Apr 18,2023 15:24

ప్రజాశక్తి-సామర్లకోట(కాకినాడ) : బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార చాత కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ప్రచారజాత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టనుండి సామాన్యుల సమస్యలను పక్కనపెట్టి పెద్దలకు ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టే పనిలో బిజెపి నిమగం అయిందన్నారు. బిజెపి ఎన్నికల ముందు పేద ప్రజల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని ప్రజలను మోసం చేశారని అన్నారు. నిత్యవసర ధరలు తగ్గిస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకే బిజెపి అధికారంలోకి వచ్చిందా అనే తీరుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాల అన్యాయం చేసిన బిజెపి అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రంలోని ప్రజలకు ఈ పార్టీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. మరోపక్క విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్ముతున్న ఒకరు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టాల్సి ఉండగా దానిని కూడా గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్‌ కు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే జాతాను ప్రజలందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలం శ్రీనివాస్‌, కరణం శ్రీనివాస్‌ నాయకులు విప్పర్తి కొండలరావు, కరణం సత్యనారాయణ, బాలం హరి, నరవ సురేష్‌ కుమార్‌, దారపు రెడ్డి కృష్ణ, కోన శివ, సిహెచ్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.