కొంచెం చోటు ఇవ్వు
నీతో పాటు సర్దుకుంటాను
ఓ చిన్న గూడు కట్టుకుంటాను
కొన్ని కొత్త గాలులను పరిచయం చేస్తాను..
కొన్ని సంగతులను మూటగట్టిస్తా
కొన్ని జ్యోతులను మీ ఇంట్లో పెడతా
నీ వాకిట్లో వెలుగు రేఖల తోరణాలు కడతా
మనం ఎప్పుడూ భిన్నమే కదా
గౌరవించుకుందాం వెలివేసుకోక
సాధించుకోక హేళన చేసుకోక
సోదరా... అవన్నీ సౌలభ్యం కోసమో
పరిస్థితులవల్లో భయంవల్లో నమ్మకాలవల్లో విధానంవల్లో మధ్యలో వచ్చినవి కదా! నేలతల్లి బిడ్డలం మనం, చెమట మనహితం
కష్టం మన మతం.. ధర్మం మన అస్తిత్వం
అందరం ఎప్పుడో ఒకప్పుడు దగాపడ్డవాళ్లమే
అగాధంలోంచి పైకొచ్చిన వాళ్లమే
కొంచెం తెలివితో బతకనేర్చిన వాళ్లమే
మరి ఇలా ఆక్రమించుట తగునా మిత్రమా
ఎదిగాక బాధ్యతతో కూడిన ఒదుగుండాలి కానీ అడ్డూ అదుపూ లేని విపరీతం కాదు
పరిసరాన్ని మనిషిని లెక్క చేయవా
అన్నం పెట్టిన పిడికిళ్లనే నరికేస్తావా
మిగులుబాటును పంచవా
వ్యక్తిగతం కాదు సామూహికం
ఒక్కడివే కాదు అందరం..నేల ఎవరిది చెప్పు
ఇలా హస్తగతం చేసుకోవటానికి!!
మరి రేపటి భవిష్యత్తు..ఏడ తల దాచుకోవాలి
అటవీ సంపద జీవారణ్యం పశుపక్ష్యాదులు ఏమైపోవాలి.. వదులుకో ఆప్తమా కొంచెం..
అందరూ సరిపోయేటట్టు సర్దుకో..
అందరికీ సరిపెట్టేటట్టు మలుచుకో...
- రఘు వగ్గు
96032 45215