Sep 24,2022 06:55

శ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల కొన్ని కొత్త విషయాలు కనుగొన్నారు. అందులో మొదటిది, 'ఆర్‌ఎస్‌ఎస్‌ అంత చెడ్డదేమీ కాదు' అంటూ ఒక పత్రికా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత, మళ్ళీ కొత్తగా ఇంకో విషయం కనుగొన్నారు. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ వున్నారని తాను విశ్వసించడం లేదన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, ''ఈ సంస్థలేవీ కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) పరిధిలో పనిచేయడం లేదని బహుశా మీకు తెలిసి వుండదు. ఇప్పుడవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో వున్నాయి.'' అన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం పరిధిలో సిబిఐ ఇక వుండబోదన్న నిర్ధారణకు ఆమె ఎలా వచ్చారన్నది తెలియదు. ఎందుకంటే, అధికారికంగా, పిఎంఓ పరిధి లోని సిబ్బంది, శిక్షణా విభాగం పరిధిలో సిబిఐ వుంటుంది. ఆ రకంగా, వాస్తవాన్ని తప్పుగా చెప్పడం ద్వారా ఆమె, ప్రధానిని నిర్దోషిగా తేల్చారు.
        ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలో బిజెపికి సహాయం చేయడానికి తృణమూల్‌ నేత నిర్దిష్టమైన రాజకీయ చర్య తీసుకున్నప్పటి నుండి ఈ బుజ్జగింపు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించినపుడు, గైర్హాజరవ్వాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందుకుగాను తమని సక్రమంగా సంప్రదించలేదంటూ కుంటి సాకు చెప్పారు. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి అప్పటి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌. గైర్హాజరవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం అత్యంత తీవ్రమైన అసాధారణ అంశం. మూడేళ్ళ పాటు తనను, తన ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక అభ్యర్ధిని నిలబెడుతుంటే మమతా బెనర్జీ ఎందుకు మద్దతివ్వలేకపోయారు? అంటే కనీసం ఆమె మద్దతుదారులు కూడా వివరించలేరు.
      మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లో పడినందున బహుశా ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని పట్ల అకస్మాత్తుగా ఈ మెతక వైఖరికి వచ్చి వుండవచ్చు. ప్రభుత్వంలో అత్యంత హేయమైన రీతిలో అవినీతి పెచ్చరిల్లుతోందని పార్థా చటర్జీ వ్యవహారం బట్టబయలు చేసింది. ఈ వ్యవహారం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని, అసహ్యాన్ని కలగచేసింది. అయితే ఇన్నాళ్ళుగా అనుమానిస్తున్నదీ లేదా తెలిసినదీ ఇప్పుడు ప్రజల ముందుకు మరింత స్పష్టంగా వచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అల్మారా నుండి మరిన్ని అస్థిపంజరాలు బయటకు రానున్నాయి. బొగ్గు గనుల కుంభకోణంలో ప్రస్తుతం సాగుతున్న ఇ.డి దర్యాప్తులతో ప్రమాదంలో పడ్డామని మమతా బెనర్జీ భావిస్తున్నారు. ఈ కుంభకోణంలో మమత మేనల్లుడు, ఆమె రాజకీయ వారసుడు అభిషేక్‌ బెనర్జీ, ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో, నరేంద్ర మోడీలో మంచి గుణాలను కనుగొనడం చూస్తుంటే ఎలాగైనా అవినీతి-క్రిమినల్‌ సిండికేట్‌ను పరిష్కరించేందుకు తృణమూల్‌ అధినేత్రి పట్టుదలతో, అసహనంతో వున్నారని తెలుస్తోంది. ఏదేమైనా, సంఫ్‌ు-బిజెపి కూటమితో మమత ఇటువంటి రీతిలో జత కట్టడం పెద్ద ఆశ్చర్యం కలిగించబోదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తిగా ఎదగడం, వాజ్‌పేయి ప్రభుత్వం లో మమత కేబినెట్‌ మంత్రిగా వుండడం తో సహా బిజెపితో పొత్తులు పెట్టు కోవడం ద్వారా మమత రికార్డు సృష్టించారు.
      ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొనే, ఫాసిస్ట్‌ వ్యతిరేక పోరాట యోధురాలిగా ఆమెను చూసే వామపక్షాల్లోని కొంతమందితో సహా చాలామందికి... మమతా బెనర్జీ ఇటీవల చేసిన ఈ ప్రకటనలు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమి స్తాయనడంలో సందేహం లేదు. అయితే, సిపిఎంకు, వామపక్ష సంఘటనకు అటువంటి భ్రమలేమీ లేవు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన నిందితులందరికీ శిక్ష పడాలని, తద్వారా క్రిమినల్‌-అవినీతి కూటమిని అంతమొందిం చాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున సాగుతున్న ప్రజా నిరసనోద్యమాలకు ఈ పార్టీలు నాయకత్వం వహిస్తున్నాయి.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)