉక్కుపాదం మోపడం, ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కడం చూస్తున్నార. దేశ ప్రజలను కులాలు, తెగలు, మతాలు, భాషలంటూ విభజించే ధోరణులకు చెక్ పెట్టండి. ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన అందించండి.
- ఐ. ప్రసాదరావు
ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ
ఈ అత్యాచార ఘటన చాలా అలస్యంగా వెలుగులోకి రావడం మొదలు ఇప్పటి దాకా మణిపూర్‌లో జరిగిన అల్లర్లలో దాదాపు 142 మంది హతులయ్యారు. అంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయనక రీతిలో రక్తం ఏరులై పారిందో మనం ఇట్టే ఊహించవచ్చు. ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన వెంటనే ఈ ఘోర అత్యాచారం, హింసాకాండకు కారకులైన వారిపై తక్షణమే కఠిన చర్యలకు ఆదేశించడం కొంతలో కొంత ఉపశమనం. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆ నరరూప రాక్షసులు ఏ గుహల్లో, కొండల్లో దాక్కున్నా వారి జాడ కనుక్కొని, న్యాయస్థానం బోనులో ఎక్కించి శిక్షించాల్సిన గురుతర బాధ్యత డబుల్ ఇంజన్ సర్కార్‌ది.
- బుగ్గన మధుసూదనరెడ్డి,
బేతంచెర్ల, నంద్యాల జిల్లా.