Jul 31,2022 17:50

భయంకర నిజాలు తెలుసుకోవడానికి, ఆటవిక పశుసంస్కతి ప్రళయ భీకరాన్ని దర్శించడానికి, మతం చాటున జరిగే ఘోరకత్యాల కుట్రల లోతులు పరిశీలించడానికి, నరమేధం ఎన్ని ఏరుల రుధిరవరదలను, ఎన్ని బండ్ల కళేబరాలను, ఎన్ని టన్నుల మాంసపు ముద్దలను సష్టిస్తుందో ఊహించడానికి సాధ్యంకాని వాటి లెక్కలు కొంతైనా తెలుసుకోవడానికి 'మానవతపై దాడి' పుస్తకాన్ని చదవాలి.
ఈ పుస్తకం చదవాలంటే గుండెదిటువు కావాలి. రాత్రి నిద్రపోయే ధైర్యం కావాలి. భవిష్యత్తు నిర్ణయించుకునే పటుత్వం కావాలి. మతం చాటున ఆటవిక, అనాగరిక రాజ్యనిర్మాణానికి జరిగే ప్రయత్నాల ప్రమాదాలు ఎంత తీవ్రమైనవో ఇందులో అర్థమవుతుంది. రాజ్యం, రాజ్యాధికారం ఉన్మాదుల చేతుల్లో ఉంటే ఎంతో బలమైనదిగా భావించే పోలీసు వ్యవస్థతో పాటు, ఇతర రాజ్యవిభాగాలు నిష్క్రియాపర్వతంగా ఎలా మారిపోతాయో తెలిసిపోతుంది.
భయంతో శరీరం కంపించిపోతుంది. మనం నిలుచున్న ఈ నేలలో ఇలాంటివి జరిగితే.. తలుచుకుంటే వణుకు పుడుతుంది. ఎంతటి ఉన్మాదుల మధ్యలో మనం బతుకుతున్నామో, ఆ ఉన్మాదుల మాటలు, చేతలు ఎంతటి ప్రళయాన్ని సష్టించడానికోనని గగుర్పాటు కలిగిస్తుంది.
క్రూర మగాల ఏలుబడి.. ఈ రాజ్యంలో భారతావని భవిష్యత్తు.. అందులో భాగంగా తన భవిత పట్ల కలత చెందడం కాకుండా, కర్తవ్యాలను నిర్ణయించుకునే స్థిరచిత్తంతో చదవాలి. అందమైన నందనవనంలోకి వచ్చిన ఇంతటి క్రూరమగాలను ఏరిపారేసుందుకు, మానవత్వాన్ని నిలుపుకునే మార్గాన్వేషణకు ఈ పుస్తకం ఎంతో తోడ్పడుతుంది.
2002లో గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన మారణకాండపై పౌర ప్రతిస్పందన (కన్సర్నడ్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌) నివేదికలోని కొన్ని భాగాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జర్మనీలో హిట్లర్‌ పైశాచిక మార్గదర్శకత్వంలో జరిగిన ఫాసిస్టు నరమేధం గురించి, శరణార్థ శిబిరాల గురించి, రాజ్యం, రాజ్యాధికార నేతలు కలిసి చేసిన క్రూరమైన, అమానవీయమైన ఘోరాల గురించి విన్నాము. వాటి నమూనాగా గుజరాత్‌లో జరిగిన సంఘటనలు కళ్ళకుకట్టినట్లుగా ఈ పుస్తకంలో కనిపిస్తాయి.
1992లో బాబ్రీ మసీదు విధ్వంసం, 2002లో ఆ అయోధ్యకు 'ఇంటికో ఇటుక' అంటూ కరసేవకుల యాత్ర.. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 27న గుజరాత్‌ రాష్ట్రంలోని గోద్రా రైల్వేస్టేషన్‌ దగ్గర సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు యస్‌-6 బోగి కాలిపోయింది. ఇందులో 58 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 26 మంది స్త్రీలు, 12 మంది పిల్లలు, 20 మంది పురుషులు ఉన్నారు. ఈ బోగి దగ్ధం కావడానికి నిర్దిష్ట కారణాలు ఇప్పటికీ శాస్త్రీయంగా రుజువు కాలేదు. ఇలాగే ఎక్కడో జరిగినట్లు గుర్తుకువస్తుందా?! ఆ... జర్మనీలోని పార్లమెంట్‌ భవన్‌ దగ్ధం కావడమే. అదేమిటో అది కూడా ఎవరు కాల్చారో ఇప్పటికీ రుజువు కాలేదు. ఇవన్నీ వింతలు! గోద్రాలో చనిపోయిన మతదేహాలను అహమ్మదాబాద్‌కు తరలించడం తెల్లవారే లోపే జరిగిపోయింది. గుజరాత్‌లోని మొత్తం 24 జిల్లాలకుగాను 16 జిల్లాల్లో ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు మైనారిటీల ఊచకోత జరిగింది.
ఈ దారుణ మారణకాండలోని అనేక సంఘటనలను రుజువులతో ఈ పుస్తకంలో వివరించారు. అందులో 28వ తేదీ అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్‌ సొసైటీ (చమనుర) పై 20 వేల మందికి పైగా సాయుధ మూకలు చేసిన దాడి.. ఆ దాడిలో తనతోటి వారి ప్రాణాల రక్షణకై రెండొందల ఫోన్‌ కాల్స్‌ చేసిన ఎక్కడి నుండి సహాయం రాక తనకు తాను ఆత్మార్పణ చేసుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చిన మాజీ కార్మికనాయకుడు, కాంగ్రేసుకు చెందిన పార్లమెంట్‌ మాజీ సభ్యుడు అసహాన్‌ జాఫ్రీ హత్య.. 70 మందిని నరికి, కాల్చివేసిన సంఘటన.
