May 21,2023 09:07

మనం పచ్చటి పొలాల్లోకి గానీ, చెట్లలోకి గానీ వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే ఒకింత హాయిని పొందుతాం. చిన్నప్పుడే మొక్కలకూ, మనకూ ఉన్న అవినాభావ సంబంధం గురించి చదువుకున్నాం. అవి మనలా నడవలేవు, మాట్లాడలేవు గానీ మిగిలిన ప్రక్రియలన్నీ మిగిలిన ప్రాణుల్లానే చేస్తాయని ఆధునిక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటంతటవే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇంకా చాలా రకాలుగా మనమే వాటిపై ఆధారపడతాం. మన మానసిక, శారీరక పరిస్థితులపై మొక్కలు ప్రధానపాత్ర వహిస్తాయనడానికి శాస్త్రీయ ఆధారాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
'మొక్క' అనే పదానికి అనేక భాషలలో 'మమ్మల్ని చూసుకునేవి' 'మాకు ప్రాణమిచ్చేవి' అనే అర్థాలను క్రోడీకరించేవారు. నాగరికతలు మారేకొద్దీ మనిషి మొక్కలను ఉపయోగించే, వాటితో అనుసంధానించే విధానాలూ మారుతూ వచ్చాయి. ఆహారం, ఔషధాల రూపంలో మొక్కలపై కొంతకాలం ఆధారపడ్డాడు మనిషి. ఆధునిక సమాజంలో ఆ అవగాహన కూడా లోపిస్తూ వచ్చింది. వాటి సహజస్థితిని మార్చేసి, అలంకరణ వస్తువుగా మాత్రమే చూస్తున్నారు. మొక్కలు అందం కోసమే కాక వాటిని మనలో భాగంగా గుర్తించి, నిరంతరం వాటిని గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.

  • సరిగమలకు స్పందిస్తాయా..

మొక్కలు మదువైన సంగీతాన్ని వింటాయని, ప్రశాంత వాతావరణంలో బాగా పెరుగుతాయని, కఠినమైన శబ్దం వచ్చే ప్రదేశాల్లో మొక్కలు బాగా పెరగలేవని జగదీష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. కొన్ని మొక్కలు శరీర రసాయనిక మార్పులనూ సమన్వయ పరచగలవు.

  • ఒక దానితో ఒకటి..

అవును. మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, పర్యావరణ ప్రతిస్పందనలను సమన్వయం చేస్తాయని పరిశోధనలలో తేలింది. బోస్‌ మొక్కల నాడీవ్యవస్థపై అధ్యయనం చేసి, మొక్కలకు ప్రాణం ఉందని మొట్టమొదట నిరూపించారు. అవి ఇతర జీవులవలే నాడీ వ్యవస్థను కలిగి ఉన్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయని ఆయన వివరించారు. తదుపరి అధ్యయనాలలో పర్యావరణ ప్రతిస్పందనలకు రసాయనిక, ఎలక్ట్రానిక్‌ సంకేతాలను విడుదల చేసి, వాటి ప్రతిస్పందనలను వ్యక్తం చేస్తాయని తెలిసింది. లాన్‌మవర్‌తో కత్తిరించిన మొక్కల కణాలు ప్రోటీన్స్‌ను విడుదల చేస్తాయి. వాటిద్వారా పక్కనున్న మొక్కలు వాటికీ ప్రమాదం ఉందని గ్రహిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.

3
  • సృజనాత్మకతతో..

మొక్కలు, వాటి పువ్వులు రకరకాల రంగులలో ఉంటాయి. ఆ రంగులు మనిషి మెదడును ఉత్తేజ పరచి, సృజనాత్మకతను పెంచుతాయి. ఫ్లెమింగో జాతికి చెందిన పువ్వులు కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిని గణనీయంగా తగ్గిస్తాయి. చిన్న చిన్న ఇళ్ళలోగానీ, ఇరుకు గదుల విద్యాలయాల్లోగానీ, కార్యాలయాల్లో గానీ రోజంతా ఉన్నప్పుడు మనసంతా చికాకు, తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు పచ్చని చెట్ల మధ్యగానీ, తోటలోగానీ తిరుగుతూ వాటి మీద శ్రద్ధపెడితే కొద్దిసేపటికి శాంతంగా ఆలోచించగలిగే శక్తి వస్తుంది.
పాజిటివ్‌ థింకింగ్‌..!
మొక్కలు మనం వదిలే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌ను విడుదల చేయటం వలన వెలువడే స్వచ్ఛమైన గాలి మనలో పాజిటివ్‌ ఆలోచనలను కలుగచేస్తాయి. చిన్న గదుల్లో ఎక్కువ సమయం గడపవలసిన పరిస్థితి ఉన్నప్పుడు బ్లూ స్టార్‌ ఫెర్న్‌, ఫైకస్‌ బెంజమినా, క్లోరోఫైటమ్‌ కోమోసమ్‌, ఆంథూరియం జాతులను ఇండోర్‌గా పెంచుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. చెస్‌ ఆటగాళ్లు పచ్చని ప్రదేశాల్లో ఆడేటప్పుడు ఉత్సాహంగా ఆడి వారి పూర్తి నైపుణ్యాన్ని చూపగలుగుతారు.

2
  • మనసు తెలిసి..

మొక్కలు మనిషి మానసిక పరిస్థితిని మార్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. వాటి నుండి విడుదలయ్యే స్వచ్ఛమైన గాలి వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. మొక్కలు మనిషిలో సంతోషానికి కారణమైన ఎండార్ఫిన్‌ అనే హార్మోన్ల విడుదలను పెంచుతాయి. ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. తద్వారా డిప్రెషన్‌, ఆందోళన తగ్గిస్తాయి. ప్రశాంతంగా ఉండడానికి తోడ్పడతాయి. పాజిటివ్‌ ఆలోచనలను కలిగిస్తాయి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తాయి. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

  • సహజ పర్యావరణం కోసం..

జీవన విధానంలో మార్పు రాకపోతే 2050 నాటికి పదిమందిలో ఏడుగురు నగరాలలో నివశించడం వల్ల సహజ పర్యావరణానికి దూరంగా పెరగవలసి వస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా. కోవిడ్‌ తర్వాత బ్రిటన్‌ మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. యుకె 7.6 బిలియన్ల పైగా ఖర్చుపెట్టి, పర్యావరణ పునరుద్ధరణకు పూనుకుంది. ప్రపంచ వ్యాపితంగా ఇలాంటి అవేర్‌నెస్‌ వస్తే భూమి పచ్చదనంతో వర్ధిల్లుతుంది.