'గృహప్రవేశానికి రేపు తాతగారింటికి వెళ్తున్నావు. మామయ్య సాయంత్రం వస్తానని చెప్పాడు. పాఠశాలలో రెండు రోజుల సెలవు అడుగు' తల్లి చెప్పగానే పన్నెండేళ్ళ ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గబగబా పాఠశాలకు బయలుదేరాడు.
పాఠశాలకు చేరినప్పటి నుండి పల్లె ప్రయాణం గురించి మిత్రులతో చర్చించడం మొదలు పెట్టాడు. పల్లె అందాలు, పల్లె బంధుత్వాల గురించి వివరించాడు. మిత్రులు కూడా ఆసక్తిగా వినసాగారు. ప్రధానోపాధ్యాయుడితో సెలవు మంజూరు చేయించుకున్నాడు. ఇంటికి వెళ్ళటంతోనే మామయ్య కనిపించేసరికి ప్రశాంత్‌లో మరీ జోష్ పెరిగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మామయ్య చేతుల మధ్య ఒదిగిపోయాడు. భోజనాలు పూర్తయ్యాయి. మామయ్య పక్కన చేరిన ప్రశాంత్ కబుర్లు చెబుతూనే నిద్రలోకి జారుకున్నాడు.
పక్షుల అరుపులతో మేల్కొన్నాడు ప్రశాంత్. అప్పటికే మామయ్య స్నానం చేసివచ్చాడు. ప్రశాంత్ మామయ్యతోపాటు ఫస్ట్ బస్సు ఎక్కేసాడు. రెండు గంటల ప్రయాణం తరువాత ఇద్దరూ పల్లె చేరుకున్నారు. ప్రశాంత్‌కి అందరూ పలకరింపుల స్వాగతం పలికారు. తరువాత మేడపైకి వెళ్ళాడు. చుట్టూ పొలాలు, పచ్చని పైరు చూడముచ్చటగా కనిపించింది. మనస్సుకు తెలియని ఆనందం కలిగింది. పల్లె ఎంత బాగుంది! అనుకున్నాడు.
ఇంతలో పాము, పాము అంటూ గోల వినిపించింది. ఆతృతతో కిందకు దిగిన ప్రశాంత్ అటువైపు వెళ్ళాడు. ఒకతను కర్రతో పామును చంపడానికి వచ్చాడు. ప్రశాంత్ తాతగారు అడ్డుకున్నారు. శుభమా అని గృహ ప్రవేశం చేస్తున్నాం. పాముని చంపొద్దు వారించాడు.
అలాగైతే ఎలా? ఇది విషజంతువు. ఇప్పుడు దారి మళ్లించినా ఏదో ఒక రోజు ప్రమాదమే చెప్పాడు కర్ర తెచ్చిన వ్యక్తి. అవి మన నివాసాలపై పడితే మనం ఊరుకోవాలా? వెనుక నుంచి మరో మనిషి వకాల్తా పుచ్చుకుని మాట్లాడాడు.
ప్రశాంత్ కల్పించుకుని అవి మన నివాసాల దగ్గరకు రాలేదు. మనమే వాటి నివాసాల దగ్గర ఇల్లు కట్టుకున్నాం.
పొలాలన్నీ విషపూరితం చేశాం. అందుకే ఇలా వస్తున్నాయి చెప్పాడు ప్రశాంత్. ఇలా పాములు ఇళ్ళల్లోకి రాకుండా ఉండాలంటే నా దగ్గర ఓ కిటుకు ఉంది ఊరించినట్టు అన్నాడు ప్రశాంత్
అందరూ ఏమిటి? అంటూ ముక్తకంఠంతో అడిగారు.
సాయంత్రం చెబుతాను అన్నాడు ప్రశాంత్.
గృహ ప్రవేశం పూజలు పూర్తయ్యాయి, మరో పక్క భోజనాలు పూర్తయ్యాయి.
ఓ పట్నం పిల్లోడా! కిటుకంటూ ఊరించావు, చెప్పకుండా తిరుగుతున్నావు అని అక్కడకొచ్చిన పెద్దలు అడిగారు.
మీరందరూ ఆచరిస్తానని మాట ఇస్తే చెబుతాను షరతు పెట్టాడు ప్రశాంత్.
నువ్వు చెప్పేది ఆచరించాక ఫలితం రాకపోతే గడుసుగా అడిగాడు అందులో ఒకరు.
మీరంతా రైతులు. అందరి ఆకలి తీర్చే నిస్వార్థ పరులు. సంకల్పబలంతో దేనినైనా సాధించగలరు అంటూ ఆచరించవలసిన విధానాన్ని చెప్పాడు ప్రశాంత్.
ఇంతేనా... అంటూ తేలిగ్గా అనేశారు పెద్దలు. ఇది చిత్తశుద్ధితో ఆచరించండి. సంవత్సరం పోయాక నేను ఇక్కడకు వస్తాను. పాముల బెడద తగ్గిందని మీరే చెబుతారు. నమ్మకంగా చెప్పాడు ప్రశాంత్.
అలాగే అన్నారు. ఆరు మాసాలు గడిచాక తాతగారి నుండి ఓ ఉత్తరం వచ్చింది.
ప్రియమైన మనవడికి,
ఆశీస్సులు. నువ్వు పాముల నిరోధానికి వేసిన మంత్రం ఫలించింది. ఇప్పుడు ఇళ్ళల్లోకి వచ్చే పాముల బెడద తగ్గింది. నీ రాక గురించి గ్రామ పెద్దలు ఎదురు చూస్తున్నారు.
ఇట్లు
మీ తాతయ్య
ఏం మంత్రమేసావని అమ్మ అడిగింది. ప్రకృతి వ్యవసాయం చేయమని సలహా ఇచ్చాను. ఇంత వరకు రసాయనాలు పొలాల్లో ఉండడం వలన పాములు బయట తిరిగేవి. ప్రకృతి వ్యవసాయం చేపట్టాక పాములు ఊపిరి పోసుకొని పుట్టింటికి చేరాయి. ఇదంతా పర్యావరణ విద్యలో నేను నేర్చుకున్న మౌలిక సూత్రం నవ్వుతూ చెప్పాడు ప్రశాంత్.
బి.వి.పట్నాయక్