నరోదాగాంప్‌, సరోడా పాటియాలలో జరిగిన సంఘటన మానవజాతి కలంకిత చరిత్రలో ఘోరాతిఘోరమైనది. కౌసర్బానో అనే నిండు గర్భవతి గర్భాన్ని ఖడ్గంతో చీల్చి, పిండం నేల మీద పడక ముందే కత్తి మొనకు గుచ్చి మంటల్లోకి విసిరేశారు. ఖైరున్నీసా అనే తన కూతురు మీద 11 మంది మానవమగాలు దారుణంగా అత్యాచారం చేసిన సంఘటనను మరుఖ్బనో ఈ ట్రిబ్యూనల్‌లో వివరించారు. ఇమ్రాన్‌ అనే ఆరు సంవత్సరాల పిల్లవాడి నోట్లో పెట్రోలు పోసి, అగ్గిపుల్ల గీసి నోట్లో వేసి తునాతునకలుగా పేల్చివేశారు. పతేపురలోని దహెద్లో మహమ్మద్‌ ఈషాఛారు అనే 65 సంవత్సరాల వికలాంగుడైన వద్ధుణ్ణి సజీవంగా దహనం చేశారు. ఇదే ప్రాంతంలోని ఒక కాంక్రీట్‌ ఇంట్లో 15 కుటుంబాల వారు భయవడి దాక్కున్నారు. ఆ ఇంటి చుట్టూ చేరిన నరరూప రాక్షసులతో ఆ మహిళలు రెండుగంటలు ప్రతిఘటించారు. చివరకు ఆడవాళ్లను రోడ్డుపైకి తెచ్చి, నగంగా మార్చి.. వేధించారు. దీన్ని సహించలేని ఆ దారుణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ముగ్గురు యువకులను చంపేశారు.
ఇంకోచోట రాత్రిపూట ముస్లీంల షాపులను తగలబెడుతున్న ఇద్దరు దుండగుల్ని స్థానికలు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. వారిని ఉదయం 11 గంటలలోపు విడిపించకపోతే ప్రతి ముస్లిం ఇంటిని తగులపెడుతామని హెచ్చరించారు. దీంతో నిందితులను విడిచిపెట్టమని ముస్లింలు పోలీస్లకు విజ్ఞప్తి చేశారు. అబస్నా అనే గ్రామంలో ఓ ముస్లీం కుటుంబంలోని ఐదుగురు వ్యక్తుల్ని నిద్రిస్తున్న వారిని నిద్రిస్తున్నట్లుగానే అతికిరాతకంగా నరికేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ నేతల పర్యవేక్షణలో, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఈ నరమేధం జరిగిందనేందుకు ఎన్నో సాక్ష్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వారు వాడిన కత్తులు, త్రిశూలాలు, ప్రత్యేకమైన రసాయనాలు, పెట్రోలు ఆయుధాలను సమకూర్చినవారు భయోత్పాతమైన విధ్వంసం కోసమే ఈ ఏర్పాట్లు చేశారు.
మహిళలను లక్ష్యంగా చేసుకొని చేసిన మగకేళి వెనుక పశుసంస్కతే కాదు, మైనారిటీ వర్గంలో శాశ్వత భయాన్ని సష్టించాలనే దీర్ఘకాలిక వ్యూహం ఉంది. ఎంపిక చేసిన వారి ఆస్తులు ధ్వంసం చేయడం వెనుక ఒక వర్గాన్ని ఆర్థికంగా నిరాశ్రయులను చేయడం, చంపడంతో ఆగకుండా దహనం చేయడం వెనుక ఖననం చేసే ముస్లీం మతాచారాన్ని ధిక్కరించడం అనే మతాధిక్యత అనే మధ్యయుగాల నాటి భావజాలం ఉంది.
ఈ దారుణ పరంపరలో గుజరాత్‌ రాష్ట్రంలోని 270 మసీదులు, దర్గాలు కూల్చివేయడం వెనుక మతాన్ని, సంస్కతిని అవమానించడం, పోలీసువ్యవస్థను తాము కోరినంత సమయం నిర్వీర్యం చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని కబంధం చేసుకోవడంలోని బలాన్ని చూపడం, తమ నీచకార్యాలకు కట్టుకథలు అల్లె మీడియా ప్రాధాన్యత ఏమిటో ఈ హింసాత్మక సంఘటనల రిపోర్టింగ్‌ లేకుండా చేయడం ద్వారా రుజువు చేయడం వారి లక్ష్యం.
ఈ ఘోరం గుజరాత్‌కే పరిమితం కాదు. అక్కడ ఓ ప్రయోగం జరిగింది. దాని ఫలితం రాష్ట్రంలోనే కాదు, దేశాన్ని కూడా పాలించగలిగేటట్లు చేసింది. ఇదే ప్రయోగం దేశవ్యాపితంగా జరిగితే మానవజాతి తరతరాలుగా నిర్మించుకున్న శాస్త్రీయత, నాగరికత, మానవీయత ఏమౌతాయి? శవాలగుట్టల మీద నిర్మించే మతరాజ్యం ఏం సాధించడానికి? ఆకలి తీర్చలేని, ఆరోగ్యాన్ని కాపాడలేని, ఉపాధి కల్పించలేని, మనసుల మధ్య ఐక్యత సాధించలేని పాలన వల్ల ఏం ప్రయోజనం? అని ప్రశ్నించాలి. మానవాళి ఐక్యతతో, విజ్ఞాన వీచికలతో, శాస్త్రీయ భావాల మార్గంలో, దోపిడి రహిత, విశ్వమానవ రాజ్య నిర్మాణామే ప్రత్యామ్నాయ పరిష్కారం.

- వి. రాంభూపాల్‌
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, అనంతపురం.