చల్లని నవ్వులో వెన్నెల కురియదు
తెల్లని దుస్తుల్లో మానవత్వం వికసించదు
పాల నురగలో నీటి చుక్క కానరానట్టే
మంచితనమనే ముసుగులో
మనసుకు పట్టిన మలినం కనబడదు!
ఆర్భాటాల కోసం
పాప పరిహారార్ధ నిమిత్తం
నిత్య సంతర్పణలు చేసినంతనే
మంచి మనసుకు ఆనవాళ్లు కాదు
మహనీయులు కాలేరు!
మనసున్న చేయలేని స్థితిలో
చేతనైనంత చేయాలనే ఆరాటంలో
లోక సంరక్షణార్థం కట్టెపుల్లలా కాలిపోతూ
నిశీధిలో మిణుగురులా వెలుగును ప్రకాశిస్తూ...
అనామకులుగా అంతర్ధానమైన
మహోన్నత వ్యక్తిత్వాలే ఆదర్శం
మాటలతో గాక చేతలతో
చేయూత ఇచ్చే సమాజ సేవకులే మార్గదర్శనం
బాధ్యతను నెరవేర్చే దిశగా ప్రయత్నించే
మంచి మనసున్న మహాత్ములే
మహోన్నత శిఖరాలకు నిలువెత్తు నిదర్శనం !!
జ్యోతి మువ్వల
90080 83344