Jun 15,2022 21:29

-విషవాయువు వల్ల ఇద్దరు మృతి
-మరొకరి పరిస్థితి విషమం
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :
తిరుపతి స్మార్ట్‌ సిటీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌ కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. గ్రౌండ్‌ డ్రెయినేజీ మ్యాన్‌హోల్‌ను క్లియర్‌ చేయడానికి లోపలికి దిగిన ఒక పారిశుధ్య కార్మికుడు, ఆయనను రక్షించే ప్రయత్నంలో పారిశుధ్య వాహన డ్రైవర్‌ దుర్మరణం చెందారు. వీరిద్దరినీ రక్షించేందుకు లోనికి దిగిన కూలీ అవస్థతకు గురయ్యాడు. బుధవారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... తిరుపతి వైకుంఠపురం వద్ద మూసుకుపోయిన భూగర్బ డ్రెయినేజీ మ్యాన్‌హోల్‌ను క్లియర్‌ చేయడానికి కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుడు మహేష్‌ (33) లోనికి దిగాడు. విషవాయువు ప్రభావంతో ఆయన స్వస్థతకు గురై బయటకు రాలేకపోయాడు. ఆయనను రక్షించేందుకు లోనికి దిగిన పారిశుధ్య వాహనం డ్రైవర్‌ ఆర్ముగం (35) అక్కడికక్కడే మృతి చెందాడు. వారిద్దరిని కాపాడేందుకు లోనికి దిగిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన కూలీ లచ్చన్న అస్వస్థకు గురయ్యాడు. స్విమ్స్‌ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మహేష్‌ మృతి చెందాడు. కాగా, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు దిగిన ఘటనలో 2008లో ఒకరు, 2011లో మరొకరు మృతి చెందాడు.
రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌
ఆర్ముగం, మహేష్‌ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని మేయర్‌ డాక్టర్‌ శిరీష, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అనుపమ అంజలి ప్రకటించారు. సచివాలయ వార్డు అమ్యూనిటీని, మున్సిపల్‌ ఎఇని సస్పెండ్‌ చేస్తున్నట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని రుయా వద్ద సిఐటియు ధర్నా
మృతుల కుటుంబానికి రూ.50 లక్షల చొప్పురన పరిహారం ఇవ్వాలని, రుయాలో చికిత్స పొందుతున్న కూలీకి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేస్తూ రుయా ఆస్పత్రి ఎదుట సిఐటియు ఆధ్వర్యాన ధర్నా జరిగింది. మ్యాన్‌హోల్స్‌ను ఆధునిక యంత్రాలతో శుభ్రం చేయించాల్సి ఉన్నా కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విమర్శించారు.
మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, మృతుల కుటుంబంలో ఒకరికి చొప్పున ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.