Nov 22,2022 07:29

హిళలు, బాలికలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇక కోవిడ్‌ కారణంగా చాలా మంది ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కోల్పోయారు. చాలా కుటుంబాల్లో మూడు పూటలా తిండి లేదు. ఉన్న ఆహారాన్ని మగవాళ్ళకే ఏర్పాటు చేయడంతో మహిళల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళలకు సంపాదన లేకపోవడం వల్ల సరైన ఆహారం అందటంలేదు. చాలా కుటుంబాల్లో వేతన జీవులు మగవారే. దీంతో మహిళలు తమకు కావలసిన ఆహారం, ఆరోగ్య అవసరాలు తీర్చుకోవడానికి మగవారిపై ఆధారపడాల్సి వుంటోంది. ఒకవేళ ఏ రకమైన ఉపాధి కార్యక్రమాల్లో పాల్గొన్నా...పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు, సౌకర్యాలు అందటంలేదు. అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో ఈ వివక్షత ఎక్కువగా కొనసాగుతోంది. నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, కుటుంబ కట్టుబాట్లు, సామాజిక అంశాలు కీలక పాత్ర పోషించడంతో...నేటికీ ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మహిళలు, బాలికలు వెనుకంజలో ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి మహిలను కుంగదీస్తున్నాయి. అనేక కుటుంబాలు చేయడానికి పని దొరకని పరిస్థితుల్లో వున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మరెన్నో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. భవిష్యత్‌ తరం బలంగా ఉండాలంటే మహిళల ఆరోగ్యం, శక్తి మీదనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మరువ రాదు. అందుకోసం ముఖ్యంగా మహిళలు, బాలికల ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ముఖ్యంగా ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ విద్య, వైద్యం, మహిళా సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు మంజూరు చేయాలి. పాఠశాలలు అందుబాటులో ఉంచాలి. మహిళల పట్ల వివక్షత ఉండరాదు. మహిళలను పిల్లలు కనే యంత్రంగా చూడరాదు. వండి పెట్టే మనిషిలా, సేవలు అందించే యంత్రంలా చూడటం మానాలి. మహిళలు లేకపోతే పురుషుల మనుగడే లేదని గ్రహించాలి. సాటి మానవులవలే మహిళలను చూసే విధానం అందరిలో రావాలి. మహిళల అభివృద్ధే దేశాభివృద్ధి అని డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పిన మాటలు మనసులో ఉంచుకుని, ముందుకు సాగటమే మనందరి కర్తవ్యం.

- ఐ.పి.రావు,
సెల్‌ : 6305682733